5 జిలో మన కల్యాణి

ABN , First Publish Date - 2022-01-12T05:30:00+05:30 IST

నెట్‌వర్క్‌ టెక్నాలజీ రంగంలో మహిళల సంఖ్య తక్కువ. ఆ రంగాన్ని ఎంచుకోవడమే కాకుండా, దాన్లో రాణించి, 5జి టెక్నాలజీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు ..

5 జిలో మన కల్యాణి

నెట్‌వర్క్‌ టెక్నాలజీ రంగంలో మహిళల సంఖ్య తక్కువ. ఆ రంగాన్ని ఎంచుకోవడమే కాకుండా, దాన్లో రాణించి, 5జి టెక్నాలజీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు డాక్టర్‌ కల్యాణి బోగినేని. 5జి టెక్నాలజీని ప్రపంచానికి పరిచయం చేసిన వెరైజన్‌ కంపెనీలో 18 ఏళ్లుగా ఆర్కిటెక్ట్‌గా సేవలందిస్తున్న ఆవిడ, 2021 సంవత్సరానికిగాను వెరైజన్‌ మాస్టర్‌ ఇన్వెంటర్‌ అవార్డునూ అందుకున్నారు. ఈ సందర్భంగా అమెరికాలో ఉన్న కల్యాణితో నవ్య ఫోన్లో ముచ్చటించింది. ఆ విశేషాలు...


హోదా పెరిగేకొద్దీ బాధ్యతలూ, సవాళ్లూ పెరుగుతాయి. వాటిని చూసి బెంబేలు పడిపోతే ఎదుగుదల అక్కడే ఆగిపోతుంది. అటు వృత్తినీ, ఇటు కుటుంబాన్నీ సమంగా నడిపిస్తూ, చాకచక్యంగా నెగ్గుకురావడం ముఖ్యం. ప్రణాళికాబద్ధంగా నడుచుకునే స్వభావం ఉండబట్టే, ఎంతటి బాధ్యతాయుతమైన వృత్థిలో ఉన్నా ఎప్పుడూ పని ఒత్తిడికి లోను కాలేదు. పైగా ఏ పని చేపట్టినా దాన్లో విజయం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగే తత్వం నాది. చదువులో అలాగే రాణించాను. వృత్తిలోనూ అదే పంథా అనుసరించాను. అయితే వెరైజన్‌ కంపెనీ మేనేజర్ల గుర్తింపు పొందడంలో నాకు తోడ్పడింది ప్రధానంగా నా కమ్యూనికేషనే! ప్రాజెక్టును వివరించేటప్పుడు, అమలు చేసేటప్పుడు ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా వివరించగలిగితే మన పని తేలికవుతుంది. నాకు అలాంటి కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ ఉన్నాయి కాబట్టే ఈ స్థాయికి ఎదగగలిగాను. మహిళలు వృత్తిలో నాయకత్వ స్థాయికి ఎదగాలంటే, మెరుగ్గా కమ్యూనికేట్‌ చేయడం, సమస్యను అర్థం చేసుకుని వివరించడం, బృందాన్ని ఏర్పాటు చేసుకుని ముందుండి నడిపించడం... ఇలా మూడు ప్రధానమైన గుణాలు కలిగి ఉండాలి. 


నా బాధ్యతలు ఇవే...

అన్ని వృత్తుల్లోనూ ఇబ్బందులు ఎదురైనట్టే నా వృత్తిలోనూ ఎదురవుతూ ఉంటాయి. నెట్‌వర్క్‌లో సమస్య తలెత్తినప్పుడు ఎక్కువ గంటలు పని చేయవలసిన అవసరం పడుతూ ఉంటుంది. ఇలాంటి అత్యవసర పరిస్థితిలో అమలు చేయడం కోసం నా దగ్గర ఒక బ్యాకప్‌ ప్లాన్‌ ఉంటూనే ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొత్త సాంకేతికతలను పరిశీలిస్తూ, వాటితో ఒరిగే ప్రయోజనాలను విశ్లేషించి, నెట్‌వర్క్‌కు తగ్గట్టుగా మార్చడం వెరైజన్‌ కంపెనీలో ఆర్కిటెక్ట్‌గా నా పని. కొన్ని సాంకేతికతలు మరో ఐదేళ్ల వరకూ అమలుకు వీలుగా ఉండవు. అయితే మరో రెండు మూడేళ్లలో అమలు చేయడానికి వీలుగా ఉన్న టెక్నాలజీలూ ఉన్నాయి. అలా కొత్తగా అందుబాటులోకొస్తున్న డేటా అనాలసిస్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌లతో ఆటొమేషన్‌ చేయవచ్చు. మనుషులకు బదులుగా వీటిని ఉపయోగించుకోవచ్చు. ఇలాంటి టెక్నాలజీని వాడుకోవడం ద్వారా సమాజానికి ఒరిగే ప్రయోజనాలకు సంబంధించిన అంచనాలను తయారుచేస్తూ ఉంటాను. వర్యువలైజేషన్‌, సాఫ్ట్‌వేర్‌ ఆధారిత నెట్‌వర్కింగ్‌, కృత్రిమ మేథస్సు, ఆటొమేషన్‌ విభాగాలతో కలిసి పని చేస్తూ ఉంటాను.  


టెక్నాలజీ పాత్ర కీలకం

కొవిడ్‌తో ఇళ్ల నుంచే పని చేసే కొత్త జీవన విధానం పెరిగింది. దాంతో కంప్యూటర్‌ సర్వర్ల సంఖ్యను పెంచవలసిన అవసరం పడింది. దాంతో కొవిడ్‌ కాలంలో నా పని రెట్టింపయింది. ముందు నుంచే ఆ టెక్నాలజీ ఉన్నప్పటికీ, దాన్ని అత్యంత వేగంగా అందరూ వాడుకోవడానికి తగ్గట్టుగా మార్చడం కోసం పని చేయవలసిన అవసరం పడింది. ఇలా టెక్నాలజీ అవసరం పడే సందర్భాలు హఠాత్తుగా చోటుచేసుకుంటూ ఉంటాయి. హరికేన్లు వచ్చినప్పుడు, భూకంపాలు సంభవించినప్పుడు కూడా సాంకేతికత పాత్ర కీలకంగా మారుతుంది. ప్రపంచీకరణలో భాగంగా అన్ని చోట్లా టెక్నాలజీలు ఇంచుమించు ఒకే రకంగా ఉంటున్నాయి. ఉదాహరణకు వైర్‌లెస్‌ 3జి, 4జి, 5జిలను తీసుకుంటే ప్రపంచవ్యాప్తంగా అందరూ అవే నెట్‌వర్క్‌లను వాడుతున్నారు. అయితే ఆ సేవలను అమలు చేయడంలోనే తేడాలు ఉంటూ ఉంటాయి. 


అభ్యాసం ఆగిపోకూడదు

డిగ్రీ అయిపోగానే ఉద్యోగం వచ్చేస్తే, దాన్లోనే ఏళ్ల తరబడి స్థిరపడిపోకూడదు. టెక్నాలజీ ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతోంది. కాబట్టి ఆ వేగాన్ని అందుకోవడం కోసం నిరంతరంగా నేర్చుకుంటూ ఉండాలి. చదవడం కొనసాగిస్తూనే ఉండాలి. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా రెండు విధాలా వృద్ధి చెందుతూ ఉండాలి. ఈ క్రమంలో తల్లితండ్రులు, స్నేహితులు, జీవిత భాగస్వాముల సహాయం తీసుకోవడం అవసరం.’’ 

  

నేను పుట్టింది విజయవాడలో. మా వారు చెంచు రామానాయుడు బోగినేని. మేమిద్దరం 1988లో పిహెచ్‌డి చేయడం కోసం అమెరికా వచ్చి ఇక్కడే స్థిరపడిపోయాం. ఆయన కూడా ఇంజనీరింగ్‌ రంగంలోనే ఉన్నారు. మా బాబు పి.జి ముగించి, ఉద్యోగంలో స్థిరపడ్డాడు.


                                                                                                    గోగుమళ్ల కవిత

Updated Date - 2022-01-12T05:30:00+05:30 IST