proteins: ప్రొటీన్లు ఒకటే చాలవు!
ABN , First Publish Date - 2022-12-14T22:25:20+05:30 IST
బరువు తగ్గాలనుకొనేవారిలో చాలా మంది ప్రొటీన్లు మంచివని.. కార్బోహైడ్రేట్స్ చెడ్డవనే అపోహలో ఉంటారు.
బరువు తగ్గాలనుకొనేవారిలో చాలా మంది ప్రొటీన్లు మంచివని.. కార్బోహైడ్రేట్స్ చెడ్డవనే అపోహలో ఉంటారు. అయితే శరీరానికి ఈ రెండు ముఖ్యమైనవేనని.. కార్బోహైడ్రేట్‌లను పూర్తిగా మానేస్తే అనేక సమస్యలు ఏర్పడతాయని పౌష్టికాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కార్బోలు అవసరమే..
మన శరీరానికి శక్తిని అందించే ప్రధానమైన ఇంధనాలు కార్బోహైడ్రేట్లు. అదనంగా ఉన్న కార్బోహైడ్రేట్లను మన శరీరం గ్లైకోజిన్‌గా మార్చి దాచుకుంటుంది. ఎప్పుడైనా శరీరానికి ఆహారం అందనప్పుడు ఈ గ్లైకోజిన్‌ను ఉపయోగించుకుంటుంది. అంతే కాకుండా కార్బోహైడ్రేట్స్‌లో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థకు చాలా కీలకం. ఇన్ని శుభలక్షణాలు ఉన్న కార్బోహైడ్రేట్స్ ప్రమాదం ఎందుకంటున్నారనేది ప్రశ్న. దీనికి ఒక కారణముంది. అన్ని కార్బోహైడేట్స్ మన శరీరానికి మంచి చేయవు. బిస్కట్లు, బ్రెడ్స్ వంటి ద్వారా మన శరీరానికి అందే కార్బోహైడేట్స్ వల్ల సమస్యలు ఏర్పడతాయి. అంటే మనం ఎలాంటి కార్బోహైడేట్స్ తింటున్నామనే విషయంపైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది.
ప్రొటీన్లు కీలకం..
మన శరీరంలో కండరాలు పెరగటానికి.. వాటి నిర్వహణకు ప్రొటీన్లు అవసరం. ప్రతి కేజీ శరీర బరువుకు ఒక గ్రాము ప్రొటీను అవసరమవుతుంది. కొన్ని సమయాల్లో రెండు గ్రాములు తీసుకోవచ్చు. అంతకన్నా ఎక్కువ అయితే ఆ ప్రొటీన్‌ను శరీరం ఉపయోగించుకోలేదు. ఆ ప్రభావం మన ఎముకలు, కిడ్నీలు, లివర్‌లపై పడుతుంది. అందువల్ల బరువు తగ్గాలనుకొనేవారు పూర్తిగా కార్బోహైడేట్లను మానివేయకుండా ఉంటే మంచిది.