మానవత్వాన్నే కాదు... మరో కోణాన్నీ చూశాను!

ABN , First Publish Date - 2022-03-17T05:30:00+05:30 IST

జన జీవన గమనాన్ని... నిజజీవిత కథల్ని మార్చేసింది... కొవిడ్‌. తిరిగి మునుపటి వేగాన్నిఅందుకోవడానికి... ...

మానవత్వాన్నే కాదు... మరో కోణాన్నీ చూశాను!

జన జీవన గమనాన్ని... నిజజీవిత కథల్ని మార్చేసింది... కొవిడ్‌. తిరిగి మునుపటి వేగాన్నిఅందుకోవడానికి... భౌతిక దూరాలు విడిచి దగ్గర కావడానికి... ఇప్పుడిప్పుడే బయటకి అడుగులు వేస్తున్నాం. కానీ... ఈ రెండేళ్లూ ప్రజల మధ్యే నిలిచి... వైరస్‌ బాధితులకు భరోసానిచ్చారు హైదరాబాద్‌ జిల్లా అడిషనల్‌ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఎం.నిర్మలా ప్రభావతి. విపత్కాలంలో విశ్రాంతి ఎరుగని నిస్వార్థ సేవకు తెలంగాణ ప్రభుత్వం ఆమెను ‘ఉత్తమ మహిళా పురస్కారం’తో సత్కరించింది. ఈ సందర్భంగా పలకరించిన ‘నవ్య’తో ఆమె తన అనుభవాలు పంచుకున్నారు... 


‘‘వాస్తవానికి కొవిడ్‌ వంటి నేపథ్యం ఇంతకుముందు ఎన్నడూ లేదు. తొలి రెండు వేవ్‌లతో అన్ని చోట్లా జాగ్రత్తలు పెరిగాయి. కొవిడ్‌ చికిత్సకు సంబంధించి హాస్పిటల్స్‌, బెడ్స్‌ పెరిగాయి. ప్రస్తుతం మనందరం మాస్క్‌లు లేకుండానే తిరిగే దశకు చేరుకున్నాం. చాలా దేశాలు కొవిడ్‌ నిబంధనలనూ ఎత్తేశాయి. సాధారణ స్థితికి దాదాపు చేరువలో ఉన్నాం. అయినా భౌతిక దూరం, మాస్క్‌లు, శానిటైజర్‌ వంటివి వాడడం చాలా మంచిది. జపాన్‌లో కొవిడ్‌ కేసులు ఎక్కువగా నమోదు కాకపోవడానికి కారణం ఇదే. అప్పుడెప్పుడో జరిగిన యుద్దం తర్వాత నుంచి అక్కడ తప్పనిసరిగా మాస్క్‌లు వాడుతూ వచ్చారు. అందువల్లే అక్కడ కరోనా కేసులు పెద్దగా నమోదు కాలేదని సర్వేలు చెబుతున్నాయి. ఇప్పుడు మనం కూడా అలాంటి యుద్ధమే సంభవించిందని భావించాలి. ఎటువంటి ప్రాణ నష్టం సంభవించకూడదు అనుకుంటే.. ఈ నిబంధనలని ఎవరికివారు కొనసాగించాలి. నా వరకు నేను కొవిడ్‌ మంచే చేసిందని అనుకుంటున్నాను. చాలా మందిని కోల్పోయాం.. కాదనను. కానీ ఒక జీవిత విధానాన్ని మాత్రం నేర్పిందని చెప్పగలను. మరిచిపోతున్న కొన్ని విలువలను తిరిగి తీసుకొచ్చింది. మనల్ని మళ్లీ పునర్నిర్మించుకునే అవకాశం ఇచ్చినట్లు నాకు అనిపిస్తుంది. 


మిగిల్చిన జ్ఞాపకాలెన్నో... 

కరోనా కాలంలో పని చేయడాన్ని నేను ఉద్యోగంలా భావించలేదు. ఈ రెండేళ్లూ ప్రజలందరితో మమేకమయ్యా. ఇక్కడొక విషయం చెబుతాను.. ‘నిజాముద్దీన్‌’ నుంచి వచ్చిన చాలా మంది పాజిటివ్‌కి గురయ్యారు. అలా తిరిగి వచ్చిన ఒక ఫ్యామిలీలో తల్లికి నెగెటివ్‌, 3 నెలల బిడ్డకి పాజిటివ్‌, అమ్మమ్మకి పాజిటివ్‌. అది ఎటువంటి పరిస్థితి అంటే.. బిడ్డని వదిలి తల్లి ఉండటానికి లేదు. అసలు వారిద్దరికీ అలా ఎందుకు వచ్చిందని అంతా తలలు పట్టుకున్నాం. నా అంచనా ప్రకారం.. ఆ బిడ్డ తల్లి దగ్గర కంటే అమ్మమ్మ దగ్గరే ఎక్కువ ఉండటం వల్లే.. పాజిటివ్‌ వచ్చింది. వారిని ఎలా ట్రీట్‌ చేయాలి. అప్పట్లో పాజిటివ్‌ వచ్చిన వారిని గాంధీ ఆసుపత్రికి తరలించేవారు. మరి వీరి విషయంలో ఏం చేయాలి? ఇలాంటి సందర్భాల్లో కలెక్టర్‌ శ్వేతా మహంతి ఎంతో సహకరించారు. అర్ధరాత్రి రెండు గంటల వరకు ఆ పాపతో పాటు ఆ వార్డులోని మిగిలిన పిల్లల బాగోగులు చూసి ఇంటికి వచ్చేదాన్ని. మళ్లీ ఉదయం 5 గంటలకి వెళ్లేదాన్ని. ఈ గ్యాప్‌లో కూడా కాల్స్‌ వచ్చేవి. ఇలాంటి ఘటనలు... నిద్ర లేని రాత్రులు ఎన్నో! 


సొంతవారే రానివ్వలేదు...  

నన్ను బాగా కదిలించిన ఘటన... ఒక పేషెంట్‌కి అన్ని పరీక్షలూ చేసి చూస్తే... పల్స్‌ రేటు 92, 93 ఉండేది. వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించాం. అక్కడికి వెళ్లిన తర్వాత చూస్తే 96 ఉంది. పల్స్‌ రేటు 90 కంటే తక్కువ ఉంటేనే చేర్చుకొంటాం అని ఆసుపత్రి వాళ్లు వెనక్కి పంపించారు. అలా మరో ఆసుపత్రి... తిరిగి తిరిగి తెల్లవారుఝాము 3 గంటలకు మళ్లీ మా దగ్గరకే వచ్చారు. పల్స్ ఆక్సో మీటర్ రేటు బానే ఉందని ఇంటికి పంపిస్తే... ఇంటి దగ్గర ఉన్నవాళ్లు వాళ్లని అనుమతించేవారు కాదు. కరోనా సమయంలో మానవత్వం ఎలా అయితే బయటపడిందో.. అలాగే ఇంకో కోణంలో ప్రజలు భయాందోళనలకు గురై, కోలుకుని ఇంటికి తిరిగి వెళ్లిన వారిని కూడా ఇంట్లోకి రానీయని సంఘటనలూ మొదట్లో చాలా కనిపించాయి. 


మహిళలపైనే అధిక ప్రభావం... 

కొవిడ్‌ అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరినీ, ప్రతి రంగాన్నీ ఏదో ఒక రకంగా ప్రభావితం చేసింది. ఒక రకంగా ఎమర్జెన్సీ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మహిళలపైనే అధిక ప్రభావం చూపిందని భావిస్తున్నా. ఏ విపత్తు వచ్చినా అసంఘటిత రంగం మీద బాగా ప్రభావం చూపుతుంది. ఈ రంగంలో 70 శాతం మంది మహిళా ఉద్యోగులే. కరోనా సమయంలో వారు ఉద్యోగాలు కోల్పోవాల్సి వచ్చింది. ఫలితంగా ఇంటి దగ్గర కూడా వారిపై ఒత్తిడి పెరిగింది. ఉన్నట్టుండి మగవాళ్లపై ఆధారపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇంట్లోవారి పోరు భరించలేక కొందరు మహిళలు ఇష్టంలేని ఉద్యోగాలు చేయాల్సి రావచ్చు. అలాంటివారు తిరిగి కోలుకోలేరు. ఆర్థిక ఇబ్బందులు, ఇతరత్రా అన్నీ కలిపి అవస్థలు పడేది మాత్రం ఎక్కువగా మహిళలే. నాకు తెలిసి ఈ కాలంలో గృహ హింస కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. 


ఇక భౌతిక దూరం వంటి నిబంధనల వల్ల సెక్స్‌ వర్కర్ల పరిస్థితి ఎంత దౌర్భాగ్యంగా ఉంటుందో ఊహించండి! ఈ ఆపత్కాలంలో ఎంతోమంది దాతలు ముందుకు వచ్చి నిత్యావసరాలు అందించారు. కానీ సెక్స్‌వర్కర్లను ఎవరూ పట్టించుకోలేదు. అదే సమయంలో వారికి రేషన్ అందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అప్పుడు కలెక్టర్‌ సూచనల మేరకు వారికి సాయం చేశాను. ప్రభుత్వం రేషన్‌ ఇచ్చింది. అలాగే... కొన్నిచోట్ల ఇంటిల్లిపాదికీ వైరస్‌ సోకింది. తల్లికి పాజిటివ్‌ వచ్చి, బిడ్డకు నెగటివ్‌ ఉన్నప్పుడు... ఆ పాపని చూసుకోమంటే... ‘అమ్మో’ అన్నవారూ ఉన్నారు. మరి వారిని ఎక్కడ ఉంచాలి? ఎవరు చూసుకోవాలి? అని ఆలోచిస్తున్నప్పుడు ‘స్త్రీ శిశు సంక్షేమ శాఖ’ కమిషనర్‌ దివ్యా దేవరాజన్‌... ‘అలాంటి వారి కోసం ఏదైనా చేద్దాం’ అన్నారు. నేను ఎంతో సంతోషపడ్డాను. వెంటనే అందుబాటులో ఉన్న ఒక పాడుబడిన భవనాన్ని బాగుచేయించి, బెడ్లు, ఆహారం, మందులు... అన్నీ సమకూర్చారు. లాక్‌డౌన్‌ అమల్లో ఉన్నప్పుడు నేరుగా ఇంటికే మందులు పంపించాం. వైద్య సేవలు అందించాం.’’ 


అవి సమకూర్చాలి..

ఆరోగ్యం రంగంలో 70 శాతం మహిళలే ఉన్నారు. ఇలా ఇంకా ఎన్నో రంగాల్లో మహిళలు అధిక సంఖ్యలో పనిచేస్తున్నారు. వాటన్నిటినీ వెల్‌పెయిడ్‌ సెక్టార్లుగా మార్చుకోవాలి. పిల్లల సంరక్షణ కేంద్రాలు కొన్ని ఉన్నాయి కదా.... అలా పిల్లల సంరక్షణ చూసేలా ఉండాలి. అలాగే పెద్దవాళ్లని చూసుకొనేలా ఏర్పాట్లు చేయాలి. నాకు రెండుసార్లు వైరస్‌ సోకింది. ఆ సమయంలో పెద్ద వయసులో ఉన్న నా తల్లితండ్రుల గురించి చాలా ఆలోచించాల్సి వచ్చింది. వెంటనే వాళ్లను ఊరు పంపించేశాను. అలాంటి అవకాశాలు అందరికీ ఉండవు కదా! 


మాస్క్‌తో లెప్రసీకి అడ్డుకట్ట... 

కుష్ఠు వ్యాధి అనేది ఒక ప్రత్యేక సమస్య. ‘కుష్ఠు వాళ్లని జీసస్‌ బాగు చేశారు’ అని బైబిల్‌లో కూడా ఉంటుంది. అలా చూస్తే ఇది పురాతన వ్యాధి. దీనిపై ఉన్న అపోహల్ని ఎంత తొలగించినా.. సమాజం మాత్రం వీళ్లని దూరంగానే ఉంచుతోంది. హెచ్‌ఐవీ, లెప్రసీలలో ఏది రుగ్మత కలిగించేది అంటే కచ్చితంగా లెప్రసీనే. ఎందుకంటే హెచ్‌ఐవీ వచ్చిన వ్యక్తికి అది ఉందన్న విషయం అతను చెబితే తప్ప ఎవరికీ తెలియదు. కానీ కుష్ఠు వ్యాధి అలా కాదు... అది బయటికి కనిపిస్తుంది. దీంతో వ్యాధిగ్రస్తులు బయటకు రాకుండా ఇబ్బంది పడుతున్నారు. ఇంకో విషయం ఏమిటంటే... కొవిడ్‌ కారణంగా వాడుతున్న మాస్క్‌లతో లెప్రసీ తగ్గే అవకాశం కూడా ఉంది. ఇది బ్యాక్టీరియా వల్ల వస్తుంది. కరోనా అనేది వైరస్‌ వల్ల వస్తుంది. టీబీ కూడా బ్యాక్టీరియా వల్లే సోకుతుంది. లెప్రసీకి సిస్టర్‌ వంటిది టీబీ. 


ముందుగానే గుర్తిస్తే...

మాస్క్‌తో లెప్రసీకి అడ్డుకట్ట... 

కుష్ఠు వ్యాధి అనేది ఒక ప్రత్యేక సమస్య. ‘కుష్ఠు వాళ్లని జీసస్‌ బాగు చేశారు’ అని బైబిల్‌లో కూడా ఉంటుంది. అలా చూస్తే ఇది పురాతన వ్యాధి. దీనిపై ఉన్న అపోహల్ని ఎంత తొలగించినా.. సమాజం మాత్రం వీళ్లని దూరంగానే ఉంచుతోంది. హెచ్‌ఐవీ, లెప్రసీలలో ఏది రుగ్మత కలిగించేది అంటే కచ్చితంగా లెప్రసీనే. ఎందుకంటే హెచ్‌ఐవీ వచ్చిన వ్యక్తికి అది ఉందన్న విషయం అతను చెబితే తప్ప ఎవరికీ తెలియదు. కానీ కుష్ఠు వ్యాధి అలా కాదు... అది బయటికి కనిపిస్తుంది. దీంతో వ్యాధిగ్రస్తులు బయటకు రాకుండా ఇబ్బంది పడుతున్నారు. ఇంకో విషయం ఏమిటంటే... కొవిడ్‌ కారణంగా వాడుతున్న మాస్క్‌లతో లెప్రసీ తగ్గే అవకాశం కూడా ఉంది. ఇది బ్యాక్టీరియా వల్ల వస్తుంది. కరోనా అనేది వైరస్‌ వల్ల వస్తుంది. టీబీ కూడా బ్యాక్టీరియా వల్లే సోకుతుంది. లెప్రసీకి సిస్టర్‌ వంటిది టీబీ. 

Updated Date - 2022-03-17T05:30:00+05:30 IST