అమ్మతో కలిసి జైలుకెళ్లాను

ABN , First Publish Date - 2022-08-15T09:06:41+05:30 IST

దేశమంతా ‘క్విట్‌ ఇండియా’ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతోన్న రోజులవి. మా అమ్మ సరస్వతీ గోరాతో పాటు నేనూ, మా మేనత్త సామ్రాజ్యం, వెంకటసుబ్బమ్మ, రాజేశ్వరి...

అమ్మతో కలిసి జైలుకెళ్లాను

 మనోరమ (94)

దేశమంతా ‘క్విట్‌ ఇండియా’ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతోన్న రోజులవి. మా అమ్మ సరస్వతీ గోరాతో పాటు నేనూ, మా మేనత్త సామ్రాజ్యం, వెంకటసుబ్బమ్మ, రాజేశ్వరి... ఇంకా కొందరు మహిళా నాయకురాళ్లంతా విజయవాడలోని ఒక గుడిలో సమావేశమయ్యాం. అంతా కలిసి బ్రిటిష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలిస్తూ, ర్యాలీగా వెళ్లేందుకు పది అడుగులు ముందుకేశామో లేదో పోలీసులు మమ్మల్ని చుట్టుముట్టి అరెస్టు చేశారు. అప్పుడు నా వయసు పదమూడేళ్లు. చిన్నపిల్లను కనుక నన్ను అరెస్టు చేయకూడదు. కానీ బ్రిటిష్‌ పోలీసులు అవేవీ ఆలోచించలేదు. మొదట మమ్మల్ని విజయవాడ సబ్‌జైల్లో ఉంచారు. తర్వాత బళ్లారిలోని అలీపురం క్యాంపు జైలుకి తరలించారు. అక్కడే అమ్మతో పాటు ఆరు నెలలు కారాగారంలో ఉన్నాను. జాతీయ కాంగ్రెస్‌ జెండాతో నిరసన కార్యక్రమంలో పాల్గొన్న అర్జునరావును కూడా అరెస్టు చేసి, అదే జైల్లో పది నెలలు నిర్బంధించారు. తర్వాత మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. అలా నేను, అర్జునరావు... ఇద్దరం స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని జైలుకెళ్లినందుకు గర్విస్తుంటాను. మాది పెద్దలు కుదిర్చిన కులాంతర వివాహం.


సామాజిక అంతరాలు తొలగాలనే ఉన్నతాశయంతో మా నాన్న గోపరాజు రామచంద్రరావు (గోరా) మా అందరికీ ఆదర్శ వివాహాలు చేశారు. నిజానికి మా పెళ్లి మహాత్మా గాంధీ చేతుల మీదుగా జరగాల్సింది. అంతకు కొద్ది రోజుల ముందు ఆయన హత్యకు గురికావడంతో, అనుకున్న సమయానికే సేవాగ్రామ్‌లోనే 1948, మార్చి 13న నూలు దండల మార్పిడితో మా వివాహం అయింది. జవహర్‌లాల్‌ నెహ్రూ, ఆచార్య వినోబాభావె, లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌, థక్కర్‌ బాబా, ప్రభాకర్‌ జీ వంటి పెద్దల సమక్షంలో మేమిద్దం ఒక్కటయ్యాం. అదివరకే మహాత్మా గాంధీ ఆదేశంతో అర్జునరావు సేవాగ్రామ్‌లో ఏడాది ఉన్నాడు. అదే సమయంలో ఆయన వ్యక్తిత్వాన్ని సునిశితంగా పరిశీలించాకే బాపూజీ మా పెళ్లికి అంగీకారం తెలిపారు. ఆ విధంగా మా పెళ్లి పెద్ద మహాత్మా గాంధీనే! ఇప్పుడు అర్జునరావు వయసు 105 సంవత్సరాలు. నాకు 94 ఏళ్లు. ఇద్దరం స్వాతంత్య్ర వజ్రోత్సవాలను చూడటం ఆనందంగా ఉంది. కానీ దేశంలోని ప్రస్తుత పరిస్థితుల పట్లమాత్రం మాకు ఆందోళనగా ఉంది. 

  • కె.వెంకటేశ్‌ 

Updated Date - 2022-08-15T09:06:41+05:30 IST