అమ్మమ్మగారు

ABN , First Publish Date - 2022-08-14T05:30:00+05:30 IST

‘‘మనకు ఇక్కడ పనులన్నీ టైము ప్రకారం పనుల్నీ అయిపోతున్నాయ్‌. తరువాత ఇంకేం వ్యాపకం ఉండడం లేదు.

అమ్మమ్మగారు

‘‘మనకు ఇక్కడ పనులన్నీ టైము ప్రకారం పనుల్నీ అయిపోతున్నాయ్‌. తరువాత ఇంకేం వ్యాపకం ఉండడం లేదు. పోనీ హిందీ పాఠాలు మొదలు పెడదామా?’’ అన్నారు కృష్ణవేణమ్మ. ఆ మాట వినగానే ప్రాణాలు లేచి వచ్చినట్టయింది చాలామందికి. ‘‘నేర్చుకుంటాం. ఇవాళే మొదలుపెట్టండి’’ అంటూ ఆమెను సమీపించారు ఉత్సాహంగా. ఆమె దగ్గర పలకలు, బలపాలు గానీ, పెన్సిళ్ళు, పేపర్లు కానీ వారికి కనిపించలేదు. వారి దగ్గర అసలే లేవు. ‘‘మరి ఎలా?’’ అని అడిగారు. ‘‘లేకపోవడమేంటి? బళ్ళ కొద్దీ ఇసక ఇక్కడ పోసి ఉంది, చూడండి. పూర్వం వీధి బడుల్లో చేసినట్టు ఇసకలో ఓనమాలు దిద్దుకుందాం’’ అన్నారు కృష్ణవేణమ్మ.

(‘స్వతంత్ర సమరంలో ఆంధ్రమహిళలు’ సంకలనం నుంచి )కొన్నాళ్ళకు కృష్ణవేణమ్మ కుమార్తె కూడా ఆ జైలు వార్డుకే వచ్చారు. ఆమే విఖ్యాత స్వాతంత్య్ర సమర యోధురాలు దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌. 


ఎలాంటి అడ్డంకులూ లేకపోవడంతో వారి చదువు త్వరగానే సాగింది. ఈ వింత బడి కథ అందరికీ తెలిసింది. దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు వెంటనే పలకలు, బలపాలు, హిందీ బాలబోధిని పుస్తకాలు, వాచకాలు సరఫరా చేశారు. ఇదంతా ఏ కుగ్రామంలోని  వీధి బడిలోనో జరిగిన కథ కాదు. 1932లో రాయవేలూరు జైల్లోని ‘సి’ క్లాసు మహిళల వార్డులో జరిగిన యదార్థం. 


కొన్నాళ్ళకు కృష్ణవేణమ్మ కుమార్తె కూడా ఆ జైలు వార్డుకే వచ్చారు. ఆమే విఖ్యాతురాలైన స్వాతంత్య్ర యోధురాలు దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌. జైల్లో శిక్ష అనుభవించడానికి వచ్చిన బిడ్డను చూసి సంతోషించాలో, బాధపడాలో కృష్ణవేణమ్మకు తెలియలేదు. కనీసం బిడ్డ యోగక్షేమాలయినా తెలుస్తూ ఉంటాయని ఒక విధంగా తృప్తి చెందారు. కానీ ఆ తృప్తి ఎంతోకాలం నిలవలేదు. జైల్లో తనకు ఇచ్చిన ‘ఏ’ క్లాసును దుర్గాబాయి తిరస్కరించి, ‘సి’ క్లాసును స్వీకరించారు. ఆమె జైలుకు రావడం అది రెండోసారి. జైలు అధికారుల పరిభాషలో తెలిసి నేరం చేసిన దోషి. ఇవన్నీ చాలవన్నట్టు జైల్లోని దుర్భర పరిస్థితుల గురించి దుర్గాబాయి నిలదీయడంతో.. ఒకనాడు గుట్టుచప్పుడు కాకుండా ఆమెను మదురై జైలుకు పంపించేశారు. ఇది కృష్ణవేణమ్మకు ఆందోళన కలిగించింది. అయినప్పటికీ తనతో పాటు ఉన్న మిగిలిన మహిళా ఖైదీల యోగక్షేమాలను చూడడంలో నిమగ్నమైపోయారు.


రాజమండ్రిలో కందుకూరి వీరేశలింగం మిత్రుడు, సంస్కార కార్యకలాపాల్లో ఆయనకు కుడి భుజం అయిన గుమ్మడిదల మనోహరం పోలీస్‌ సూపరింటెండెంట్‌గా ఉండేవారు. ఆయన ఆ రోజల్లో ఆ హోదాను అలంకరించిన తొలి ఆంధ్రుడు. ఆయన భార్య లక్ష్మీబాయమ్మ. వారికి నలుగురు అబ్బాయిల మధ్య... ఏకైక కుమార్తెగా 1896లో పోణంగిపల్లిలో కృష్ణవేణమ్మ జన్మించారు. ఆమెకు బెన్నూరి రామారావుతో వివాహం అయ్యాక కాకినాడ వాస్తవ్యులయ్యారు. వీణ నేర్చుకోవడంతో పాటు పాండిత్యం కూడా సంపాదించుకున్న కృష్ణవేణమ్మకు కాకినాడలో ప్రసిద్ధి చెందిన సరస్వతి గాన నిలయంతో మంచి అనుబంధం ఉండేది. ఆమె తొలి సంతానం దుర్గాబాయి. జాతీయోద్యమం పట్ల దుర్గాబాయి ఆకర్షితురాలు కావడానికి కృష్ణవేణమ్మ ఎంతో దోహదం చేశారు. 1920 ప్రాంతాల్లో గాంధీజీ రాజమండ్రి వచ్చినప్పుడు, పదకొండేళ్ళ కుమార్తె తన బంగారు గాజులను విరాళంగా ఇచ్చినా, విదేశీ వస్త్రాలను తగులబెట్టినా ఆమె కాదనలేదు. 


కృష్ణవేణమ్మ ఖాదీ ధరించడంతోపాటు, ఇంటింటికీ తిరిగి ఖాదీ విక్రయించారు. కాకినాడ కాంగ్రెస్‌ మహిళా విభాగానికి కార్యదర్శిగా, కోశాధికారిగా పని చేశారు. పన్నెండేళ్ళ వయసులో దుర్గాబాయి బడి మానేసి, హిందీ నేర్చుకుంటాననీ, కుట్లు, అల్లికలు నేర్పే స్కూలు ఏర్పాటు చేస్తానని చెబితే తన సహకారాన్ని అందించారు. ఆనాడు కృష్ణవేణమ్మ ఇచ్చిన ప్రోత్సాహం, సహకారం, తర్ఫీదులే దుర్గాబాయిలోని నిర్వహణ శక్తిని ఒక క్రమపద్ధతిలో పెట్టాయి. కృష్ణవేణమ్మకు విజ్ఞాన తృష్ణ అధికం. కుమార్తె స్థాపించిన బాలికా పాఠశాలలో విద్యార్థినిగా చేరి, హిందీ నేర్చుకొని, పరీక్షలు రాసి ఉత్తీర్ణురాలయ్యారు. ‘‘నేను హిందీ ప్రవీణ పూర్తి చేసేనాటికి నాకు మనుమరాలు పుట్టింది’’ అంటూ నవ్వుతూ చెప్పేవారు. హిందీ చదువు, నూలు వడగడం, ఖాదీ అమ్మకం... ఇవన్నీ ఆమె భావనలో గాంధీ ఆదేశాలే. 1920ల్లో ఆరంభించిన ఖాదీ విక్రయాలను 30ల్లోనూ ఆమె కొనసాగించారు. దీంతో 1932 జనవరిలో ఆమెను పోలీసులు అరెస్ట్‌ చేసి, మండుటెండలో సబ్‌జైలుకు నడిపించుకొని వెళ్ళారు. ఆరు నెలల జైలు శిక్ష విధించి... రాయవేలూరు జైలుకు పంపారు. 


భర్త మరణించడంతో కృష్ణవేణమ్మ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చినా, కుమారుడి చదువు కోసం కాకినాడ వదిలి, రాజమండ్రి రావాల్సి వచ్చినా... పరిస్థితులకు ఎదురొడ్డి నిలబడ్డారే తప్ప ఎవరినీ ఆశ్రయించలేదు. నేషనల్‌ గరల్స్‌ హైస్కూల్లో హిందీ టీచరుగా చేరి, కుటుంబాన్ని నడిపించుకున్నారు. కుమారుడి ఉద్యోగరీత్యా 1937లో మద్రాసు చేరుకున్నప్పటికీ, హిందీ బోధననూ, సేవా కార్యక్రమాలనూ ఆమె వదిలిపెట్టలేదు. మైలాపూరులో తాను అద్దెకుంటున్న ఇంటి ముందు... ఇసుక కుప్పలమీద ఆడుకుంటున్న చిన్న పిల్లలను పిలిచి, వాళ్ళకు కథలు చెప్పేవారు. పాటలు, పద్యాలు నేర్పేవారు. వారు ఆమెను ‘అమ్మమ్మగారూ’ అని పిలిచేవారు. ఆనాటి నుంచి కృష్ణవేణమ్మ అసలు పేరు మరుగునపడి... ‘అమ్మమ్మగారు’గా స్థిరపడిపోయారు. ఆ పిల్లలే బాలానందం బృందంగా... మద్రాసు రేడియోవారి పిల్లల కార్యక్రమాలు ఆరంభమయ్యాయి. స్కూలు ఉద్యోగం, ఇంటి పనులూ ఉన్నా... సాయంత్రం పిల్లల ఆటపాటలు, పెద్దలకు హిందీ బోధన లేకుండా ఆమెకు తోచేది కాదు. 1938లో ఆంధ్ర మహిళాసభ ఏర్పడినప్పటి నుంచీ అక్కడ తెలుగు, హిందీ బోధించేవారు.


హైదరాబాద్‌లో, ఢిల్లీలో ఆంధ్ర మహిళాసభ కార్యకలాపాలు ఆమె పాఠాలతోనే ఆరంభమయ్యాయి. ఎప్పుడూ సందడిగా, ఆనందంగా కనిపిస్తూ... అందరినీ తనవాళ్ళుగా అక్కున చేర్చుకున్న కృష్ణవేణమ్మ 1965 మార్చి ఏడో తేదీన, ఉదయం స్నానం చేసి, భక్తి రంజని కార్యక్రమాన్ని రేడియోలో వింటూ... పూలమొక్కల మధ్య అనాయాసంగా కన్నుమూశారు. ఎన్నో హృదయాల్లో ‘అమ్మమ్మగారు’గా నిలిచిపోయారు.

Updated Date - 2022-08-14T05:30:00+05:30 IST