అదంతా మేలు కోసమే...

ABN , First Publish Date - 2022-10-07T10:03:31+05:30 IST

జపాన్‌లోని క్యోటో నగరంలో దతే జిటోకు అనే కవి ఉండేవాడు. అతను వాకా కవిత్వాన్ని రాసేవాడు. వాకా కవిత్వాన్ని ‘టంకా కవిత్వం’ అని అంటారు.

అదంతా మేలు కోసమే...

పాన్‌లోని క్యోటో నగరంలో దతే జిటోకు అనే కవి ఉండేవాడు. అతను వాకా కవిత్వాన్ని రాసేవాడు. వాకా కవిత్వాన్ని ‘టంకా కవిత్వం’ అని అంటారు. ‘టంకా’ అంటే ‘చిన్న కవిత’ అని అర్థం. ఆ ప్రాంతంలో అతను చాలా పేరున్న కవి. కవిత్వం మీద మంచి పట్టు ఉన్నవాడు. అదే విధంగా ధ్యానం పైన కూడా పట్టు పొందాలనుకున్నాడు.

 

క్యోటోలో షోకుకుజి అనే మఠం ఉంది. ఆ మఠాధిపతి ఎక్ఖీ తనకు తగిన గురువని దతే భావించాడు. ఎన్నెన్నో ఆశలతో ఎక్ఖీని కలుసుకోవడానికి వెళ్ళాడు. దతే తన గదిలోకి అడుగుపెట్టగానే... అతని తల మీద ఎక్ఖీ గట్టిగా గొట్టాడు. దతే తల అదిరిపోయింది. మారుమాట్లాడకుండా బయటకు వెళ్ళిపోయాడు. ఆ ఊర్లో ఎంతో పేరున్న తనను కొట్టడం కాదు కదా... కనీసం తిట్టే సాహసమైనా ఎవరూ చేసేవారు కాదు. కానీ, తను ఎలాంటి తప్పూ చేయకపోయినా ఎక్ఖీ కొట్టాడు. అయితే ఆయన సామాన్యమైన గురువు కాదు. తనను ఎందుకు అలా కొట్టాడో అర్థం కాక... దతేకి చాలా కోపం వచ్చింది. అతని మనసు ఆందోళనతో నిండిపోయింది. ఏది ఏమైనా ఎక్ఖీ కథ తేల్చుకోవాలనుకున్నాడు. ఎక్ఖీ తరువాత మఠాధిపతి కాబోతున్న డోక్వాన్‌ను కలిసి, జరిగిన సంగతి చెప్పాడు. ఏదో ఒక రోజు ఎక్ఖీని ద్వంద్వ యుద్ధానికి రమ్మని సవాలు చేసి, తగిన బుద్ధి చెబుతానన్నాడు. 


అప్పుడు డోక్వాన్‌ ‘‘గురువుగారికి నీ మీద కలిగిన దయను... ఆయన చర్యలో గ్రహించలేని, చూడలేని నువ్వు మూర్ఖుడివా, అంధుడివా? వెళ్ళు. వెళ్ళి మౌనంగా ధ్యానంలో కూర్చో. ఆయన ఎందుకలా కొట్టాడో, దాని వల్ల నీకు కలిగిన శ్రేయస్సు ఏమిటో నీకు క్రమంగా తెలిసివస్తుంది’’ అని చెప్పాడు.

ఆ మాటలతో ప్రభావితమైన దతే... మూడు రోజులపాటు రాత్రింబవళ్ళు ధ్యానంలో నిమగ్నుడయ్యాడు. నాలుగో రోజు అతని శరీరంలోని ప్రతి అణువు పరవశంతో నిండిపోయింది. కళ్ళు తెరచి, పొంగిపొరలుతున్న సంతోషంతో, దేదీప్యమానంగా వెలుగుతున్న ముఖంతో... వడివడిగా ఎక్ఖీ మఠం వైపు నడిచాడు. 


మఠం బయట డోక్వాన్‌ కనిపించాడు. ‘‘మీరు నాకు ఇచ్చిన సలహాకు కృతజ్ఞతలు. మీ జ్ఞానం నుంచి వెలువడిన ఆ సలహా నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. గురువుగారు కొట్టిన ఆ దెబ్బ కీడును కాదు... ఎంతో మేలు చేసింది. ఇంద్రియాతీత జ్ఞానస్థితిని కలిగించింది’’ అని కన్నీరు పెడుతూ, డోక్వాన్‌కు వంగి నమస్కరించాడు.


ఇంతకూ ఎక్ఖీ అందుకలా ప్రవర్తించాడు? దతేని ఎందుకు కొట్టాడు? దానివల్ల మేలు ఎలా కలిగింది?

దతే మామూలు కవి కాదు, ప్రఖ్యాతి చెందిన కవి. అతనికి సహజంగానే అహంకారం ఉంటుంది.  అతను ధ్యానం మీద పట్టునూ, అధికారాన్నీ సాధించాలనుకున్నాడు. ‘ధ్యానం’ అంటేనే అహంకారాన్నీ, అధికారాన్నీ రూపుమాపేది. అహంకారం, అధికారం దట్టంగా ఉన్నవాడికి ధ్యానం ఎలా అబ్బుతుంది? ధ్యాన మాధుర్యం ఎలా తెలిసివస్తుంది? ఇక... కవికి ఇతరుల కన్నా ఆలోచనలు, ఊహలు అధికంగా ఉంటాయి. కవి ప్రస్తుతాన్ని మరచిపోయి... భూత కాలంలోనో, భవిష్యత్‌ కాలంలోనో విహరిస్తూ ఉంటాడు. ఆ ఆలోచనలను వదలాలంటే... ఏదో ఒక ఆకస్మిక సంఘటన జరగాలి. మనం ఏదో ఆలోచిస్తూ పోతున్నప్పుడు... ఒక చెట్టు కొమ్మ కానీ, లేదా స్తంభం కానీ తగిలితే... వెంటనే అన్ని ఆలోచనలనూ విదిలించుకొని... వర్తమానంలోకి వస్తాం. ఎక్ఖీ కొట్టిన దెబ్బ దతేకి ఆ స్థితిని కలిగించింది. అప్పుడు అతనిలో మిగిలినవి... వర్తమానానికి చెందిన ఆలోచనలే. అయితే కోపం ఉంది. ప్రతీకారేచ్ఛ కూడా ఉంది. డోక్వాన్‌ ఇచ్చిన సలహా మేరకు... మూడు రోజుల పాటు దతే చేసిన తీవ్రమైన ధ్యానం... వాటిని సమూలంగా రూపుమాపింది. అతనికి సమాధి స్థితి కాస్త అనుభవం అయింది. ధ్యాన, జ్ఞానాల వైపు నడవడానికి ప్రోత్సాహాన్ని ఇచ్చింది.

రాచమడుగు శ్రీనివాసులు

Read more