జార్జి మిత్రుడు.. పేదల వైద్యుడు

ABN , First Publish Date - 2022-06-26T17:35:21+05:30 IST

యువతరానికి ‘జీనా హైతో మర్‌నా సీఖో’ (బతకాలంటే చావడం నేర్చుకో) మాటల వీలునామాను రాసిచ్చిన జార్జిరెడ్డికి స్నేహితుడు

జార్జి మిత్రుడు.. పేదల వైద్యుడు

యువతరానికి ‘జీనా హైతో మర్‌నా సీఖో’ (బతకాలంటే చావడం నేర్చుకో) మాటల వీలునామాను రాసిచ్చిన జార్జిరెడ్డికి స్నేహితుడు ఆయన. జార్జి దూరమైన యాభై ఏళ్ల తర్వాత కూడా అతని ఆలోచనల నీడలో సేదతీరుతున్నారు. క్యాన్సర్‌ మహమ్మారి తన ఒంట్లోని సత్తువను ఒకవైపు మింగేస్తున్నా, కరోనా కష్టకాలంలో సుమారు రెండు వేలమంది రోగులకు ఉచితంగా ఆన్‌లైన్‌ వైద్యం అందించారు. ఆయనే జార్జి ఉద్యమ సహచరుడు డా.భాగిరెడ్డి ప్రతాపరెడ్డి.. 


కరోనా భయానికి దేశమంతా తలుపులు మూసుకున్న సమయంలోనే ప్రతాపరెడ్డికి పేద్దపేగు క్యాన్సర్‌ బయటపడింది. అంతకు ఏడాది కిందట ఆయన భార్య డా.శోభ క్యాన్సర్‌తోనే కన్నుమూయడం విషాదం. కడుపులో రాచపుండు ఒకవైపు, ఇంట్లో ఒంటరితనం మరోవైపు... ఇవన్నీ ప్రతాప్‌ హృదయాన్ని మెలిపెట్టాయి. క్యాన్సర్‌కు విరుగుడు కీమో చికిత్స తీసుకోవచ్చు. మరి ఒంటరితనానికి.! అప్పుడే తన మనసు లోతుల్లోని జ్ఞాపకాల ఆల్బమ్‌ను బయటకు తీశారు. యాభై ఏళ్ల కిందట తన ప్రాణమిత్రుడు జార్జిరెడ్డితో తనకున్న ఆత్మీయ స్మృతులు కళ్లముందు మెదలడంతో కుంగుబాటు క్షణ భంగురమైంది. దటీజ్‌ జార్జిరెడ్డి.! కష్టకాలంలో ఒక జనరల్‌ ఫిజీషియన్‌గా రోగులకు తన అవసరం మరింత ఉందని గుర్తించారు. ఆన్‌లైన్‌ ద్వారా రెండువేల మందికి ప్రతాపరెడ్డి ఉచితంగా వైద్యం అందించారు. ‘‘ఒక్కోరోగి తన బాధలు చెబుతుంటే, అయ్యో భగవంతుడా.! గడప దాడకుండా నన్ను కట్టేశావే అనుకొని నాలో నేనే కుమిలిపోయిన రోజులున్నాయి. కొందరికి మరీ సీరియస్‌ అయితే, ఆస్పత్రుల్లో బెడ్‌ సమకూర్చడం దగ్గర నుంచి వారు తిరిగి డిశ్చార్జి అయ్యేవరకు పర్యవేక్షించిన సందర్భాలున్నాయి. అవతలివాళ్ల దుఃఖం పంచుకున్నప్పుడు మన బాధ ఇట్టే పోతుందనడానికి ఈ అనుభవమే ఉదాహరణ’’ అంటారు డా.ప్రతాపరెడ్డి. 


అతి తక్కువ ఫీజుతో.. 

కూకట్‌పల్లి వాసులకు ఐదు రూపాయల వైద్యుడిగా ప్రతాపరెడ్డి సుపరిచితుడు. అక్కడే 1974లో పీపుల్స్‌ ఆస్పత్రి నెలకొల్పి రూ.2 ఓపీతో చాలాకాలం వైద్యం చేశారు. ఆ తర్వాత కొన్నేళ్ల వరకు ఫీజు రూ.5 ఉండేది. ‘‘జనరల్‌ ఫిజీషియన్‌గా నేను, గైనకాలజిస్టుగా నా భార్య... ఇద్దరం కలిసి ప్రాక్టీసు మొదలుపెట్టాం. అత్యంత తక్కువ ఫీజుతో వైద్యసేవలు అందించడం మా క్లినిక్‌ పాలసీ. కాన్పుకు వందరూపాయలు. సిజేరియన్‌తో పాటు మిగతా సర్జరీలకు రూ.వెయ్యిలోపే తీసుకునేవాళ్లం. అదీ ఇవ్వగలిగితేనే.!’’ అని ఆయన వివరిస్తున్నారు. ‘జార్జికూడా తనను ఇలానే ఒక ప్రజా వైద్యుడిగా చూడాలనుకున్నాడని’ ప్రతాపరెడ్డి తలుచుకున్నారు. 


బాక్సింగ్‌ రింగ్‌ వద్ద పరిచయం...

స్నేహితుడి మరణం తర్వాత కూడా అతని ఆలోచనలకు అనుగుణంగా జీవించడమే ఆ మైత్రికి అసలైన అర్థం. అదే ఆదర్శనీయం కూడా. జార్జి, ప్రతాప్‌లదీ సరిగ్గా అలాంటి చెలిమే.! నిజాం కాలేజీలోని బాక్సింగ్‌ రింగ్‌ వద్ద 1965లో ఒకరికొకరు తారసపడితే, క్రీడాసక్తి ఇద్దరినీ స్నేహితులుగా మలిచింది. సమసమాజ ఆలోచనలు ఆ మైత్రిని మరింత దృఢపరిచాయి. ‘‘నిజాం కాలేజీలో నేను పీయూసీలో ఉండగా జార్జి బీఎస్సీ రెండవ సంవత్సరం చదువుతున్నాడు. అప్పుడే ఒకరికొకరం పరిచయం. జార్జి నెలకొల్పిన ‘ప్రొగ్రెస్సివ్‌ డెమోక్రటిక్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌’ (పీడీఎస్‌యూ) నిర్మాతల్లో నేనూ ఒకడిని. ఒక వెయ్యిమంది ప్రజావైద్యులను, మరొక వెయ్యిమంది ప్రజా ఇంజినీర్లను తయారుచేయాలి. తద్వారా ఒక మేధోపరమైన ప్రత్యామ్నాయ వేదికను నిర్మించాలనేది మా ఆశయం. జార్జి మరణంతో ఆ ఆలోచన ఆగిపోయింది. కానీ ఆయన ఆశయాలను మాత్రం కూర రాజన్న, జంపాల చంద్రశేఖర ప్రసాద్‌ కొనసాగించారు. నేను ఆ విలువలను నా వృత్తి జీవితంలో కొనసాగించేందుకు ప్రయత్నించాను’’ అంటారు ప్రతాపరెడ్డి.


జార్జి జ్ఞాపకాలు...

విద్యార్థి ఉద్యమంలో జార్జివెన్నంటే నడిచిన ప్రతాప్‌ కొన్ని స్మృతులను పంచుకుంటున్నారు. ‘‘జార్జి జీవితంలో ప్రేమకథలు లేవు. ప్రేమికురాలు అసలే లేదు. తాను ఎమ్మెస్సీ చదువుతుండగా పీహెచ్‌డీ విద్యార్థులకు తరగతులు తీసుకునేవాడు. ఇవాళ జార్జి బతికుంటే, భౌతికశాస్త్రంలో నోబెల్‌ బహుమతి గ్రహీతగా నిలిచేవాడు. గాంఽధీ మెడికల్‌ కాలేజీ మొదలు, అన్ని విద్యాలయాల్లో ప్రగతిశీల విద్యార్థి సంఘం గెలవడాన్ని ఏబీవీపీ సహించలేకపోయింది. అక్కడి నుంచి దాడుల పరంపర మొదలైంది. జార్జికూడా ప్రమాదమని తెలిసినా, అతివిశ్వాసంతో ఆ వేళ ఒంటరిగా వెళ్లాడు. దేశానికి దిక్సూచిగా నిలవాల్సిన నేత మతతత్వ శక్తులకు బలయ్యాడు. కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీల్లోనేకాదు...ఆనాటి జనసంఘ్‌లోనూ జార్జి ప్రతిభకు అభిమానులున్నారు. అయితే, ఆయన ఏ రాజకీయ పార్టీతోనూ అనుబంధంగా లేడు. సాయుధ పంథాతోనే సోషలిజం సాధ్యమని జార్జి భావించాడు. కానీ ఆ మార్గంలో అప్పటికే పనిచేస్తున్న వాళ్లతోనూ తాను కలిసి నడవలేదు. జార్జి... ఒక మార్క్సిస్టు తత్వవేత్త. ఈ సంక్షుభిత సమయంలో ఆయన లేనిలోటు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది’’ అని కన్నీళ్ల పర్యంతమయ్యారు డా.ప్రతాపరెడ్డి.

- సాంత్వన్‌, ఫొటోలు: అశోకుడు


Updated Date - 2022-06-26T17:35:21+05:30 IST