అప్పచ్చుల నైవేద్యం

ABN , First Publish Date - 2022-06-26T18:00:25+05:30 IST

అన్నమయ్య రాసిన ‘బుజ్జి చెన్నకేశవ శతకం’ లోంచి ఎవరో పామరుడు రాసుకున్న ఈ పద్యాన్ని మైనంపాటి సుబ్రహ్మణ్యంగారు సేకరించి జనవరి 1984 సప్తగిరి

అప్పచ్చుల నైవేద్యం

సిన్న శెంబుతో నీళ్ళు సీకయ ఉదకంబు

అల్లంబు బెల్లంబు అరటిపండు 

తేనెతో మాపిన తియ్య మామిడిపండు

బంగారు పిడికెళ్ళు పనసతొన్లు 

సొగసిన ఔగులు సొజ్జలు కజ్జలు

చక్కెర మండగ లుక్కెరాళ్ళు 

అర్చిలు సిమ్మిలులు దోసలు కల్లొసులు

పాలకలేలకుల్లు ... పాలపొంగు

పేణీ బురడాలు గారిలు బూరె చుట్లు

అప్పాలు నా దప్పాలు పప్పు పాయాసాలు

అమ్మ పంపెను అన్ని ఆరగింపన్న బుజ్జీ

అన్నయ వరదాల్లుండు బుచ్చిన్న కేశాలు


అన్నమయ్య రాసిన ‘బుజ్జి చెన్నకేశవ శతకం’ లోంచి ఎవరో పామరుడు రాసుకున్న ఈ పద్యాన్ని మైనంపాటి సుబ్రహ్మణ్యంగారు సేకరించి జనవరి 1984 సప్తగిరి మాసపత్రికలో ప్రచురించారు. తాళ్ళపాక అన్నమాచార్య ప్రాజెక్టులో పరిశోధకులైన గౌరిపెద్ది రామసుబ్బశర్మగారు ఇది అన్నమయ్య చిన్న వయసులో చేసిన రచన కావచ్చునని, తల్లి తన బిడ్డను లాలించి నీళ్ళు పోసేసందర్భం అనీ భావించారట. ‘అచ్చన్నవరదాళ్ళు బుచ్చి కేశవులు’ అనేది ఈ చెన్నకేశవ శతకంమకుటం. స్నానమాడేందుకు పిల్లలు మారాం చేస్తే, తల్లి బోలెడన్ని అప్పచ్చులు వండిపెడతానని నమ్మించి, బుజ్జగించి, నీళ్లు పోస్తుంది. పిల్లల స్నానాన్ని ‘లాలపోయటం’ అంటారందుకే! తలంటితే పిల్లలకు జలుబు రాకుండా అల్లంముద్దని తాటిబెల్లం పాకంపట్టి ఉండలు చేసి తినిపిస్తారు. అరటిపండు; తేనెలో నానిన తియ్య మామిడిపండురసం; బంగారు పిడికెళ్ళు = పిల్లల పిడికిట్లో ఇమిడేంత చిన్న భక్ష్యం.దీన్ని పిల్లలు చేత్తో పుచ్చుకుని చీకుతూ తింటానికి వీలైనది; పనసతొనలు/పనసతొలలు=గోధుమ పిండిని పూరీలా వత్తి చాకుతో సెంటీమీటరు వెడల్పున బద్దలుగా కోసి, చాపలా చుట్టి అటు చివరా, ఇటు చివరా దగ్గరగా వత్తి, నూనెలో వేయించి బెల్లంపాకం పడ్తారు. ఇవి చూపులకు పనసతొనలఆకారంలో ఉంటాయి; ఔగులు= ఆంధ్ర శబ్దరత్నాకరం ఔగులు, సుకియలు రెండూ ఒకటేనంది. సుకియలు అంటే పూర్ణం బూరెలే! తమిళంలో సుకియ, కన్నడంలో సుగియ అని పిలుస్తారు; సొజ్జలు= సజ్జప్పాలు; కజ్జలు= కజ్జికాయలు; చక్కెరమండిగలు=పొరల మీద ఒత్తి బోర్లించిన తప్పాల (గిన్నె) మీద కాల్చిన తీపిపరోటాలు; ఉక్కెరవ హల్వా లాంటి వంటకం, అరిసె; చిమ్మిలి; దోసె; కల్లొసులువ పిండిని పులియ బెట్టి చేసే పులిబొంగరాలు  ; పాలకాయలు =విసిరిన బియ్యంపిండి, వెన్న, నువ్వు పప్పు, ఉప్పు, మిరియాలపొడి కలిపి వేలంతపొడవుగా చేసిన భక్ష్యం; ఏలకల్లు = ఏలకులపొడి వేసిన బెల్లపు పానకం; పాల పొంగు= పొంగుతున్న పాలలో బియ్యం వేసి వండిన పరమాన్నం ; పేణీలు= దారపు పోగులంత సన్నగా వత్తిన నూడుల్స్‌; బురడాలు= పూరీలా పొంగే వంటకం; గారెలు; బూరెలు; చుట్లు= తమిళంలో మురుక్కం అంటేతిప్పటం. కాగే నూనెలో జంతికల్ని గుండ్రంగా చుట్టినట్టు తిప్పుతూ వత్తుతారు కాబట్టి తమిళంలో మురుకులు, తెలుగులో చుట్లు అంటారు. మురుకులనే అలవాటు తెలుగు వారికీ ఉంది; అప్పాలు= అప్పచ్చులు;దప్పము= బాగా కూర గాయ ముక్కలతో చిక్కగా వండిన (దప్పళం లాగా) అన్నము.


తమిళులు కదంబం అనీ. కన్నడం వారు బకాళాబాత్‌ అనీ పిలిచే పులుసన్నం. పప్పు; పాయసం ఇలా అనేక వంటకాలను అమ్మపంపించిందిఆరగించవయ్యా బుజ్జి చెన్నకేశవా అంటున్నాడు అన్నమయ్య. తాళ్లపాక గ్రామంలో చెన్నకేశవ ఆలయం ఉందనీ, విగ్రహం 6-7 యేళ్ల బాలుడి ఆకారంలో ఉంటుందనీ, ‘‘బుజ్జి చెన్నకేశవ (బుచ్చన్న కేశవ) పేరుతో పిలుస్తారనీ మైనం పాటి సుబ్రహ్మణ్యం గారు రాశారు. అభిషేకా లవలన కలిగే జిడ్డు పోవటానికి శీకాయరసంతో విగ్రహాన్ని శుద్ధిచేసే ఆచారం అక్కడ ఉందట!  ఈ సీసపద్యంలో చెప్పిన వంటకాలలో హల్వా, పరోటా, నూడుల్సు లాంటివి జంక్‌ఫుడ్స్‌గా మారాయి.  

 - డా. జి వి పూర్ణచందు, 94401 72642

Updated Date - 2022-06-26T18:00:25+05:30 IST