సాంస్కృతిక కళారాధన

ABN , First Publish Date - 2022-09-10T05:30:00+05:30 IST

నాట్యం ఆమెకు కళారాధన మాత్రమే కాదు... శిథిలమైన గుడి గంటలు మోగించే మార్గం కూడా! పురాతన ఆలయాలకు పునర్‌వైభవం తెచ్చి...

సాంస్కృతిక కళారాధన

నాట్యం ఆమెకు కళారాధన మాత్రమే కాదు... శిథిలమైన గుడి గంటలు మోగించే మార్గం కూడా! పురాతన ఆలయాలకు పునర్‌వైభవం తెచ్చి... మన సంస్క ృతిని భావితరాలకు అందించే మహత్తర కార్యం చేపట్టారు నవతరం నర్తకి హిమాన్సి కాట్రగడ్డ. ఆ విశేషాలను ఆమె ‘నవ్య’తో పంచుకున్నారు... 


‘‘ఉన్నత చదువులు... మంచి ఉద్యోగం... జీవితంలో స్థిరపడాలంటే ఇవి అవసరమే. కానీ నేను, నా ఆలోచనలు అందుకు భిన్నం. నాకు చిన్నప్పటి నుంచి నాట్యం అంటే ఎంతో ఇష్టం. తరువాత అదే నా జీవితం అయిపోయింది. ఇంతగా నాట్యాన్ని ప్రేమించడానికి కారణం... మా అమ్మమ్మ, అమ్మ. అమ్మమ్మకు సంగీతం వచ్చు. వీణ బాగా వాయిస్తారు. అమ్మకు నన్ను కళల వైపు నడిపించాలన్న కోరిక. వాళ్లిద్దరి ప్రోత్సాహంతో ఐదేళ్లప్పుడే నాట్యం మొదలుపెట్టాను. కూచిపూడి, భరతనాట్యం... ఆరంభంలో రెండూ నేర్చుకున్నా. తరువాత కూచిపూడినే పొఫ్రెషన్‌గా ఎంచుకున్నా. తొలుత వారాంతాల్లో మా ఊరు వరంగల్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చి డ్యాన్స్‌ నేర్చుకొనేదాన్ని. తరువాత వరంగల్‌లోనే ప్రముఖ గురువు సుధీర్‌రావు గారి దగ్గర చేరాను. ఆయన శిష్యరికంలో నాలోని అసలైన నర్తకి బయటకు వచ్చింది. 


కల నిజమైన రోజు...  

మా గురువు గారి ఆధ్వర్యంలో చిన్న వయసులోనే అరంగేట్రం చేశాను. ఆ తరువాత దేశంలోని ప్రసిద్ధ ఆలయాల్లో జరిగే ఉత్సవాలు, ఇతర దేశాల్లో చాలా ప్రదర్శనలు ఇచ్చాను. అన్నిటికంటే నాకు మధురానుభూతిని ఇచ్చింది... చిదంబరంలో ఏటా నిర్వహించే ‘నాట్యాంజలి’లో ప్రదర్శన. సంప్రదాయ నృత్యం నేర్చుకున్నవారందరూ ప్రతిష్టాత్మకంగా భావించే ఉత్సవం అది. అంతేకాదు... అక్కడ నటరాజ స్వామి ఆలయం ఉంది. ఆయనకు ఆలయాలు చాలా అరుదు. నటరాజ సమక్షంలో నర్తించాలన్న నా కల నెరవేరిన క్షణం అది. తరువాత తంజావూర్‌లో ‘సౌత్‌జోన్‌ కల్చరల్‌ సెంటర్‌’ నిర్వహించే ఉత్సవంలో కూడా పాల్గొన్నాను. ఇక ‘ఆలిండియా ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌’ నిర్వహించిన కార్యక్రమంలో నటీమణులు శోభన, రుక్మిణి విజయ్‌కుమార్‌ లాంటి ప్రముఖులు నాట్య ప్రదర్శన ఇచ్చారు. అలాంటి వేదికపై నాకు గంటన్నర సమయం కేటాయించడం గొప్ప అనుభూతినిచ్చింది. 


‘టెంపుల్‌ డ్యాన్స్‌’...  

ఇప్పుడు నా లక్ష్యం ఒక్కటే... జీర్ణావస్థలో ఉన్న పురాతన ఆలయాలకు పునర్‌వైభవం తీసుకురావడం. వాటిల్లోని అద్భుతమైన శిల్పకళను, తద్వారా మన సంస్కృతిని తరువాతి తరాలకు అందించడం. అందుకోసమే మూడేళ్ల కిందట ‘టెంపుల్‌ డ్యాన్స్‌’ పేరుతో స్టూడియో ప్రారంభించాను. శిథిలమైన అలనాటి ఆలయాల్లో నృత్యరూపాకాలను ప్రదర్శించి, వాటిని షూట్‌ చేసి, ప్రచారం కల్పించడం మా ప్రధాన ఉద్దేశం. 2019లో డ్యాన్స్‌ చేస్తుండగా నా ఎమడ మోకాలికి గాయమైంది. లిగమెంట్లు దెబ్బతినడంతో సర్జరీ చేశారు. ఆరు నెలలు నాట్యానికి దూరంగా ఉండాల్సి వచ్చింది. ఖజరహో, హంపి, కోణార్క్‌ తదితర ప్రసిద్ధ ఆలయాల్లో ప్రదర్శనలకు వెళ్లినప్పుడు అక్కడి శిల్ప సౌందర్యం నన్ను ఎంతో ఆకట్టుకొనేది. సర్జరీతో లభించిన ఖాళీ సమయంలో ఆ ప్రాంతాలన్నీ తిరిగాను. అలా మా ఊరు సమీపంలోని రామప్ప దేవాలయానికి వెళ్లాను. అక్కడి ప్రతి ఒక్క శిల్పం అద్భుతం. నాట్యశాస్త్రంలో 108 కర్నాస్‌ ఉంటాయి. అవన్నీ ఆ గుడిలో చెక్కారు. తరువాత వరంగల్‌ దగ్గరి ఘనపూర్‌లోని కోటగుళ్లుకు వెళ్లాను. చాలామందికి ఈ గుడి గురించి తెలియదు. కానీ రామప్ప ఆలయంలో శిల్ప కళ ఎంత అద్భుతంగా ఉందో అక్కడా అంతే అద్భుతంగా ఉంది. మరి రామప్ప గుడికి ప్రపంచ వ్యాప్త గుర్తింపు వచ్చినప్పుడు కోటగుళ్లకు ఎందుకు రాలేదు? రెండూ కాకతీయులు కట్టినవే! ఈ ఆలోచనే ‘టెంపుల్‌ డ్యాన్స్‌’కు పునాది. కాకతీయులు, చోళరాజులు కట్టిన ఇలాంటి ఎన్నో క్షేత్రాలు శిథిలావస్థలో ఉన్నాయి. ప్రభుత్వం, ప్రజలు పట్టించుకోక అవి శిథిలావస్థకు చేరాయి.  


కోటగుళ్లుకు పూర్వ వైభవం... 

మా ప్రాజెక్ట్‌ను కోటగుళ్లుతోనే ప్రారంభించాం. అక్కడి ప్రత్యేకతలు తెలుపుతూ, శిల్ప సౌందర్యాన్ని చూపిస్తూ నృత్యరూపకం ఒకటి షూట్‌ చేశాం. దానికి సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం కల్పించాం. అది చూసిన ఆ ప్రాంతానికి చెందిన ఎన్‌ఆర్‌ఐలు, ప్రముఖులు ముందుకు వచ్చారు. నిధులు ఇచ్చారు. వాటితో ఆలయ పునరుద్ధరణ జరుగుతోంది. అక్కడి దైవానికి ధూపదీప నైవేద్యాలు అందుతున్నాయి. అలా ఇప్పటికి పది పదిహేను ఆలయాల్లో షూట్‌ చేశాం. మా ప్రాజెక్ట్‌కు సహకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ షూటింగ్‌లకు సినిమాటోగ్రఫీ నుంచి కలరింగ్‌, స్ర్కిప్ట్‌... అన్నీ నేనే చూసుకొంటాను. నాకు ఫిలిమ్‌ మేకింగ్‌ చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే సినిమాల్లో కూడా నటించాను. తొలి చిత్రం కన్నడలో. తెలుగులో ‘ఎన్టీఆర్‌ కధానాయకుడు, మహానాయకుడు’ చిత్రాల్లో పురందేశ్వరి పాత్ర వేశాను. ఇక ‘టెంపుల్‌ డ్యాన్స్‌’ కాన్సెప్ట్‌ నచ్చి వివిధ రంగాలకు చెందిన ఐదుగురు నాతో కలిసి పని చేస్తున్నారు. 



డ్యాన్సే కెరీర్‌... 

ప్రస్తుతం నేను బీటెక్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నా. చదువు కంటే నాకు నాట్యమే ప్రధానం. అదే కెరీర్‌. ఆ విషయం మా అమ్మానాన్నలు కూడా అర్థం చేసుకున్నారు. నా వరకు నాట్యం ఒక కళ మాత్రమే కాదు... ఆ భగవంతుణ్ణి కొలిచే మార్గం. ‘టెంపుల్‌ డ్యాన్స్‌’ ద్వారా సాధ్యమైనన్ని పురాతన ఆలయాలను పునరుద్ధరించే దిశగా అడుగులు వేస్తున్నాం. నాట్యానికి, మన సంస్కృతికి చేస్తున్న సేవలు గుర్తించిన కేంద్ర ప్రభుత్వం నాకు ‘నేషనల్‌ యూత్‌ అవార్డ్‌’నిచ్చింది. అలాగే తెలంగాణ ప్రభుత్వం నుంచి ‘బాలరత్న’తో పాటు ఇంకా ఎన్నో పురస్కారాలు అందుకున్నాను. ఇవి నాకు ఎనలేని స్ఫూర్తినిస్తాయి. ఎప్పటికైనా ఒక డ్యాన్స్‌ అకాడమీ నెలకొల్పాలన్నది నా కోరిక. త్వరలోనే అది కార్యరూపం దాలుస్తుందని ఆశిస్తున్నా.’’



‘అంతర్‌ ఉన్మేష మానసి’...

పదహారేళ్ల నా నాట్య అనుభవాన్నంతటినీ రంగరించి ఓ కొత్త కాన్సె్‌ప్టతో ‘అంతర్‌ ఉన్మేష మానసి’ ప్రదర్శన ఇస్తున్నా. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఆదివారం ఈ ప్రదర్శన జరుగుతుంది. నాట్య శాస్త్రంలో అష్టవిధ నాయికలు ఉంటారు. అంటే ఒక మహిళ ఎనిమిది స్వాభావిక విశిష్టతలను చెప్పడం. ఈ కాన్సె్‌ప్టను నృత్యరూపకంగా చేసినవారు చాలా చాలా అరుదు. అలాగే ‘ప్రవేశ దరువులు’... అంటే ఒక పాత్ర తనను తాను పరిచయం చేసుకోవడం. దీనికి అందరూ రుక్మిణి, సత్యభామ లాంటి పౌరాణిక పాత్రలు ఎంచుకొంటారు. నేను చారిత్రక నేపథ్యం తీసుకున్నాను. రాణి రుద్రమదేవి సాహసాన్ని చూపిస్తున్నాను. దాంతోపాటు ‘సింహనందిని’ కూడా చేస్తున్నాను. ఇలా విభిన్నమైన, వినూత్నమైన అంశాలతో పెద్దఎత్తున రూపకం 

చేస్తున్నాను.


ఆ ప్రశంస ఎంతో ప్రత్యేకం...

కూచిపూడి నాట్య దిగ్గజం శోభానాయుడు గారితో నాది ప్రత్యేక అనుబంధం. మూడేళ్ల కిందట విశాఖపట్టణంలో ఆమెతో కలిసి వేదిక పంచుకొనే అదృష్టం దక్కింది. అందులో ఆమె పార్వతిగా, నేను శివుడిగా చేశాం. ‘నీ నాట్యానికి నేను అభిమానిని’ అంటూ ఆమె నన్ను అభినందించారు. నేను ఆరాధించే వ్యక్తి నన్ను ప్రశంసిస్తుంటే... ఆ ఆనందం మాటల్లో చెప్పలేను. అది నాకు లభించిన గౌరవం. తరచూ ఆవిడతో మాట్లాడుతుండేదాన్ని. కానీ ఆమె మమ్మల్ని వదిలి వెళ్లిపోవడం బాధాకరం.



                                                                                                                                హనుమా

Updated Date - 2022-09-10T05:30:00+05:30 IST