సాహసమే ఆమె ఊపిరి

ABN , First Publish Date - 2022-03-23T05:30:00+05:30 IST

పులులకు ఆవాసం... మదపుటేనుగుల సంచారం... ఉత్తరాల బట్వాడా కోసం పెను సాహసమే చేస్తున్నారు ఈ పోస్ట్‌ మాస్టర్‌. రోజూ కిలో మీటర్ల కొద్దీ....

సాహసమే ఆమె ఊపిరి

పులులకు ఆవాసం... మదపుటేనుగుల సంచారం... ఉత్తరాల బట్వాడా కోసం పెను సాహసమే చేస్తున్నారు ఈ పోస్ట్‌ మాస్టర్‌. రోజూ కిలో మీటర్ల కొద్దీ కాలి బాటన ప్రయాణిస్తూ... వన్యప్రాణులను దాటుకొంటూ... చిట్టడవిలో విధులు నిర్వర్తిస్తున్నారు. 


ఫాతిమా రాణి... తమిళనాడు ‘కలక్కాడ్‌ ముందంతురయ్‌ టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌’ లోపల ఉన్న కొడయార్‌ మెల్తంగల్‌ బ్రాంచ్‌ పోస్ట్‌మాస్టర్‌. కొడయార్‌ డ్యామ్‌కు సమీపంలో... సముద్ర మట్టానికి 1,200 మీటర్ల ఎత్తులో ఉందీ కార్యాలయం. ఆ ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న అటవీ, విద్యుత్‌, పోలీస్‌ శాఖల ఉద్యోగులకు బయటి ప్రపంచంతో ఏదైనా సంబంధం ఉందంటే అది ఫాతిమా ద్వారా మాత్రమే. మొబైల్‌ నెట్‌వర్క్‌ కూడా లేని ప్రాంతం అది. కొండలు ఎక్కుతూ... దిగుతూ... ముళ్లు, రాళ్లు ఉన్న కాలి బాటలో రోజూ పది కిలోమీటర్లు నడుస్తారు ఆమె. అదికూడా పులులు, ఏనుగులు, అడవి దున్నలు, పందులు, కొండచిలువలను దాటుకొంటూ! హఠాత్తుగా కురిసే వర్షాలు, అప్పుడప్పుడు ఈదురు గాలులు ఆమె ప్రయాణాన్ని మరింత జటిలం చేస్తాయి. నిత్యం ప్రాణసంకటమే అయినా... విధినిర్వహణలో ఏనాడూ వెనకడుగు వేయలేదు ఫాతిమా. 


కనిపెట్టడం కష్టం...  

పాతికేళ్ల తన ఉద్యోగ ప్రస్థానంలో వెన్నులో వణుకు పుట్టించే ఘట్టాలెన్నో. చిరుత ఎదురొచ్చి నిల్చున్నా... విష సర్పాలు దారికి అడ్డంగా పడుకున్నా... ఆమె గుండె ధైర్యం ముందు అవి తోక ముడుచుకొంటాయి. ‘‘ఈ అడవిలో తరచూ వర్షాలు కురుస్తుంటాయి. ఆ సమయంలో చుట్టూ పరిసరాలు స్పష్టంగా కనిపించవు. దీంతో పొదల మాటున, చెట్ల చాటున ఉన్న జంతువులను గుర్తించలేం. వన్యమృగాలు ఎదురుపడినప్పుడు ఎలా తప్పించుకోవాలో, వాటి సంచారాన్ని ఎలా పసిగట్టాలో అటవీ శాఖ అధికారులు సూచనలు చేస్తుంటారు. ఆపత్కాలంలో కొంతవరకు అవి ఉపయోగపడుతుంటాయి. అయితే ఒక్కోసారి జంతువులు మనవైపు దూసుకువస్తుంటాయి. కంగారు పడితే ప్రాణాలకే ముప్పు’’ అంటారు ఫాతిమా. 


దాటుకొంటూ... దాక్కొంటూ... 

‘‘కొండ ప్రాంతం. ఏటవాలుగా ఉండే ఇరుకైన రోడ్లు. ఆ దారిలో నడవడమే కష్టం. ఒక వైపు లోయ... మరో వైపు కొండ. అడవి జంతువులు ఏవైనా తారసపడితే పక్కలకు పరుగెత్తే అవకాశం కూడా లేదు. కానీ వాటి నుంచి మనల్ని మనం రక్షించుకోవాలి. క్షణక్షణం అప్రమత్తంగా ఉండాలి. ఏ కాస్త ఏమరపాటుగా ఉన్నా మరుసటి రోజు సూర్యోదయం చూడం. అందుకే చాలా సందర్భాల్లో అవి నన్ను దాటిపోయే వరకు వేచి ఉంటాను. లేదంటే నిశ్శబ్దంగా నేనే వాటి పక్క నుంచి వెళ్లిపోతాను.


ఒకసారి పెద్ద పాము దారికి అడ్డంగా పడుకుని ఉంది. ఎంతసేపయినా కదలడంలేదు. ధైర్యం చేశాను. చప్పుడు కాకుండా నిదానంగా దాన్ని దాటి వెళ్లాను. మరోసారి పులి పిల్ల ఎదురొచ్చింది. ఆ పిల్లను వెతుక్కొంటూ పెద్ద పులి వస్తోంది. నేను వెంటనే పక్కనే ఉన్న చెట్టు చాటుకు వెళ్లి దాక్కున్నాను. అరగంటకు గానీ అవి అక్కడి నుంచి వెళ్లలేదు. అప్పటి వరకు ఓపిగ్గా చెట్టు చాటున ఉన్నా’’ అంటూ చెప్పుకొచ్చారు ఫాతిమా. 


భయపడినా... 

‘‘దాదాపు పాతికేళ్ల కిందట ఈ ఉద్యోగం చేపట్టాను. అడవి ప్రాంతంలో ఒంటరిగా నడిచి వెళ్లాలంటే మొదట్లో భయమేసేది. అందుకే కొన్ని రోజులు మా వారు నాకు తోడుగా వచ్చేవారు. తరువాత తరువాత నాకే అనిపించింది... ‘ఇలా ఎంత కాలం? ఒక్క రోజు సమస్య కాదు ఇది. ఉద్యోగంలో ఉన్నంత కాలం ఈ ప్రయాణం తప్పదు. ఎంతకాలం ఒకరిపై ఆధారపడాలి! ఇది నా సమస్య. కనుక పరిష్కారం కూడా నేనే కనుక్కోవాలి’ అనుకున్నాను. నాకు నేను ధైర్యం చెప్పుకున్నాను. ఎవరి తోడూ లేకుండా ఒక్కదాన్నే విధులకు వెళ్లడం ఆరంభించాను’’... నాటి రోజులు గుర్తు చేసుకున్నారు ఈ పోస్ట్‌మాస్టర్‌. 


ఎందులోనూ తక్కువ కాదు... 

మహిళలు ఏ రంగంలోనైనా రాణించగలరని, ఎలాంటి కఠిన పరిస్థితుల్లోనైనా ఎదిరించి నిలబడగలరనడానికి ఫాతిమానే ప్రత్యక్ష సాక్ష్యం... ఇది ఆమె పై అధికారుల మాట. ఈ ఉద్యోగంలో చేరడానికి ముందు ఫాతిమా నాలుగేళ్లు తేయాకు ఫ్యాక్టరీలో పనిచేశారు. తోటలో తేయాకు కోశారు. ఆమె జీవితంలో ఎన్నో ఆటుపోట్లు. వాటన్నిటినీ అధిగమించి తన 33 ఏళ్ల వయసులో ప్రస్తుత బ్రాంచ్‌కి పోస్ట్‌మాస్టర్‌గా నియమితులయ్యారు. ‘పట్టుదల, తమపై తమకు నమ్మకం ఉంటే మహిళలు ఎంతటి కార్యాన్నయినా సాధించగలరు’ అంటారు ఫాతిమా.


ఒక వైపు లోయ... మరో వైపు కొండ. అడవి జంతువులు ఏవైనా తారసపడితే పక్కలకు పరుగెత్తే అవకాశం కూడా లేదు. కానీ వాటి నుంచి మనల్ని మనం రక్షించుకోవాలి. క్షణక్షణం అప్రమత్తంగా ఉండాలి. ఏ కాస్త ఏమరపాటుగా ఉన్నా మరుసటి రోజు సూర్యోదయం చూడం.

Read more