భయాన్ని గెలుద్దాం...

ABN , First Publish Date - 2022-10-07T10:00:39+05:30 IST

‘భయం’ అనే పదం వినగానే చాలామందికి ఏదో తెలియని భయం. రేపటి రోజు ఏమవుతుందోననే భయం ఒకరిదైతే, ఉద్యోగం దొరుకుతుందో లేదోనని మరొకరి భయం.

భయాన్ని గెలుద్దాం...

‘భయం’ అనే పదం వినగానే చాలామందికి ఏదో తెలియని భయం. రేపటి రోజు ఏమవుతుందోననే భయం ఒకరిదైతే, ఉద్యోగం దొరుకుతుందో లేదోనని మరొకరి భయం. వృద్ధాప్యంలో ఎవరు చూసుకుంటారనే భయం ఇంకొందరిది. కష్టపడి సంపాదించిందంతా రేపు ఏమవుతుందనే భయంతో కూడా కొందరు సతమతమవుతూ ఉంటారు. ఇలా ప్రతి ఒక్కరూ ఏదో రకమైన భయంతో ఉంటారు. రెండేళ్ళ నుంచీ కొవిడ్‌ కారణంగా ప్రపంచవ్యాప్తంగా తలెత్తిన భయాలను చూసి ఉన్నాం. నిరుపేదల నుంచి సంపన్నుల వరకూ... అన్ని వర్గాలవారూ దాని ప్రభావానికి గురయ్యారు. ఉన్న భయాలకు తోడు కరోనా భయం ప్రపంచంలో అందరినీ ఆవరించింది. మనకు ఎదురయ్యే అనేక భయాల నుంచి ఎలా బయటపడాలి? దానికోసం మనం ఏం చెయ్యాలి? 


ఏదో ఒక రోజు ఈ ప్రపంచాన్ని మనం వీడి పోవాలనే విషయం అందరికీ తెలిసిందే. ‘పరీక్షలో పాసవుతామో? లేదో?’ అని భయపడతాం కాని, ఏదో ఒక రోజు ఈ శరీరాన్ని ఇక్కడే వదిలి పోవాలని, ఏదీ తనతో రాదని... ఈ భయం మనకు ఎన్నడూ కలగడం లేదు. మిగతా విషయాలలో కలిగే భయాలు, భ్రాంతులు మానవ కల్పితాలు. చావు ప్రకృతిపరమైన భయం. దాన్ని మనం అంగీకరించడం లేదు. వాస్తవాన్ని స్వీకరించడం లేదు. అలాగే మనలో ఉన్న శ్వాస తాలూకు ఔన్నత్యాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం. అది ఆగిపోతే మళ్ళీ తిరిగి రాదు. కానీ ఆ విషయంలో మనం భయపడడం లేదు. 


గాలిలో ఎగిరే పక్షికి తనదంటూ ఏదీ ఉండదు. కానీ అది ఆకాశంలో హాయిగా విహరిస్తుంది. సంతోషంగా ఉంటుంది. జింక పిల్లలు వర్షం వస్తున్నప్పుడు ఆనందంగా గంతులు వేస్తాయి. ఎగురుతూ, ఆడుతూ సంతోషంగా ఉంటాయి. కానీ కోటానుకోట్ల  సంపద ఉన్న మనుషుల్లో కూడా సంతోషం లేదు. సంతృప్తి కరువైంది. వీటన్నిటికీ కారణం సమాజం వల్ల నెలకొన్న భయమే.

జరగబోయే వాస్తవాన్ని తెలుసుకుంటే కలిగేది ఒక రకమైన భయం. కానీ దాని గురించి భయపడినా లాభం లేదు. ఎందుకంటే... దాన్ని మనం అంగీకరించకపోయినా ఎలాగూ జరిగేదే. కానీ మనలో నిరంతరం ఉండే మరో రకమైన భయం... సమాజం వల్ల కలిగేది. దాన్ని వదిలించుకోవాలి. పరిస్థితులు ఎంతగా తారుమారైనా... మనం ఈ భూమి మీద ఉన్నంతకాలం మన జీవితాల్లో ఆనందం వెల్లివిరియాలి. ఆ ఆనందమయ స్థితికి మనం ప్రతిరోజూ చేరుకోవాలి. దానికోసం భయాన్ని దూరం చేసుకోవాలి. 


శాశ్వతమైనదీ, అనంతమైనదీ అయిన శక్తి ఒకటుంది. అదే సత్యం. అది అంతటా వ్యాపించి ఉంది. అది ప్రతి ఒక్కరిలోనూ ఉంటూ నడిపిస్తోంది. మనం ఒకప్పుడు లేము. ఇప్పుడు ఉన్నాం. ఏదో ఒకరోజు ఈ ప్రపంచాన్ని వదిలి పోతాం. అందరి జీవితాల్లోనూ ఇది మాత్రమే తప్పనిసరిగా జరుగుతుంది. ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఎవరూ దేన్నీ తీసుకువెళ్ళలేరు... అసలైన శాంతిని తప్ప. అంతర్గతమైన ఆ శాంతిని పొందాలంటే... ముందుగా మనల్ని మనం తెలుసుకోవాలి. మనలో ఉన్న ఆ దివ్య శక్తిని అర్థం చేసుకోవాలి. మన ఉనికి ఏమిటనేది గుర్తించాలి. అలా జరిగినప్పుడే మనలోని భయం మీద విజయం సాధించగలం.

Updated Date - 2022-10-07T10:00:39+05:30 IST