Adiseshagiri Rao: అన్ననే కాదు ఆప్త మిత్రుడినీ కోల్పోయా..
ABN , First Publish Date - 2022-11-20T03:09:28+05:30 IST
సూపర్‌స్టార్ కృష్ణకు ఇద్దరు తమ్ముళ్లు.. హనుమంతరావు, ఆదిశేషగిరిరావు. ఆయనకు కుడి, ఎడమ భుజాలు. చిత్ర పరిశ్రమలో ఈ త్రిమూర్తులది ఒకే మాట, ఒకే బాటగా ఉండేది.
సూపర్‌స్టార్ కృష్ణకు ఇద్దరు తమ్ముళ్లు.. హనుమంతరావు, ఆదిశేషగిరిరావు. ఆయనకు కుడి, ఎడమ భుజాలు. చిత్ర పరిశ్రమలో ఈ త్రిమూర్తులది ఒకే మాట, ఒకే బాటగా ఉండేది. హనుమంతరావు చనిపోయి చాలా ఏళ్లయింది. అప్పటినుంచీ అన్నయ్యకు అండగా ఉంటూ పద్మాలయా స్టూడియోస్ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు ఆదిశేషగిరిరావు. ఇప్పుడు పెద్దన్నయ్య ఆకస్మిక మరణంతో ఒంటరివాడయ్యారాయన. కన్నీటి పర్యంతమవుతూ అన్నయ్యతో తన 70 ఏళ్ల అనుబంధాన్ని ‘నవ్య’తో పంచుకున్నారు.
ఆంధ్రాలో ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం తీవ్రంగా జరుగుతున్న రోజుల్లో అన్నయ్య దానికి మద్దతు ప్రకటించారు. చెన్నైలోని పానగల్ పార్క్ దగ్గర నిరాహార దీక్ష కూడా చేశారు. ఆ రోజుల్లో ఆయన తీసుకునే పారితోషికం రూ. 25 వేలు. ఆ మొత్తాన్ని ఉద్యమానికి విరాళంగా ఇచ్చారు. రంగారావుగారు, జగ్గయ్యగారు, సావిత్రిగారు.. ఇలా అంతా అన్నయ్యకు ఈ విషయంలో అండగా నిలిచారు. రామారావుగారు, నాగేశ్వరరావుగారు ప్రత్యేక ఆంధ్రా ఉద్యమానికి వ్యతిరేకులు కాదు కానీ హైదరాబాద్‌లో ఉన్న వారి ఆస్తులకు, సినిమాలకు ఇబ్బంది కలుగుతుందేమోనని తటస్థంగా ఉన్నారు. అందుకే అన్నయ్య మీద ఆగ్రహించారు ఎన్టీఆర్. వీరిద్దరి మధ్య విభేదాలకు తొలి బీజం అక్కడే పడింది.
హీరో కృష్ణ హఠాత్తుగా మరణించడం చాలా మందికి షాక్ గురి చేసింది. ఆ రోజు అసలేం జరిగింది?
ఆ రోజు.. ఆదివారం. పొద్దునే అన్నయ్య దగ్గరకు వెళ్లాను. రెండు గంటలకు పైగా అక్కడే ఉన్నాను. ఆయనకు ఏమనిపించిందో ఏమో మా చిన్నప్పటి సంగతులు చెప్పడం ప్రారంభించారు. నన్ను సైకిల్ మీద కూర్చోబెట్టుకుని సినిమాలకు తీసుకెళ్లిన రోజుల నుంచీ అన్నీ గుర్తు చేసుకుంటూ ఆయన చెబుతుంటే మైమరచి విన్నాను. చెన్నై టీ నగర్‌లోని బోగ్ రోడ్‌లో అన్నయ్య, వదిన, రమేశ్‌లతో పాటు నేను డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్‌లో ఉండేవాళ్లం. దాదాపు అరవై ఏళ్ల నాటి ఆ సంగతి కూడా అన్నయ్యకు బాగా గుర్తుంది. ఆ ఇంట్లో జరిగిన తమాషా సంఘటనలు అన్నయ్య చెబుతుంటే ఇద్దరం నవ్వుకున్నాం.. అలాగే ప్రస్తుతం వస్తున్న సినిమా గురించి కూడా కాసేపు చర్చించుకున్నాం. ఆ తర్వాత పిల్లలు, వారి వ్యవహారాల గురించి కూడా మాట్లాడుకున్నాం. అన్నయ్య ఎంతో ఉత్సాహంగా అన్ని విషయాలూ మాట్లాడుతుంటే నాకు ముచ్చటేసింది. అనారోగ్య లక్షణాలు ఏమీ కనిపించలేదు. చాలా హుషారుగా ఉన్నారు. నన్ను ఆ రోజు అక్కడే భోజనం చెయ్యమన్నారు కానీ ఇంట్లో వేరే వాళ్లని లంచ్‌కి పిలవడంతో మళ్లీ కలుస్తానని చెప్పి వచ్చేశాను.
నేను వచ్చేసిన తర్వాత ఆయన భోజనం చేసి కాసేపు పడుకున్నారు. రోజులాగే ఆ సాయంత్రం కూడా స్నాక్స్ తీసుకున్నారు. నైట్ డిన్నర్ లైట్‌గా తీసుకుని పడుకున్నారు. రాత్రి పన్నెండున్నరకి కార్డియాక్ అరెస్ట్ అయింది. అన్నయ్య రూమ్ బయట ఓ కుర్రాడు రాత్రిళ్లు పడుకోకుండా ఎలర్ట్‌గా ఉంటాడు. ఆయన గది తలుపు తెరిచే ఉంటుంది. అవసరం వస్తే పిలుస్తారు. అన్నయ్యకు గురక పెట్టే అలవాటు ఉంది. ఆ రాత్రి గురక శబ్దం వినిపించక పోవడంతో ఆ కుర్రాడికి వెంటనే అనుమానం వచ్చి పల్స్ చెక్ చేశాడు. ‘ఎర్రర్’ అని వచ్చింది. వాడికి భయం వేసి నాకు ఫోన్ చేశాడు. వెంటనే కాంటినెంటల్ హాస్పిటల్‌కు తీసుకెళ్లమని చెప్పి, నేనూ బయలుదేరా. నేను హాస్పిటల్‌కు చేరేటప్పటికే డాక్టర్లు ట్రీట్‌మెంట్ ప్రారంభించారు. కార్డియాక్ అరెస్ట్ వచ్చిన 20 నిముషాల్లోపే చికిత్స అందితే కొంత ఫలితం ఉంటుంది. కానీ అన్నయ్య విషయంలో ఆ టైమ్ లిమిట్ దాటి పోయిందని డాక్టర్లు చెప్పారు. డిలే అవడం వల్ల మిగిలిన ఆర్గాన్స్ మీద దాని ప్రభావం పడింది. బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయింది. దాదాపు 30 గంటలు డాక్టర్లు అన్నయ్యను బతికించడానికి పోరాటం చేశారు. ఈ ప్రయత్నాల్లో రెండో సారి కార్డియాక్ అరెస్ట్ కావడంతో ఇక ఫలితం లేకపోయింది. ..అనుకోకుండా ఇదంతా జరిగింది. అన్నయ్యది పరిపూర్ణమైన జీవితం. ఏ లోటూ లేకుండా జీవించారు.
ఒకే ఏడాదిలో మీ కుటుంబంలో వరుసగా మూడు మరణాలు. ఎలా తట్టుకోగలిగారు?
నాకు దెబ్బ మీద దెబ్బ అని చెప్పాలి. అన్నయ్యతో నాది 70 ఏళ్ల అనుబంధం. ‘బంగారూ’ అంటూ పిలుస్తూ ఎంతో ఆప్యాయంగా చూసేవారు. ఇక నా 14 ఏళ్ల వయసు నుంచి వదిన సంరక్షణలో ఉన్నాను. అలాగే రమేశ్‌ను చిన్నప్పటి నుంచి ఎత్తుకుని తిప్పి, ఆడించాను. వీళ్లు ముగ్గురూ ఒకే సంవత్సరం నెలల తేడాతో కన్నుమూయడం మా దురదృష్టకరం. నేను ఎంత కుమిలిపోతున్నానో, నాకంటే ఎక్కువగా మహేశ్ బాధ పడుతున్నాడు. అది మాటల్లో చెప్పలేనిది. ఒకళ్లనొకళ్లు ఓదార్చుకోవడం తప్ప మేం చేయగలిగింది ఏదీ లేదు.
కృష్ణ అంత్యక్రియల విషయంలో విమర్శలు వినిపించాయి. ఫామ్ హౌస్‌లో చేయకుండా మహాప్రస్థానంలో అంత్యక్రియలు చేయడానికి కారణం?
కుటుంబ సభ్యులం అంతా కూర్చుని ఆ నిర్ణయం తీసుకున్నాం. మొదట మహేశ్వరంలోని పద్మాలయా స్టూడియోలో అంత్యక్రియలు చేద్దాం అనుకున్నాం. కానీ దూరం అవుతుందని వెనక్కి తగ్గాం. మా ఫామ్ హౌస్‌లో చేయాలనే ఆలోచన వచ్చింది. జనం ఎవరినీ రానివ్వకుండా ఎక్కడో దూరంగా అనాధలా చేయడం మాకు ఇష్టం లేదు. మహా ప్రస్థానంలో అంత్యక్రియలు జరిపినా, మెమోరియల్ ఏర్పాటు చేసి, సమాధి కడతాం. విగ్రహం ఏర్పాటు చేస్తాం. అభిమానుల సందర్శన కోసం గచ్చిబౌలి స్టేడియంలో పార్ధివ దేహాన్ని ఉంచాలని అనుకున్నాం. అయితే మంచు విపరీతంగా పడుతుండడంతో అందరికీ ఇబ్బంది అవుతుందని మా పద్మాలయా ఆఫీసులో ఉంచాం.
మొన్నటివరకూ కృష్ణ ఉన్న ఇంటిని మెమోరియల్‌గా మార్చే అవకాశం ఉందా?
అన్నయ్య ఉన్నంతవరకూ ఆయనదే ఆ భవంతి. ఆయన తదనంతరం అది నరేశ్‌కు చెందుతుంది. మెమోరియల్ బిల్డింగ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం. ఎక్కడ, ఎలా ఏర్పాటు చేయాలనేది నిర్ణయం తీసుకుంటాం.
కుటుంబ సభ్యులతో కృష్ణ ఎలా గడిపేవారు?
కొవిడ్‌కు ముందు ఆన్నయ్య ప్రతి రోజూ సాయంత్రం గండిపేటలో ఉన్న వదిన దగ్గరకు వెళ్లేవారు. అక్కడినుంచి పద్మాలయా ఆఫీసుకు వచ్చేవారు. కొవిడ్ తర్వాత ఆయన బయటకు వెళ్లడం తగ్గించారు. అందుకే ప్రతి సోమవారం అందరం విధిగా లంచ్‌కి కలవాలని అన్నయ్య ఆదేశించారు. ఇంటి నుంచి తలో ఐటెమ్ వండుకుని తీసుకురావాలనే రూల్ పాస్ చేసి, ఏ ఐటెమ్ తీసుకురావాలో కూడా ఆయనే చెప్పేవారు. అంతా కలసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేసేవాళ్లం.
రమేశ్ తనయుడు జయకృష్ణను హీరోగా పరిచయం చేసే ఆలోచన ఉందా?
ప్రస్తుతం న్యూయార్క్‌లో ఫిల్మ్ టెక్నాలజీ కోర్సు చేస్తున్నాడు. హీరో కావాలనే ఆసక్తి వాడికి ఉంది.
మీ చిన్నప్పటి సంగతులు చెప్పండి
మూడేళ్ల వయసులో అన్నయ్య సైకిల్ మీద కూర్చోబెట్టుకుని సినిమాకో, షికారుకో బుర్రిపాలెం నుంచి తెనాలికి తీసుకెళ్లేవాడు. నన్ను కానీ, రెండో అన్నయ్యను బాగా చూసుకునేవారు. అన్నయ్య మద్రాసు వెళ్లి హీరోగా పేరు తెచ్చుకున్న తర్వాత చదువుకోవడానికి అక్కడికే రమ్మన్నారు. అన్నయ్య, వదిన, రమేశ్, నేను, అమ్మ ఒక ఫ్లాట్ అద్దెకు తీసుకుని ఉండేవాళ్లం. అన్నయ్య మొదట్లో అంటే ‘తేనె మనసులు’, ‘కన్నె మనసులు’ షూటింగ్స్ జరిగే సమయంలో బాబూ మూవీస్ ఆఫీసులో ఉండేవాడు. ఆ టైమ్‌లో నేను, కృష్ణంరాజు, చంద్రమోహన్ కలసి ఓ రూమ్‌లో ఉండేవాళ్లం. కృష్ణంరాజు ‘చిలకా గోరింక’లో, చంద్రమోహన్ ‘రంగుల రాట్నం’లో నటిస్తుండేవారు. ఆరు నెలలు కలిసే ఉన్నాం. ఆ తర్వాత అన్నయ్య ఓ ఫ్లాట్ రెంట్‌కు తీసుకోవడంతో అందులోకి మారిపోయా.
మీ అన్నయ్యకు సినిమాలంటే ఆసక్తి ఎలా ఏర్పడింది?
కాలేజీలో చదువుతూ సమ్మర్ హాలిడే్‌సకు వచ్చినప్పుడు ఊళ్లో నాటకాలు వేస్తుండేవారు. ఊళ్లో మాకు ఇటుకల వ్యాపారం, పొలం ఉండేవి. కస్టమర్స్ దగ్గర డబ్బు వసూలు చేయడానికి అన్నయ్యే వెళుతుండేవాడు. ‘ఎర్రగా బుర్రగా.. హీరోలా ఉన్నావయ్యా’ అంటూ వాళ్లు సరదాగా మాట్లాడేవారు. అది మనసులో పడింది అన్నయ్యకి. అక్కినేని నాగేశ్వరరావుగారు 60 చిత్రాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు ఏలూరు కాలేజీలో సన్మానం చేశారు. ఆ సమయంలో ఆయనకు ఉన్న ఫాలోయింగ్‌ను ప్రత్యక్షంగా చూసిన అన్నయ్య హీరో కావాలనే నిర్ణయం గట్టిగా తీసుకున్నారు. ఆ ప్రయత్నాల్లో భాగంగా ఎన్టీ రామారావుగారి దగ్గరకు విజయా అధినేతల్లో ఒకరైన చక్రపాణిగారు తీసుకెళ్లారు. అప్పుడు రామారావుగారు ‘సీతారామ కల్యాణం’ సినిమా తీస్తున్నారు. అందులో శత్రుఘ్నడి వేషం అన్నయ్యకి ఇద్దామనుకున్నారు. కానీ మరీ చిన్న వయసు కావడంతో ఆయన ఆ ఆలోచన విరమించుకున్నారు.
మీ అన్నదమ్ముల మధ్య అభిప్రాయ భేదాలు ఉండేవా?
ఎప్పుడూ లేవండీ. అన్నయ్య చెప్పిందే వేదం మాకు. ఇలా చేద్దామా అని అన్నయ్య అడిగేవాడు. దాని మీద చర్చ జరిగేది. చివరకు అన్నయ్య నిర్ణయమే ఫైనల్. ఆయన చెప్పిన దాన్ని అమలులో పెట్టడమే మా వంతు. దీని వల్ల మా మధ్య తేడాలు వచ్చేవే కాదు. ఒకసారి మాత్రం .. అంటే ‘అల్లూరి సీతారామరాజు’ షూటింగ్ ప్రారంభించిన మరునాడే దర్శకుడు రామచంద్రరావుగారు ఆస్పత్రి పాలయ్యారు. దాంతో అన్నయ్య ఏ దర్శకుడిని పెడదామా అని ఆలోచనలో పడ్డారు. నాకు కోపం వచ్చి షూటింగ్ ఆపేసి, ‘నువ్వు డైరెక్షన్ చెయ్యి.. లేకపోతే సినిమా ఆపేద్దాం. అంతేకానీ మరో దర్శకుడు వద్దు’ అన్నాను. ఇంకో దర్శకుడు వస్తే స్ర్కిప్ట్ దగ్గరి నుంచి అన్నీ మారిపోతాయి. ఒక రోజు ఆలోచించుకుని తర్వాత అన్నయ్య సరేనన్నారు. నా జీవితంలో ఆయన్ని ఎదిరించిన సంఘటన అదొక్కటే!
హీరో అవ్వాలనే కోరిక మీకు ఎప్పుడూ కలగలేదా?
నా దృష్టంతా టెక్నాలజీ మీదే ఉండేది. నటన మీద ఆసక్తే లేదు. గర్వంగా చెప్పడం కాదు కానీ ఆ రోజుల్లో ప్రొడక్షన్ ప్లానింగ్‌లో నంబర్‌వన్ నేను. మా సినిమాలతో టెక్నాలజీని ఎలా పరిచయం చేయాలని ఆలోచించేవాడిని.
పద్మాలయా సంస్థ మళ్లీ చిత్ర నిర్మాణం ప్రారంభించే అవకాశాలున్నాయా?
కొవిడ్‌కు ముందు చాలా ప్లాన్ చేశాం. హృతిక్ రోషన్ హీరోగా ‘పాతాళ్ భైరవి’ చిత్రం తీయాలనుకున్నాం. అంతా సిద్ధం చేస్తున్న తరుణంలో కరోనా రావడం వల్ల ఆగిపోయాయి. తర్వాత మొదలుపెట్టాలనుకునేంతలో ఫ్యామిలీ లో వరుసగా దుర్ఘటనలు జరిగాయి. వాటి నుంచి కోలుకోవడానికి చాలా టైమ్ పడుతుంది.
-వినాయకరావు