Kakarla sajaya: వాళ్ల పాదాలు కడగడం పరిష్కారం కాదు!
ABN , First Publish Date - 2022-11-18T22:42:26+05:30 IST
తోటి మనుషుల మలమూత్రాలను చేతులతో ఎత్తి పారబోసే పాకీ పనివారి జీవితాలను కళ్లకు కట్టే రచన భాషాసింగ్ ‘అన్‌సీన్’. ఈ పుస్తకాన్ని ‘అశుద్ధ భారత్’ పేరుతో సామాజిక కార్యకర్త కాకర్ల సజయ తెలుగులోకి అనువదించారు.
అంతర్జాతీయ పారిశుధ్య దినోత్సవం
తోటి మనుషుల మలమూత్రాలను చేతులతో ఎత్తి పారబోసే పాకీ పనివారి జీవితాలను కళ్లకు కట్టే రచన భాషాసింగ్ ‘అన్‌సీన్’. ఈ పుస్తకాన్ని ‘అశుద్ధ భారత్’ పేరుతో సామాజిక కార్యకర్త కాకర్ల సజయ తెలుగులోకి అనువదించారు. దీనికి ఆమె కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారాన్ని ఈ మధ్యే అందుకున్నారు. ఈ సందర్భంగా పాకీ పనికి సంబంధించిన కొన్ని పార్శ్వాలను సజయ ‘నవ్య’తో చెప్పారిలా...
‘‘సమాజ పురోగమనంలో పుట్టుక కారణంగా ఏ మనిషి ఎదుర్కోకూడని వివక్షను రూపుమాపడం... దాంతో పాటు సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలతో ముడిపడిన మానవీయ కోణం గురించి ‘అశుద్ధ భారత్’ చర్చిస్తుంది. పదేళ్ల కిందట ఈ పుస్తకం ఇంగ్లీ్‌షలో భాషా సింగ్ రాశారు. అందుకు ఆమె తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లతో సహా పదకొండు రాష్ట్రాల్లోని తోటి మనుషుల పీయి పెంటలను చేతులతో ఎత్తి పారబోసే పాకీ పనివారిని, ఆ వృత్తికి సంబంధించిన సమూహాలను కలిసి, మాట్లాడ్డారు. తద్వారా సమాజం విస్మరించిన వాళ్ల జీవితంలోని భిన్న పార్శ్వాలను అక్షరీకరించారు. ఈ పుస్తకాన్ని ఏ భాషలోనైనా చదువుతున్న వారెవరికైనా సరే... సిగ్గు, అవమానం, దుఃఖం, కోపం, ఉద్వేగం... అన్నీ కలగలసి ఊపిరాడని పరిస్థితి ఎదురవుతుందనడంలో సందేహం లేదు. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం నానాటికీ కొత్త పుంతలు తొక్కుతుందని సంబరపడుతున్న మన దేశంలో... ఇవాల్టికీ సాటి మనుషుల పీయిలను చేతులతో ఎత్తి పారబోసే అమానవీయ వృత్తి కొనసాగుతుండటానికి మించిన అమానుషం మరొకటి ఉందా! డ్రైనేజీలను శుభ్రం చేస్తూ సగటున రోజుకు ముగ్గురు పారిశుధ్య కార్మికులు మరణిస్తున్నారనే విషయం మనలో ఎందరికి తెలుసు? అంతెందుకు ఢిల్లీలోని సెంట్రల్ విస్టా ప్రారంభోత్సవం నాడే అంతకు కూతవేటు దూరంలో డ్రైనేజీ ప్రమాదంలో ముగ్గురు పారిశుధ్య కార్మికులు చనిపోయారు. అది మనకు వార్త కాలేకపోయింది. ఇలా మన కన్ను దాటిన అనేక జీవితాల గురించి చర్చించాల్సిన అవసరాన్ని నా పుస్తకం నొక్కిచెబుతుంది.
పదాల వాడకంలో...
‘సఫాయి కర్మచారీ ఆందోళన్’ ఉద్యమకారుడు బెజవాడ విల్సన్‌తో నాకు 1990ల నుంచి మానవ హక్కుల ఉద్యమాల ద్వారా పరిచయం. అలా అప్పటికే ఇంగ్లీషు, హిందీ భాషల్లో వచ్చిన ‘అన్‌సీన్’ పుస్తకాన్ని తెలుగులోకి అనువదిస్తే బాగుంటుందని నాకు విల్సన్ సూచించాడు. ‘హైదరాబాద్ బుక్ ట్రస్ట్’ గీతారామస్వామి కూడా అదే అడిగారు. దాంతో మొదటిసారి పుస్తకం చదివినప్పుడు, పది రోజుల్లోనో, నెల రోజుల్లోనో అనువదించే పుస్తకం కాదని అనిపించింది. భాషాసింగ్ రచనా శైలి ఆసక్తికరంగా ఉంది. కానీ భాష విషయంలో బోలెడన్ని అడ్డంకులు తగిలాయి. ముఖ్యంగా తెలుగులో పదాల ఎంపిక అంత సులభం కాలేదు. ఇంగ్లీషులో ‘షిట్, లెట్రిన్, టాయిలెట్’... ఇలా సాధారణంగా అంటుంటాం. అవి ఆ పనికుండే క్రూరత్వాన్ని తగ్గించేవిగా అనిపించాయి. అందుకే, సామాన్యుల వాడుకలోని ‘పియ్యి, పెంట’ అని వాడాలా లేక సంస్కృతీకరణలోని ‘మలమూత్రాదులు’ అనాలా? ‘మరుగుదొడ్లు’ అని ప్రస్తావించాలా లేదా ఎత్తుడు దొడ్లు అనాలా? ఇలా బోలెడు ప్రశ్నలు అనువాద క్రమంలో నాకు ఎదురయ్యాయి. అసలు ‘పాకీ’ అనే పదం వాడాలా వద్దా అనే మీమాంస కూడా తలెత్తింది. అప్పుడు ఈ అంశం మీద క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న కార్యకర్తలను కలిసి, వాళ్లతో చర్చించాను. వారి అభిప్రాయాల మేరకు ఆ సమూహం ఉపయోగించే పదాలనే అనువాదంలోనూ వాడాను.
సమూహానికి దక్కిన గౌరవం...
‘అశుద్ధ భారత్’ను అనువదిస్తున్న సమయంలో నా చిన్ననాటి జ్ఞాపకాల్లో పదిలమైన పారిశుధ్య కార్మికురాలు మస్తానమ్మ పదేపదే గుర్తొచ్చింది. వినోదిని ‘బ్లాక్’ కథ కూడా ప్రేరణగా నిలిచింది. పాకీ పనిలో సుదీర్ఘ కాలం కొనసాగిన వ్యక్తుల అనుభవాలు, ముఖ్యంగా అనంతపురానికి చెందిన నారాయణమ్మ మాటలు, భాషాసింగ్, బెజవాడ విల్సన్‌లతో సంభాషణ, ఇలా పరోక్షంగా, ప్రత్యక్షంగా బోలెడుమంది భాగస్వామ్యం ఇందులో ఉంది. అందుకే ఇది కేవలం నాకొక్కదానికే వచ్చిన అవార్డు కాదు. ఈ పుస్తకంలోని జీవితాలకు కేంద్ర సాహిత్య అకాడమీ సగౌరవంగా ఇచ్చిన గుర్తింపు.
తలబాదుకోవాలని అనిపిస్తుంది...
పుస్తకంలోని కొందరి మాటలు నన్ను చాలా కాలం వెంటాడాయి. అందులో ఓ చోట ‘ఇప్పటికీ ఆ పీతి కంపు నా జుత్తులో నుంచి వస్తున్నట్టే ఉంది’ అని హరియాణాకి చెందిన కమలేశ్ భావోద్వేగ మాటలు... ‘ఆ రోజులను తలచుకుంటుంటే నా కడుపులో తిప్పుతుంది’ అని ఏళ్లకు తరబడి ఎత్తుడు పాకీ దొడ్లు శుభ్రం చేసిన అనంతపురానికి చెందిన నారాయణమ్మ అనుభవం చదువుతుంటే... నిజంగా మనం మనుషులమేనా అని తలబాదుకోవాలని అనిపిస్తుంది. మన చుట్టూ నెలవైన ఇంత అమానవీయమైన ఈ అంశాన్ని ఏ రాజకీయ పార్టీ ఒక ముఖ్యమైన విషయంగా ఎందుకు తీసుకోలేదనే ప్రశ్న తలెత్తుతుంది. పితృస్వామ్య, కుల, మత సమాజపు పట్టు అన్ని సమూహాల్లోనూ ఎంత బలంగా వేళ్లూనుకొనుందో ఈ పుస్తకంలోని జీవితాలు, అనుభవాలు కళ్లకు కడతాయి. అంతటి గడ్డు పరిస్థితిలోనూ ధైర్యం, అనుభవంతో ఎదుటి వ్యక్తులను అంచనా వేసే ఈ వృత్తిలోని ఆడవాళ్ళు, వారి హాస్యపు మాటలు, సునిశిత దృష్టి ఆకట్టుకుంటాయి. తమ తర్వాతి తరాన్ని మాత్రం ఈ వృత్తిలోకి రానివ్వకుండా గట్టి పట్టుదలతో ఉన్నారని అర్థమవుతుంది.
చిత్తశుద్ధి అవసరం...
ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో ఎత్తుడు దొడ్లు లేకపోవచ్చు. చేతులతో పియ్యి, పెంట ఎత్తి పారబోసే మనుషులు కనిపించకపోవచ్చు. కానీ పాకీపని మరో రూపంలో కొనసాగుతోంది. వాళ్ళ వెతలు, అవమానాలు అలానే ఉన్నాయి.. మనవద్ద కూడా సెప్టిక్ ట్యాంకులు, డ్రైనేజీలను శుభ్రం చేస్తున్నదెవరు? ఆర్థిక వెనకబాటుతనానికి రిజర్వేషన్లు కావాలని అడుగుతున్న కొందరు ఈ పనిని చేపట్టేందుకు మాత్రం వెనకడుగు వేస్తారెందుకు? మనం ఒప్పుకున్నా లేకున్నా పారిశుధ్యం, శుభ్రత అంశాలకు కులం ముడిపడుంది. నిజానికి ఈ పనిని మరింత అణగారిన వర్గాల వృత్తి బాధ్యతగా చూస్తున్నాం. అంతకు మించిన దుర్మార్గం మరొకటి ఉందా? పారిశుధ్య కార్మికులు అనగానే రోడ్లు ఊడవటం మొదలు మరుగుదొడ్లు శుభ్రం చేయడం వరకు అనేక పనులు నిర్వర్తిస్తున్నవారంతా ఆ పరిధిలోనికే వస్తారు.
వీరంతా చేస్తున్న పనులకు, వస్తున్న ఆదాయానికి, పొందుతున్న గౌరవానికి ఎక్కడైనా సారూప్యత ఉందా? కేవలం పారిశుధ్యానికి దైవత్వాన్ని ఆపాదించి, వాళ్ల పాదాలు కడగడంతో తమ పని అయిపోయిందని అనుకోడానికి మించిన వంచన మరొకటి లేదు. సాంకేతికాభివృద్ధిలో ముందున్నామని జబ్బలు చరుచుకుంటున్న తరుణంలో ఇప్పటికీ డ్రైనేజీల్లో మనుషులు దిగి శుభ్రం చేయడమేంటి? అందుకు ప్రత్యామ్నాయం ఆలోచించలేమా? విదేశాల్లో ఎలాంటి సాంకేతికతను ఉపయోగిస్తున్నారో అధ్యయనం చేసి, ఇక్కడా అమలుచేయచ్చు. కానీ ప్రభుత్వాలు ఆ పని చేయవు. అందుకు కారణం వారు దీన్నొక ప్రధాన సమస్యగా చూడకపోవడమే.! కరోనా సమయంలో ప్రాణాలను పణంగా పెట్టిమరీ పని చేసిన పారిశుధ్య కార్మికులపై పూల వర్షం కురిపించాం. కానీ వాళ్లకు కనీసం గ్లోవ్స్ కూడా అందించలేకపోయాం. అదే వేలకోట్ల రూపాయలను అనవసరమైన వాటికి మాత్రం వెచ్చిస్తారు. పారిశుధ్య కార్మికుల సంరక్షణకు సమగ్రమైన విధానం తీసుకురావాలి. ‘అశుద్ధ భారత్’ ద్వారా లేవనెత్తిన అంశాలు, ప్రశ్నల మీద పాలకులు చిత్తశుద్ధితో విధానపరమైన కార్యాచరణలోకి వెళ్ళడం ద్వారా అమానవీయ వృత్తి నిర్మూలనకు పరిష్కారాలను అన్వేషించగలం.
సాంత్వన్
ఇది కేవలం నాకొక్కదానికే వచ్చిన అవార్డు కాదు. ఈ పుస్తకంలోని జీవితాలకు కేంద్ర సాహిత్య అకాడమీ సగౌరవంగా ఇచ్చిన గుర్తింపు.