‘లంచ్ బాక్స్’ మ్యాజిక్!

ABN , First Publish Date - 2022-06-26T18:21:47+05:30 IST

స్కూళ్లు తెరిచారు... పిల్లలకు లంచ్‌బాక్స్‌లో ఏం పెట్టాలి? ఏ వంటల్ని వాళ్లు ఇష్టంగా తింటారు? ‘టిఫిన్‌ డబ్బాను చూడగానే

‘లంచ్  బాక్స్’ మ్యాజిక్!

స్కూళ్లు తెరిచారు... పిల్లలకు లంచ్‌బాక్స్‌లో ఏం పెట్టాలి? ఏ వంటల్ని వాళ్లు ఇష్టంగా తింటారు? ‘టిఫిన్‌ డబ్బాను చూడగానే పిల్లల నోరు ఊరేలా మంత్రదండం ఏదైనా ఉంటే బావుణ్ణు...’ అని ‘బ్యాక్‌ టూ స్కూల్‌’ రోజుల్లో ప్రతీ తల్లి ఆలోచిస్తుంటుంది. 


కరోనా దెబ్బతో దాదాపు రెండేళ్ల తరవాత పూర్తిస్థాయిలో స్కూళ్లు తెరిచారు. ఈ సమయంలో తల్లిదండ్రుల ఆలోచనలన్నీ పిల్లల చుట్టే. పిల్లల చదువు ఓవైపు, పిల్లల తిండి మరోవైపు. రోజులో సుమారు ఏడు గంటల పాటు పిల్లలు స్కూల్‌లో గడుపుతారు. ఉదయమే చాలామంది పిల్లలు హడావిడిగా పాలు తాగేసి స్కూల్‌కు పరుగెడుతారు. అందుకే టిఫిన్‌, లంచ్‌కి ఏమేం పెట్టాలి అన్నది తల్లిని వేధించే పెద్ద ప్రశ్న. వండిన ఆహార పదార్థాలను తాజాగా ఉంచే టిఫిన్‌ డబ్బాల గురించి ఆన్‌లైన్‌లో, సూపర్‌ బజార్లలో వెతుకుతుంటారు. పిల్లలకు అన్నీ కొత్తగా ఉండాలనే ఆశ. కాబట్టి పాత టిఫిన్‌ డబ్బాలన్నీ అప్పటికే అటకెక్కి ఉంటాయి. టిఫిన్‌ బాక్సులేనా... వాటర్‌ బాటిల్స్‌, లంచ్‌ బ్యాగులూ కూడా ట్రెండీగా చూసుకోవాలి. లంచ్‌ బాక్సుల్లో ఎన్నో వెరైటీలు... లేటెస్ట్‌ స్టయిల్స్‌, సైజులు. స్టీల్‌, ప్లాస్టిక్‌ డబ్బాల్లో రకరకాలు... వాటిని ఎంపిక చేసేప్పుడు ఇవి మర్చిపోకూడదు.


గుర్తుంచుకోవాల్సినవి...

 పిల్లల కోసం టాక్సిక్‌ ప్లాస్టిక్‌లను వినియోగించకుండా సురక్షితమైన మెటీరియల్‌తో లంచ్‌ బాక్స్‌ తయారుచేసి ఉండాలి. ఎకో ఫ్రెండ్లీ బాక్సులు శ్రేయస్కరం.

 సైజు మరీ పెద్దగా, చిన్నగా కాకుండా ఉండాలి. స్కూల్‌ బ్యాగ్‌లో పట్టేలా లేదా పిల్లలు సులభంగా తీసుకుని వెళ్లేలాంటిది ఎంచుకోవాలి.

 అన్ని రకాల ఆహార పదార్థాలు పట్టేలా బాక్స్‌లో విడి విడి భాగాలు ఉంటే మంచిది.

 డబ్బాలోని పదార్థాలు ఒలికిపోకుండా ఉండే లీక్‌ప్రూఫ్‌ లాంటివి చూడాలి. వీటి వల్ల డబ్బాలోని పదార్థాలు తాజాగా కూడా ఉంటాయి.

 సులభంగా శుభ్రపరచుకునేలా ఉన్న లంచ్‌బాక్స్‌లు తీసుకోవాలి. ఈ విషయంలో ఒక మూత ఉన్న డబ్బాలే చాలా మటుకు సులభంగా ఉంటాయి.


టైమ్‌ టేబుల్‌...

ఇడ్లీ, దోశ, పెసరట్టు, ఉప్మా, చపాతీ, పోహా, రోటీ, శాండ్విచ్‌, బ్రెడ్‌ జామ్‌... ఇలా టిఫిన్లలో ఎన్నో రకాలు. అయితే పిల్లలకు అన్నీ నచ్చడం అన్నది ఎనిమిదో వింతే. అలాగే మధ్యాహ్న భోజనంలో పులిహోర, సాంబార్‌ రైస్‌, పప్పు, కూర, రసం అన్నం, పెరుగు లాంటివి పెడుతుంటారు. ఉదయం లేవగానే ఏం వండాలని తలపట్టుకోకుండా... వారంలో చేయదలచుకున్న బ్రేక్‌ ఫాస్ట్‌లు, లంచ్‌ల గురించి ఓ టైమ్‌టేబుల్‌ వేసుకుని వంటింట్లో అతికించుకోవాలి. దీనివల్ల ఉదయం లేవగానే ఏం వండాలన్న టెన్షన్‌ తగ్గుతుంది. ముందురోజు రాత్రే కూరగాయలు కట్‌ చేసుకుని పెట్టుకోవడం వల్ల సమయమూ ఆదా అవుతుంది. పిల్లలకు ఫుడ్‌ టైమ్‌ టేబుల్‌ గురించి పరిచయం చేసినట్టు అవుతుంది. పిల్లల ఆరోగ్యమే ప్రధానం కాబట్టి హెల్దీ ఆహారానికే పెద్ద పీట వేయాలి. అందుకే వేపుళ్ల లాంటివి పిల్లల బాక్సుల్లో పెట్టకూడదంటారు న్యూట్రిషనిస్టులు. మారే ఉష్ణోగ్రతల వల్ల ముక్కల కన్నా మొత్తం పండునే పెట్టడం మంచిది. దీనికి అరటి, ద్రాక్ష, స్ర్టాబెర్రీ, జామ పళ్లు చక్కని ఎంపిక. 


బెంటో బాక్స్‌...

చూడచక్కని లంచ్‌ బాక్సులని అందించడంలో జపనీయులు ముందున్నారని  సర్వేలు తెలియజేస్తున్నాయి. ఈ లంచ్‌బాక్స్‌లను ‘బెంటో’గా పిలుస్తారు. ‘బెంటో’ పదం చైనీయుల నుంచి వచ్చింది. దీనికి ‘అనుకూలమైన’ అనే అర్థం ఉంది. కార్బోహైడ్రేట్లు (రైస్‌ లేదా నూడుల్స్‌), ప్రోటీన్లు (మాంసం లేదా చేప), వండిన లేదా ఉడికించిన కూరగాయలు ఉండే సంపూర్ణ ఆహారం బెంటో లంచ్‌ బాక్సు. కుకీలు, పండ్లు, డ్రైఫ్రూట్స్‌, స్వీట్స్‌ను అక్కడక్కడా అలంకరణకు వినియోగిస్తారు. ఆ దేశంలో స్కూల్‌ పిల్లలే కాదు పెద్దలూ కూడా ఈ లంచ్‌ బాక్సునే ఇష్టపడతారట. జపాన్‌ సంస్కృతిలో భాగమైన బెంటో లంచ్‌ బాక్స్‌ ఐడియాను మనమూ ఫాలో కావచ్చు. ఆహార పిరమిడ్‌లో ముఖ్యమైనవన్నీ పిల్లలకు అందేలా లంచ్‌ బాక్సును తయారుచేయాలి. కార్బోహైడ్రేట్స్‌, ప్రొటీన్స్‌, ఇతర పోషకాలను సమన్వయం చేయడం వల్ల పిల్లల్లో పోషకాహార లోపం ఏర్పడకుండా జాగ్రత్త పడవచ్చు.

కార్బోహైడ్రేట్ల కోసం అన్నం, నూడుల్స్‌, పాస్తా సలాడ్‌, కిచ్డీ, చపాతీ, అటుకులు పెడితే మంచిది. చపాతీ కోసం తృణధాన్యాలతో చేసిన లేదా సోయ పిండి వాడితే మంచిది. ప్రొటీన్ల కోసం చికెన్‌, చేపలు, పనీర్‌... కూరగాయలు, తాజా పళ్లు కూడా చేర్చాలి. ఆఖరున డ్రై ఫ్రూట్స్‌, డేట్స్‌ లడ్డూతో పిల్లల భోజనం ముగిసేలా చేయవచ్చు. 


తక్కువ కాదు...

స్కూల్‌ డ్రెస్సులు, పుస్తకాలు, లంచ్‌ బాక్సుల్లో పడి నీళ్ల బాటిళ్లను చాలామంది తల్లిదండ్రులు అశ్రద్ధ చేస్తుంటారు. పిల్లల్ని హైడ్రేటెడ్‌గా ఉంచే నీళ్ల బాటిల్‌పై కూడా తగినంత శ్రద్ధ అవసరం. ఏ కాలంలో అయినా శరీరంలో తగినంత నీటి శాతం ఉండాలి. పిల్లలు తరగతుల్లో, ఆటల్లో పడి నీళ్లని సరిగా తాగరు. అందుకే వాళ్ల దృష్టిని పట్టుకోవడానికి చాలా మంది జ్యూస్‌లు, కార్బోనేటెడ్‌ డ్రింక్స్‌ పెడుతుంటారు. వీటి కన్నా కూడా మంచి నీళ్లు  లేదా పాలు పెట్టడం ఎంతో ఉపయోగం. చక్కెరలు ఉన్న జ్యూసుల వల్ల దంత సమస్యలు తలెత్తవచ్చు. అలాగే ప్లాస్టిక్‌ బాటిళ్ల బరువు తక్కువ. సులభంగా శుభ్రపరచవచ్చు. కానీ మంచి ప్లాస్టిక్‌నే ఎంచుకోవాలి. స్టీల్‌ బాటిల్‌ బరువు ఎక్కువ. కాబట్టి 750 గ్రాముల స్టీల్‌ బాటిల్‌ మంచి ఆప్షన్‌ కావచ్చు. ఆకర్షణీయమైన రంగు, డిజైన్‌ ఉన్న బాటిల్స్‌ని పిల్లలు ఇష్టపడతారు. కాబట్టి మన్నిక, బరువు, కెపాసిటీ, డిజైన్‌లను బట్టి నీళ్ల బాటిల్‌ను ఎంపిక చేయాలి.

అలంకరణలో...

జపనీయులు అలంకరణకు ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. అక్కడి స్కూల్‌ పిల్లల లంచ్‌ బాక్సుల్లో ఆహార పదార్థాలు చూడముచ్చటగా ఉండి, వెంటనే తినాలని అనిపిస్తాయి. పిల్లలు ఇష్టంగా భోజనం చేయాలని జపనీస్‌ తల్లి ఎంతో శ్రమతో లంచ్‌ బాక్సుని తీర్చిదిద్దుతుంది. వివిధ ఆహార పదార్థాల్ని కార్టూన్‌ క్యారెక్టర్లు, ఎనిమీ, పాప్‌ స్టార్స్‌, జంతువుల మాదిరిగా అలంకరించడానికి ఆ తల్లి పడే కష్టం మామూలుగా ఉండదు. భోజన సమయంలో పిల్లలందరూ చాలా ఎక్సైటింగ్‌గా తమ బాక్సులను తెరుస్తారు. మిగతా పిల్లల బాక్సుల ఆహార డిజైన్లనూ చూసి ఆశ్చర్యపోతారట. 


తాజాగా ఉండేందుకు...

 పూరీ, కచోరీ లాంటివి లంచ్‌ బాక్సుల్లో పెట్టకపోవడమే మంచిది. నూనెలో చేసిన ఈ పదార్థాలు కొన్ని గంటల తరవాత సాగి, రుచిగా అనిపించవు.

 శాండ్విచ్‌ లాంటివి పెట్టేప్పుడు బ్రెడ్డు పైన బటర్‌ రాసి, దాని పైన చట్నీ లేదా సాస్‌ రాయాలి. దీని వల్ల బ్రెడ్‌ మెత్తబడదు.

 సాధారణంగా ఆహారపదార్థాలను అల్యూమినియం ఫాయిల్‌లో చుట్టేసి పెడుతుంటాం. పిల్లల ఆహారాన్ని బటర్‌ పేపర్‌లో చుడితే మంచిది. దీని వల్ల ఆహార పదార్థాలు చెక్కుచెదరవు.

 పాలతో చేసిన పదార్థాలను బాక్సుల్లో పెట్టకుండా ఉండడమే మంచిది. ఒక్కోసారి అవి పాడయ్యే ప్రమాదం లేకపోలేదు. ఇదే సూత్రం పెరుగుతో చేసిన వాటికీ వర్తిస్తుంది. సాధారణ ఉష్ణోగ్రతల దగ్గరే పెరుగు పులిసి పుల్లగా కావచ్చు.

 ముక్కలకు బదులుగా పండ్లనే పెట్టడం మంచిది. ముక్కలుగా కట్‌చేస్తే బ్యాక్టీరియా చేరే ప్రమాదం ఉంది. తప్పనిసరి పరిస్థితుల్లో అయితే ఉదయమే కట్‌ చేసి ఎయిర్‌ టైట్‌ డబ్బాలో ఫ్రిజ్‌లో పెట్టాలి. స్కూల్‌ కెళ్లే ముందు ఆ బాక్సుని తీసి బ్యాగ్‌లో పెడితే సరి.

Updated Date - 2022-06-26T18:21:47+05:30 IST