కలపడమే కష్టం!

ABN , First Publish Date - 2022-12-07T23:00:00+05:30 IST

ప్రపంచంలోని తెలుగువారికి హాంగ్‌కాంగ్‌ అనగానే గుర్తుకువచ్చే పేరు.. జయ! ఇరవై ఏళ్ల కిందట ఒక సాధారణ వ్యక్తిగా వెళ్లి...

కలపడమే కష్టం!

ప్రపంచంలోని తెలుగువారికి హాంగ్‌కాంగ్‌ అనగానే గుర్తుకువచ్చే పేరు.. జయ! ఇరవై ఏళ్ల కిందట ఒక సాధారణ వ్యక్తిగా వెళ్లి... నేడు అక్కడి తెలుగు వారందరికీ పెద్ద దిక్కుగా మారిన అసాధారణ ప్రస్థానం ఆమెది. ‘హాంగ్‌కాంగ్‌ తెలుగు సమాఖ్య’ వ్యవస్థాపక అధ్యక్షురాలు జయ పీసపాటి తన అనుభవాలను ‘నవ్య’తో పంచుకున్నారు...

‘‘మావారు మర్చంట్‌ నేవీలో చేసేవారు. ఆరేడు నెలలు షిప్‌లపైనే ఉండేవారు. నేను ఒక్కదాన్నే ఉద్యోగం చేసుకొంటూ, బాబును చూసుకోవాల్సి వచ్చింది. చాలా కష్టమయ్యేది. పిల్లల చదువుల కోసమని మావారు ఆఫ్ షోర్ వదిలి షోర్ జాబ్ తీసుకున్నారు. బాంబేలోని షిప్పింగ్‌ కంపెనీలో ఆయనకు షిప్‌ సర్వేయర్‌ ఉద్యోగం వచ్చింది. అక్కడ రెండేళ్లు చేసిన తరువాత గోవా వెళ్లాం. ఆ సమయంలో ఆయన స్నేహితులు హాంకాంగ్‌లో ఖాళీ ఉంది... వస్తావా అని అడిగారు. అలా 2002లో అక్కడికి వెళ్లాం. ఇక ఆ తరువాత నుంచి నా జీవితం కొత్త మలుపు తీసుకుంది.

అలా మొదలైంది...

మేం అక్కడికి వెళ్లిన రెండో రోజే బాబు కిద పడ్డాడు. వాడిని హాస్పిటల్‌కు తీసుకువెళ్లాలి. అక్కడ నాకు ఏమీ తెలియదు. ఆయనేమో చైనా వెళ్లారు. ఇంట్లో టెలిఫోన్‌ లిస్ట్‌ ఉంది. అందులో మన దక్షిణ భారతీయుల పేర్లు చూసి ఒకావిడకు ఫోన్‌ చేశాను. ఆవిడ వచ్చి బాబుని, నన్ను ఆసుపత్రికి తీసుకువెళ్లి, చూపించి, మళ్లీ ఇంటి దగ్గర దింపారు. ఆ సంఘటన తరువాత ఇలా ఒంటరిగా ఉంటే కుదరదనుకున్నా. కానీ అప్పట్లో ఇంటర్నెట్‌ అంతగా లేదు. ఎలాగో తెలుగు అసోసియేషన్‌ ఏదైనా ఉందేమోనని వెతికాను. ఏమీ దొరకలేదు. అది మనసులో ఉండిపోయింది. ఆ క్రమంలోనే ‘తెలుగువాళ్లు ఎవరో ఉన్నారు. వన భోజనాలకు రమ్మంటున్నారు’ అని తెలుసుకుని వెళ్లాను. వెళితే అక్కడ... కేపీ రావు గారని ప్రొఫెసర్‌. ఆయన తెలుగు వాళ్లందరినీ ఏకం చేయడానికి కష్టపడుతున్నారు. మొబైల్స్‌ కూడా పెద్దగా లేని రోజులు. ఆయన ఎన్నో వ్యయప్రయాసలు పడి లెటర్లు రాసేవారు. ల్యాండ్‌లైన్‌ ఉంటే ఫోన్లు చేసేవారు. అది చూసి ఆయనకు సాయం చేద్దామని వాలంటీర్‌గా మారాను. తరువాత రావు గారు... "అమ్మా సాంకేతికపరంగా చెయ్యడానికి నాకు కష్టం, అది మీరు చూసుకోండి, మీరంతా యువతరం, నేను మీకు ఎప్పుడూ అండగా ఉండి సహకరిస్తాను" అన్నారు.. అలా మెల్లగా యాహూ మెసింజర్‌లో గ్రూప్‌ ఒకటి తయారు చేయడంతో అసోసియేషన్‌కు అంకురార్పణ జరిగింది.

ఇరవై ఏళ్లుగా...

అది ఆరంభం మాత్రమే! ఆ తరువాత అందరినీ ఒక వేదికపైకి తేవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎక్కడన్నా తెలుగు వాళ్లు కనిపిస్తే చాలు... వాళ్లని పట్టుకుని, తీసుకువచ్చి కార్యక్రమాల్లో భాగస్వాములను చేసేవాళ్లం. 2005లో ‘హాంగ్‌కాంగ్‌ తెలుగు సమాఖ్య’ రూపుదిద్దుకుంది. మొదట్లో 60 కుటుంబాల వారు పాలుపంచుకున్నారు. ఇప్పుడు ఆ సంఖ్య ఐదు వందలు దాటింది. అంతా వాట్సప్‌ గ్రూప్‌లో కనెక్ట్‌ అయ్యి ఉన్నారు. వాళ్లకు ఏదైనా అవసరం వస్తే మేం చేయగలిగింది చేస్తాం. మాది రిజిస్టర్డ్‌ అసోసియేషన్‌. తొలుత కార్పస్‌ ఫండ్‌ లాంటిదేమీ పెట్టుకోలేదు. అయితే మన తెలుగు అతను ఒకరు గుండెపోటుతో చనిపోయారు. తను బ్యాంక్‌ ఉద్యోగి. అప్పుడు అనిపించింది... కార్పస్‌ ఫండ్‌ ఉంటే అలాంటి వారికి సాయం చేయడానికి వీలవుతుందని! దాంతో 2013లో అసోసియేషన్‌ రిజిస్టర్‌ చేశాం. అయితే అక్కడ నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి. ఏదైనా ఆడిటోరియంలో సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించినప్పుడు లంచ్‌లు, డిన్నర్‌లు పెట్టుకోవడానికి వీల్లేదు. మనకు భోజనం చేస్తేనే ఆ వేడుక పూర్తయినట్టు కదా! అలాగే కీర్తనలు, భజనల లాంటివి చేయాలంటే అనుమతి తీసుకోవాలి.

కల్చరల్‌ ఫెస్ట్‌...

అక్కడ మన పండుగలన్నీ జరుపుతాం. క్రిస్మస్‌, న్యూ ఇయర్‌, సంక్రాంతి... మూడు పండుగలూ కలిపి ఏటా ‘తెలుగు కల్చరల్‌ ఫెస్ట్‌’ నిర్వహిస్తాం. అందులో పాల్గొనే పిల్లలు పాడే పాటైనా... మరే ప్రదర్శన అయినా తెలుగులోనే ఉండాలి. తద్వారా మాతృ భాషపై వారికి ఇష్టాన్ని పెంచే ప్రయత్నం. కార్తిక మాసంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు చేస్తాం. వీటి కోసం నిధులు మేమే సమకూర్చుకొంటాం. తెలుగు వాళ్లందరూ ఉద్యోగస్తులే. బ్యాంకింగ్‌, ఐటీ, ట్రేడింగ్‌ కంపెనీల్లో చేస్తున్నారు. ఎవరికీ వ్యాపారాలు లేవు. అయితే అధిక శాతం ఐదేళ్ల కంటే ఎక్కువ నివసించరు. కాస్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ విషయంలో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన దేశం హాంగ్‌కాంగ్‌. మనం సంపాదించుకున్నది అక్కడే సరిపోతుంది. ఫీజులు భారీగా ఉన్నా అందరూ తమ పిల్లల్ని ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌లో చదివిస్తారు. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలల్లో స్థానిక భాష తప్పనిసరి. అక్కడ బోర్డ్‌ ఎగ్జామ్‌ పాసవ్వడమంటే యూనివర్సిటీలో డిగ్రీ పొందినంత. సాధారణంగా హాంగ్‌కాంగ్‌వాళ్లు హైస్కూల్‌ అవ్వగానే ఉద్యోగాల్లో చేరిపోతారు. కర్మభూమికి కూడా రుణపడి ఉన్నాం కాబట్టి అక్కడున్న స్వచ్ఛంద సంస్థలకు కొంత సాయం చేస్తున్నాం.

అదే కష్టం...

హాంగ్‌కాంగ్‌లో తెలుగు వారందరినీ ఒకే వేదిక పైకి తేవడం చాలా కష్టం. ఎందుకంటే అక్కడ పని ఒత్తిడి అధికం. సాయంత్రం ఆరు అవ్వగానే వదిలేసి వెళ్లడానికి లేదు. దీంతో ఆసక్తి ఉన్నా కొంతమంది మా కార్యక్రమాలకు రాలేకపోతున్నారు. కొన్నిసార్లు వీకెండ్‌లో కూడా పని చేయాల్సి వస్తుంది. అయితే ఏ కాస్త సమయం దొరికినా వచ్చి వెళ్లమని అందరికీ ఫోన్లు చేసి మరీ అభ్యర్థిస్తుంటాం. ఐదు వందల మందిలో నూట యాభై రెండొందల మందిని రప్పించడం గగనమైపోతోంది. పెద్దవాళ్లు కూడా ఏమొస్తాంలే అంటుంటారు. ఇక్కడే కాదు... ఇండోనేషియా, బ్యాంక్‌కాక్‌... ఎక్కడైనా మన తెలుగువాళ్లు అంతే! మాతృ భాషపై మమకారం కూడా తక్కువే మనవాళ్లకు. వాళ్లు, వాళ్ల పిల్లలు కూడా ఇంగ్లీషులోనే మాట్లాడతారు. అదే చైనీస్, కొరియన్స్, జాపనీస్, మన దేశానికి చెందిన తమిళులు, మలయాళీలు తమ మాతృభాషలోనే మాట్లాడతారు! అందుకే నాకు శక్తి ఉన్నంత వరకు తెలుగు భాషను, తెలుగు సంస్కృతిని నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్నా. అయితే దాని కంటే ముందు మనం భారతీయులం కదా! కనుక అక్కడున్న భారతీయులందరినీ కలుపుకొనే ఉద్దేశంతో రేడియో జాకీగా ‘జై కిసాన్‌, ఇక్కడి భారతీయులని, స్థానికంగా నివసిస్తున్న ఇతర దేశీయులని కలిపే "అంతర్జాతీయ భాషా దినోత్సవం" వంటి కార్యక్రమాలు చేస్తుంటాను.

కలిసొచ్చిన ఆ కాలం...

కొవిడ్‌ నేపథ్యంలో మూడున్నరేళ్లు హాంగ్‌కాంగ్‌ నుంచి బయటకు రాలేకపోయాం. అయితే జూమ్‌ మీటింగ్స్‌ ద్వారా ప్రపంచంలోని తెలుగు వాళ్లందరినీ కలిసే అవకాశం లభించింది. ఇతర దేశాల్లోని తెలుగువారు, తెలుగు సంఘాలు ఎలా పని చేస్తున్నాయో, ఏ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో తెలుసుకోగలిగాను. అది మా సమాఖ్యను విజయవంతంగా నడిపించడానికి ఉపయోగపడింది. ప్రస్తుతం ‘తెలుగు కల్చరల్‌ ఫెస్ట్‌’కు సిద్ధమవుతున్నాం. తరువాత ఉగాది. ఈసారి అధ్యక్షులుగా కొత్తవారిని పెట్టి, వెనక ఉండి నడిపిద్దామని అనుకొంటున్నా. నేను హాంగ్‌కాంగ్‌లో ఉన్నా లేకపోయినా మా సమాఖ్య ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిరాటంకంగా సాగాలి. చైర్మన్‌గా కొనసాగుతూ ఉత్సాహవంతులను ప్రోత్సహించాలనే ఆలోచన నాది. అంతేకాకుండా మా పిల్లల చదువులు, మావారి రిటైర్మెంట్‌ తరువాత ఇక్కడే స్థిరపడాలని అనుకొంటున్నా.

ఏదేమైనా హాంగ్‌కాంగ్‌లో కూడా తెలుగువాళ్లం ఉన్నామని చెప్పే ప్రయత్నంలో కొంతవరకు విజయం సాధించాననే చెప్పవచ్చు. ఇప్పుడు ప్రపంచంలో ఎవరికైనా సరే హాంకాంగ్‌లో తెలుగువారనగానే జయ పేరే గుర్తుకు వస్తుంది. అది చాలు నాకు!’’

దూరం పెడతారు

విచిత్రమేమంటే హాంగ్‌కాంగ్‌లో ఇప్పటికీ జాతి వివక్ష కనిపిస్తుంది. ముఖ్యంగా భారతీయులంటే వారికి అస్సలు నచ్చరు. మనలాగే వాళ్లకు కూడా కుటుంబ వ్యవస్థ, విలువలు ఉన్నాయి. మనలానే పండుగలూ ఉన్నాయి. పితృ తర్పణాలూ వదులుతారు. అన్నిటిలో సారూప్యత ఉంటుంది.కానీ మనం బస్సు ఎక్కితే... పక్కన కూర్చోరు. ఎక్కడికో దూరంగా వెళ్లిపోతారు. మెట్రోలోనూ అంతే! మనమే కాదు... చైనీయులూ నచ్చరు. వాళ్ల ఉద్యోగాలన్నీ మనం తీసేసుకున్నామనే అక్రోశం వాళ్లలో. అయితే వారిలో ఉద్యోగస్తులు కొంత పర్లేదు. చదివేది కూడా హైస్కూల్‌ వరకే కదా! వారికి మంచి ఉద్యోగాలు రావు. యూనివర్సిటీల్లో చదువుకున్నవారు అసలు హాంగ్‌కాంగ్‌కు రారు. వర్ణ వివక్ష కూడా అధికం. అక్కడివారు చెప్పుకొనేదేంటంటే... ‘ఏ రంగు వాళ్ల పక్కన కూర్చొంటే ఆ రంగు వారి గుణాలు వస్తాయ’ని! అందుకే భారతీయుల పక్కన కూర్చోరు. కొంతమంది అద్దెకు ఇళ్లు కూడా ఇవ్వరు. విశేషమేమంటే... శని, ఆదివారాలు, సెలవులు వస్తే మన ఇండియన్‌ రెస్టారెంట్లు అన్నీ రద్దీగా ఉంటాయి... వాళ్లతో! హాంగ్‌కాంగ్‌ వాసులకు మన కూరలు అంత ఇష్టం.

సివిఎల్‌ఎన్‌ ప్రసాద్‌

Updated Date - 2022-12-08T09:33:04+05:30 IST