పెద్దలతో ఇలా మెలుగుదాం
ABN , First Publish Date - 2022-01-18T08:13:34+05:30 IST
65 ఏళ్ల అమ్మ మెట్లెక్కేటప్పుడు ఆయాసపడుతున్నా, 70 ఏళ్ల నాన్న కీళ్ల నొప్పులతో వాకింగ్ మానేసినా, ‘పైబడే వయసులో ఇవన్నీ సహజమేలే!’ అనుకుంటాం.

65 ఏళ్ల అమ్మ మెట్లెక్కేటప్పుడు ఆయాసపడుతున్నా, 70 ఏళ్ల నాన్న కీళ్ల నొప్పులతో వాకింగ్ మానేసినా, ‘పైబడే వయసులో ఇవన్నీ సహజమేలే!’ అనుకుంటాం. మనమే కాదు, పెద్దవాళ్లైపోతున్న మన తల్లితండ్రులూ అలానే అనుకుని, సర్దుకుపోతూ ఉంటారు. అయితే పెద్దల పెరిగే వయసునూ, శారీరక ఇబ్బందులనూ కలిపి చూడడం కరెక్టేనా? పెద్దల అవసరాలను గమనిస్తూ, వాటికి తగిన పరిసరాలతో నాణ్యమైన జీవితాన్ని అందించవలసిన బాధ్యత మనది కాదా? అందుకు ఏం చేయాలి? ఎలా నడుచుకోవాలి?
చిన్న, మధ్య వయస్కులతో పోలిస్తే, పెద్దల్లో వ్యాధినిరోధకశక్తి తక్కువ. కాబట్టి ఇన్ఫెక్షన్లు, వ్యాధులు సోకినప్పుడు, వారిలో లక్షణాలు కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు. కాబట్టి పెద్దలకు వ్యాధులు సోకకుండా ముందు జాగ్రత్తలు పాటించడం మేలు. అందుకోసం ఏడాదికోసారి ఆరోగ్య పరీక్షలు తప్పనిసరిగా చేయిస్తూ ఉండాలి. ఆ పరీక్షలు ఏవంటే...
మధుమేహం
హైపర్‌టెన్షన్
కొలెస్ట్రాల్
గుండె (ఇ.సి.జి, 2డి ఎకొ)
కంప్లీట్ బ్లడ్ పిక్చర్
మూత్రపిండాలు, కాలేయం
థైరాయిడ్
క్యాల్షియం
ఎలకొ్ట్రలైట్స్
అలా్ట్రసౌండ్ స్కానింగ్
కుటుంబ చర్రితలో కేన్సర్ ఉంటే, 65 ఏళ్ల నుంచే కేన్సర్ స్ర్కీనింగ్
ఓ కన్నేసి, కనిపెట్టి ...
ఒళ్లునొప్పులు, నీరసం లాంటి సమస్యలు పెరిగే వయసులో సహజమేననే అభిప్రాయంలో పెద్దలుంటారు. దాంతో ఇబ్బంది కలుగుతున్నా, తమ అసౌకర్యాల గురించి కుటుంబసభ్యులతో పంచుకోరు. కాబట్టి మాటల సందర్భాల్లో పెద్దలను కొన్ని లక్షణాల గురించి ఆరా తీయాలి. పూర్వం చేయగలిగిన పనులు చేసుకోలేకపోతున్నారా? అనేదీ గమనించాలి. పెద్ద వయసుతో ముడిపడి ఉండే శారీరక అసౌకర్యాల గురించి కొన్ని ప్రశ్నలను అడగాలి.
అడగవలసినవి...
మునుపటిలా మెట్లు ఎక్కగలుగుతున్నారా?
ఆయాసం, కీళ్ల నొప్పులు లాంటి అసౌకర్యాలు ఉన్నాయా?
మలబద్ధకం, నీళ్ల విరోచనాలు, మూత్ర విసర్జన సమస్యలు ఉన్నాయా?
గమనించవలసినవి
బరువు తగ్గే ప్రయత్నం చేయకపోయినా, ఆరు నెలల వ్యవధిలో మొత్తం శరీర బరువులో 10ు తగ్గుదల కనిపిస్తోందా?
ఎముకలు అరగడం మూలంగా ఎత్తు తగ్గుతున్నారా?
చిన్న తాకిడికే ఎముకలు చిట్లుతున్నాయా?
దైనందిన కార్యకలాపాల్లో ఇతరుల మీద ఆధారపడే తీవ్రత పెరిగిందా?
అసలు కారణం ఆరా...
పెద్దల దైనందిన కార్యకలాపాల్లో తేడాలు చోటు చేసుకుంటే, వాటిని చూసీచూడనట్టు వదిలేయకూడదు. ఆ తేడాలకు కారణం కచ్చితంగా ఆరోగ్యానికీ, పెరిగే వయసుకూ ముడిపడి ఉండాలనే నియమం కూడా లేదు. ఉదాహరణకు మెట్లు ఎక్కడానికి ఇబ్బంది పడుతుంటే అందుకు ఆయాసం కారణం కావచ్చు, కీళ్ల నొప్పులు కారణం కావచ్చు. మెట్లెక్కితే కింద పడిపోతానేమో అనే కారణం కూడా అయి ఉండవచ్చు. మెట్లెక్కేటప్పుడు కలిగే ఆయాసానికి కారణాలు ఊపిరితిత్తుల్లో లేదా గుండెలో ఉండవచ్చు. రక్తహీనత ఉన్నా ఆయాసం తలెత్తవచ్చు. కాబట్టి లక్షణాలకు మూల కారణాన్ని కనిపెట్టి చికిత్స అందించడం అవసరం. కొన్ని సందర్భాల్లో వేరొకరి మీద వీలైనంత తక్కువగా ఆధారపడుతూ దైనందిన జీవితాన్ని నాణ్యంగా గడపగలిగేలా పెద్దలకు కౌన్సెలింగ్ కూడా అవసరం పడవచ్చు. ఇలాంటి సందర్భాల్లో రీహ్యాబిలిటేషన్ తోడ్పడుతుంది.
ప్రకృతిసిద్ధ పోషకాలే ప్రధానం
పెద్దలకిచ్చే ఆహారం పోషకప్రధానంగా ఉండాలి. ధాన్యాలు (అన్నం, గోధుమలు, రాగులు మొదలైనవి) ఎక్కువగా ఇవ్వాలి. పాలిష్ పట్టిన పదార్థాలు, నిల్వ ఉండే పదార్థాలు ఇవ్వకూడదు. తాజాగా వండినవి తినిపించాలి. పెద్దల్లో పోషకాల శోషణ తక్కువ. కాబట్టి కొన్ని సప్లిమెంట్లు కూడా ఇవ్వవలసి ఉంటుంది. విటమిన్ డి, క్యాల్షియం తప్పనిసరి. ఐరన్, మల్టీ విటమిన్ టాబ్లెట్లు తప్పనిసరి కాకపోయినా, కొందరికి అవసరం ఉండవచ్చు. సరిపడా ద్రవాహారం తీసుకోవాలి. మైదాతో తయారైన బిస్కెట్లు, బేకరీలో తయారైన పదార్థాలు, నూనెలో ముంచి వేయించినవి, అదనంగా ఉప్పు కలిపిన చిప్స్, నిల్వ పచ్చళ్లు లాంటివి పెద్దలకు ఇవ్వకూడదు. వీటికి బదులుగా ఇంట్లో వండే పదార్థాలన్నీ మితంగా తినిపించవచ్చు. అయితే పెద్దల ఆరోగ్య పరిస్థితులకు తగ్గట్టు, వైద్యులు సూచించే ఆహార నియమాలను తప్పక పాటించాలి. హైపర్‌టెన్షన్ ఉంటే ఉప్పు తగ్గించాలే తప్ప మానేయకూడదు. పెరుగన్నం, మజ్జిగలో ఉప్పును కలుపుకోకూడదు. ఉప్పు ఎక్కువగా ఉండే పచ్చళ్లు ఇవ్వకూడదు. స్నాక్స్‌గా అన్ని రకాల పండ్లు తినిపించవచ్చు.
పెద్దల్లో మానసిక మార్పులు
60 ఏళ్లకు చేరుకున్న పెద్దలు ఎదుర్కొనే ‘లోటులు’ ఎక్కువగా ఉంటాయి. మునుపటి ఉద్యోగం ఉండదు. స్నేహితులనూ కోల్పోతారు. కొందరు జీవిత భాగస్వామినీ కోల్పోతారు. చదువులు, ఉద్యోగాలపరంగా పిల్లలు దూరమైపోతారు. ఈ పరిస్థితులన్నీ పెద్దల మనసు మీద ప్రభావం చూపిస్తాయి. దాంతో పెద్దల్లో మానసిక కుంగుబాటు, ప్రవర్తనలో మార్పులు చోటు చేసుకోవచ్చు. ఇలాంటి మార్పులు పెద్దల్లో చోటు చేసుకోకుండా ఉండాలంటే, కుటుంబసభ్యులు చేదోడువాదోడుగా ఉండాలి. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునేవరకూ కాలక్షేపం కలిగే పనుల్లో పెద్దలను నిమగ్నం చేయాలి. మనవళ్లు, మనవరాళ్లను స్కూల్లో దింపడం, చిన్నా చితకా బజారు పనులు చేయడం, గార్డెనింగ్ లాంటి పనులతో పెద్దలను ఎంగేజ్ చేయడం అవసరం.
గదికే పరిమితం చేయకూడదు
సాధారణంగా పెద్దలు రోజులో ఎక్కువ సమయం వారి గదికే పరిమితమై, అవసరమైతేనే తప్ప కుటుంబసభ్యులతో కలవరు. ఇంట్లో ఇలాంటి వాతావరణం సరి కాదు. పెద్దలు వాళ్లు చేయగలిగే ఏ పనినైనా కుటుంబసభ్యులు ప్రోత్సహించి, వీలైనంతగా వాళ్లను చురుగ్గా ఉంచాలి. వాళ్లు చేయబోయే పనులకు అడ్డు చెప్పడం సరి కాదు. పిల్లలు ఎలా అర్థం చేసుకుంటారో, ఏమనుకుంటారో అనే అనుమనాలు, భయాలు కూడా పెద్దల్లో ఉంటాయి. దాంతో చాలా ఆలోచనలు, అభిప్రాయాలనూ మనసులోనే దాచేసుకుంటూ ఉంటారు. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే కుటుంబసభ్యులు పెద్దలతో ప్రేమగా మసలుకుంటూ, వాళ్లతో సమయాన్ని గడుపుతూ ఉండాలి.
పెద్దలకు శిక్షణ
అత్యవసర పరిస్థితి తలెత్తితే, ఎవర్ని సంప్రతించాలో, ఎలా నడుచుకోవాలో పెద్దలకు శిక్షణ ఇవ్వడం అవసరం. అన్ని సమయాలూ ఒకేలా ఉండవు. కాబట్టి పిల్లలకు దూరంగా ఉండే పెద్దల విషయంలో, ఫోన్ చేసిన వెంటనే స్పందించే వ్యక్తులను వాళ్లకు అందుబాటులో ఉంచాలి. మొబైల్ ఫోన్, కంప్యూటర్ వాడడం నేర్పించాలి.
అది చాదస్తమేనా?
పెద్దల్లో చాదస్తం ఎక్కువ అనుకుంటూ ఉంటాం. అయితే ఆ చాదస్తం లేదా చెప్పిందే పదే పదే చెప్పే వారి ధోరణి రీజనబుల్‌గా ఉంటే, అంతగా పట్టించుకోకూడదు. మొండితనం, చీకాకుపడడం, కోపం తెచ్చుకోవడం లాంటివి పైబడే వయసులో పెద్దల్లో కనిపించే అత్యంత సహజమైన లక్షణాలు. ఆ ధోరణిని కుటుంబసభ్యులు అలవాటు చేసుకోవాలి. అలా కాకుండా అసాధారణంగా, అసహజంగా ప్రవరిస్తుంటే వైద్యుల దృష్టికి తీసుకువెళ్లాలి.
డాక్టర్ మనీషా రేగటి,
సీనియర్ రెసిడెంట్,
జేరియాట్రిక్స్,
నిమ్స్, హైదరాబాద్.
ఇంట్లో సౌకర్యాలు ఇలా...
కాళ్లు జారకుండా యాంటీ స్లిప్పరీ ఫ్లోరింగ్, పట్టుకుని నడవడానికి గోడలకు గ్రాబర్స్ ఏర్పాటు చేయాలి.
టాయ్‌లెట్ సీట్ పెద్దలకు సౌకర్యంగా ఉండేటంత ఎత్తులో ఏర్పాటు చేయాలి.
బెడ్ వారికి సౌకర్యమైన ఎత్తులో ఉండేలా చూసుకోవాలి.
కాలు జారిపడే వీలుండే కార్పెట్లను ఇంట్లో లేకుండా చూసుకోవాలి.
పెద్దలకు కంటిచూపు తగ్గుతుంది. కాబట్టి వాళ్లు తిరిగే చోట సరిపడా లైటింగ్ ఉండే ఏర్పాట్లు చేయాలి.
స్విచ్ బోర్డులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి.
పెద్దల గదిలో గాలీ, వెలుతురూ ధారళంగా ఉండేలా చూసుకోవాలి.
మందులు, పుస్తకాలు లాంటి వాటి కోసం గదిలో ఏర్పాట్లు ఉండాలి.
పెద్దల గదిలో గోడ గడియారం, క్యాలెండర్ ఉండాలి.
కాంప్రిహెన్సివ్ జేరియాట్రిక్ అసెస్మెంట్
పెద్దల్లో ఆరోగ్య సమస్యలు తీవ్రమై, మంచానికే పరిమితమైపోయే పరిస్థితి రాకుండా ఉండాలంటే ఆరోగ్యపరమైన అసౌకర్యాలను గమనిస్తూ, అవసరమైన ఆరోగ్య పరీక్షలు చేయిస్తూ మున్ముందు వాళ్లను ఇబ్బంది పెట్టబోయే సమస్యలను గుర్తించాలి. అందుకు కాంప్రిహెన్సివ్ జేరియాట్రిక్ అసెస్మెంట్ తోడ్పడుతుంది. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక, సామాజిక, పర్యావరణపరమైన అంశాలన్నిటి ఆధారంగా పెద్దల అవసరాలు, సమస్యలు, ఇబ్బందులను అంచనా వేసి, వాటికి తగిన చికిత్స ప్రణాళికను అనుసరించాలి.