Metla Bavi: చారిత్రక దారి..మెట్ల బావి..

ABN , First Publish Date - 2022-12-03T12:40:39+05:30 IST

బన్సీలాల్‌పేటలోని చారిత్రక మెట్ల బావి పూర్వవైభవం సంతరించుకుంటోంది. 17వ శతాబ్దం నాటి కట్టడం

Metla Bavi: చారిత్రక దారి..మెట్ల బావి..

పర్యాటక కేంద్రంగా అభివృద్ధి

తుది దశకు పునరుద్ధరణ పనులు

ప్రత్యేక ఆకర్షణగా విద్యుత్‌ దీపాలు

హంపి థియేటర్‌, కాన్ఫరెన్స్‌ హాల్‌

ఎప్పుడూ నీటితో కళకళలాడేలా ఏర్పాట్లు

వీక్షకుల కోసం ప్రత్యేకంగా సీటింగ్‌

హైదరాబాద్‌ సిటీ/పద్మారావునగర్‌: బన్సీలాల్‌పేటలోని చారిత్రక మెట్ల బావి పూర్వవైభవం సంతరించుకుంటోంది. 17వ శతాబ్దం నాటి కట్టడం పునరుద్ధరణ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. చెత్తా చెదారంతో నిండిన బావిని శుభ్రపర్చడంతోపాటు సాంస్కృతిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేశారు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ సంయుక్తంగా నిధులు వెచ్చిస్తూ పునరుద్ధరణ పనుల బాధ్యతను ఓ స్వచ్ఛంద సంస్థకు అప్పగించారు. బావిలో పేరుకుపోయిన 500 టన్నుల వ్యర్థాలు తొలగించారు. మెట్లు, బావి అడుగు భాగంలోని నాటి ఆకృతి, నిర్మాణ కౌశలం దెబ్బతినకుండా ఫ్లోరింగ్‌ చేశారు. కొత్త పైపులు ఏర్పాటు చేయడంతో పాటు నీటిని నింపేందుకు వాటర్‌ బోర్డు నుంచి నల్లా కనెక్షన్‌ తీసుకోనున్నారు. ఇందుకోసం దరఖాస్తు చేసినట్టు సికింద్రాబాద్‌ జోనల్‌ కమిషనర్‌ శ్రీనివా్‌సరెడ్డి తెలిపారు.

57 అడుగుల లోతు...

నిజాం కాలంలో అక్కడి ప్రజల తాగునీటి అవసరాల కోసం తవ్వి న బావి 57 అడుగుల లోతు ఉంటుంది. గతంలో బావిని నాగన్నకుంటగా పిలిచేవారని చారిత్రక ఆధారాలు స్పష్టం చేస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. దశాబ్దాలుగా ఎవరూ పట్టించుకోకపోవడంతో అధ్వానంగా మారిన వారసత్వ నిర్మాణం ఎట్టకేలకు హంగులు అద్దుకుం టోంది. మెట్లబావి పక్కన ఉన్న పురాతన కమ్యూనిటీ హాల్‌ను కూల్చివేశారు. దాదాపు 1500 చదరపు గజాల ఆ స్థలంలో హంపి థియేటర్‌, కాన్ఫరెన్స్‌ హాల్‌, వేదికతో పాటు సీటింగ్‌ ఏర్పాట్లు చేశారు. మెట్లబావిలో రంగురంగుల విద్యుద్దీపాలంకరణకు భూగర్భ విద్యుత్‌ కేబుల్‌ ఏర్పాటు చేశారు. మెట్ల బావిని ఆనుకొని ఉండే భవనం ఎదుట గార్డెన్‌ అభివృద్ధి చేశారు. భవనంపై నుంచి విద్యుద్దీపాలంకరణలో ఉన్న బావిని చూసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సందర్శకుల వాహనాలు నిలిపేలా పార్కింగ్‌ సదుపాయం కల్పించారు. దీనికి దాదాపు రూ.5 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు అధికారులు చెప్పారు.

గ్రేటర్‌లో 44 మెట్ల బావులు..

గ్రేటర్‌లో 44 మెట్ల బావులున్నట్టు గుర్తించారు. ఇప్పటికే బాపూఘాట్‌, గచ్చిబౌలి, సీతారాంబాగ్‌, గుడి మల్కాపుర్‌, శివంబాగ్‌ ప్రాంతాల్లో మెట్లబావుల పునరుద్ధరణ చేపట్టారు. బన్సీలాల్‌పేటలో మాత్రం పునరుద్ధరణతోపాటు అదనపు హంగులతో పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేశారు.

5న ప్రారంభం

పద్మారావునగర్‌ : పునరుద్ధరించిన బన్సిలాల్‌పేటలోని మెట్ల బావిని ఈ నెల 5న మంత్రి కేటీఆర్‌ ప్రారంభించనున్నారు. ఈ మేరకు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ప్రారంభోత్సవ ఏర్పాట్లను శుక్రవారం పరిశీలించారు. మెట్లబావి నమూనా, వ్యర్థాల తొలగింపు సమయంలో లభ్యమైన పురాతన వస్తువుల ప్రదర్శన, అభివృద్ధి చేసిన గార్డెన్‌ను పరిశీలించారు. మంత్రి మాట్లాడుతూ.. పురాతన కట్టడాలను పరిరక్షించి భవిష్యత్‌ తరాలకు అందించాలనేది ప్రభుత్వ ముఖ్యోద్ధేశమని, అందులో భాగంగానే హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో మెట్లబావి అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. నగరంలో 44 బావులు ఉండగా ఆరు బావుల అభివృద్ధి, పరిరక్షణ పనులు చేపట్టినట్టు చెప్పారు. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌, జోనల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌ రెడ్డి, సాహె స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు కల్పన ఉన్నారు.

Updated Date - 2022-12-03T12:40:41+05:30 IST