Gender Equality: అమ్మాయి తక్కువ.. అబ్బాయి ఎక్కువ అనే భావన పోవాలంటే తల్లిదండ్రులు చేయాల్సిన పనులివే..!

ABN , First Publish Date - 2022-07-19T19:46:39+05:30 IST

ఆడపిల్ల పుడితే ఆమెకు పెళ్ళి, పిల్లలు ఇలా చాలా బాధ్యతలు ఉంటాయని, ఓ ఇంటికి పంపే వరకూ చాలా కేర్ తో చూసుకోవలసి ఉంటుందనే ధోరణి కూడా చాలా మంది తల్లిదండ్రుల్లో ఉంది.

Gender Equality: అమ్మాయి తక్కువ.. అబ్బాయి ఎక్కువ అనే భావన పోవాలంటే తల్లిదండ్రులు చేయాల్సిన పనులివే..!

మగపిల్లవాడు పుట్టగానే వంశోద్ధారకుడు పుట్టాడని తెగ సంబరపడిపోయే కుటుంబాలు అదే ఆడపిల్ల పుట్టిందనే సరికి ఒకింత ఢీలా పడిపోతారు. ఇలా ఎందుకు ఆలోచిస్తున్నామనేది చూస్తే.. పూర్వపు రోజుల్లో ఆడవారికి పరిమితులు విధించి వారు ఈ పనులు మాత్రమే చేయగలరనే ఆలోచనలు ఉండేవి. అదే మగపిల్లవాడి విషయానికి వచ్చే సరికి కుటుంబాన్ని పోషిస్తాడని.. బాధ్యతలను పంచుకుంటాడని ఆలోచించేవారు. అదే ధోరణి ఇప్పటికీ చాలా చోట్ల చూస్తున్నాం. ఆడపిల్ల పుడితే ఆమెకు పెళ్ళి, పిల్లలు ఇలా చాలా బాధ్యతలు ఉంటాయని, ఓ ఇంటికి పంపే వరకూ చాలా కేర్ తీసుకోవలసి ఉంటుందనే ధోరణి కూడా చాలా మంది తల్లిదండ్రుల్లో ఉంది. ఆస్తి పంపకాల విషయంలోనూ, నచ్చిన చదువును చదివించడానికి మగపిల్లాడికి ఉన్న ప్రాధాన్యత ఆడపిల్లకి తక్కువే. 


ఈ ధోరణి మారాలంటే అసలు ఏం చేయాలనే కోణాన్ని తీసుకుంటే చిన్నతనం నుండి పిల్లలకు స్త్రీ, పురుష సమానత్వం గురించి తల్లిదండ్రులు చెబుతూ ఉండటం వల్ల పెరిగేకొద్దీ పిల్లలు లింగవివక్షత అనే పదానికి దూరంగా ఉంటారు. 


కుటుంబమే ఉదాహరణ కావాలి.

సమానత్వం అనే విషయం గురించి మాటల్లో చెబితే అర్థం కాకపోవచ్చు, పాటించకపోవచ్చు. అందుకే ఇంట్లో తల్లిదండ్రులు సమానత్వం అనే విషయాన్ని అనుసరిస్తూ పిల్లల్ని ప్రేరేపించాలి. ఆడ పిల్ల మగ పిల్లవాడనే తేడా చూపకుండా ఇద్దరినీ సమానంగా చూసినప్పుడు వారిలో లింగవివక్షత అనే భావనే కలగదు. 


ప్రతి పనిలోనూ భాగం చెయ్యాలి!

ఆడపిల్ల చేసే పనులు, మగ పిల్లాడు చేసే పనులు అంటూ విభజించి పనులు అప్పగించకూడదు. పనులతోనే స్త్రీ, పురుషులను వేరు చేయడం మొదలవుతుంది కాబట్టి మొదట దాన్ని దూరం చెయ్యాలి. ఇంటిపని, వంటపని, బయట పనుల్లోనూ ఇద్దరు పిల్లల్ని భాగస్వామ్యం చేయాలి. ఇద్దరినీ ప్రతి పనిలోనూ భాగస్వామ్యం చేసి ప్రోత్సహించే బాధ్యత పేరెంట్స్ మీద మాత్రమే ఉంటుంది. 


కథలు చెప్పండి.

మంచి కథలను ఎంచుకుని పిల్లలకి ఆసక్తి కలిగించేలా చెప్పాలి. అందులో ఎంచుకునే కథాంశం కూడా లింగవివక్షత, ధీరవనితల గురించి మగపిల్లలుకు కథలు అల్లి చెప్పడం వల్ల పిల్లలకు సరదాగా ఉంటుంది. అవి భవిష్యత్ లో వారికి ఆడవారిపట్ల గౌరవంతో మెలిగేలా చేస్తాయి. అందుకే కథలతో పిల్లలను ఆలోచింపజేయాలి. 


చిన్నపాటి చర్చలు చేయండి. 

పిల్లలతో చిన్న చర్చలు చేయాలి.  దేశంలో జరుగుతున్న పరిస్థితుల గురించి, వాటి కారణాలు, పరిష్కారాల గురించి ఆ చిన్ని మెదళ్లు ఏం చేపుతాయనేది విని కాస్త చర్చించాలి. చుట్టూ జరుగుతున్న విషయాల గురించి మాట్లాడాలి. ఇది వారికి ప్రతి విషయాన్ని గమనించే శక్తిని ఇస్తుంది. 


గౌరవించడం నేర్పాలి!

ప్రతి ఒక్కరినీ గౌరవించాలని పిల్లలకు చెప్పాలి. ఇంట్లో పెద్దవారి పట్ల ఎలా మసులుకోవాలో వారికి నేర్పించాలి. ఏదైనా నేర్పేముందు, చెప్పేముందు మనం ఆచరిస్తే దానినే సులువుగా పిల్లలు ఫాలో అవుతారు. 


పంచుకోవడం నేర్పాలి!

ఏ వస్తువు కొన్నా మొదటగా ఆడపిల్లకు పంచాకే మగవారికి ఇచ్చే అలవాటు చేయాలి. ఇలా చేయడం వల్ల మగపిల్లాడికి ఆడపిల్ల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ ఇంట్లో చూపుతున్నారని అర్థం అవుతుంది. ఇక నుంచి తను కూడా అలా చూసేందుకు అలవాటు పడతాడు. ఎక్కువ తక్కువ లేకుండా అన్నిటినీ ఆడపిల్లలు, మగపిల్లలు సమానంగా పంచుకునే అలవాటు అలవడుతుంది. 


1.  ఎదుటివ్యక్తులు ఏ జెండర్ వారు అయినా వాళ్ళను ఏ విషయంలోనూ ఎప్పుడూ జడ్జ్ చేయకూడదనే విషయం పిల్లలకు చెప్పాలి. సమానత్వం అనేది పిల్లల ఆలోచనలను నిలకడగా ఉండేలా చేస్తుంది. అందుకే అన్ని విషయాలలో సమానత్వాన్ని ప్రోత్సహించండి.


2. ఇంట్లో భార్యాభర్తలు ఎక్కువ తక్కువ అనే విషయాన్ని వదిలెయ్యాలి. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగస్తులు అయినా కాకపోయినా ఎవరిపని వాళ్ళు బాధ్యతగా చేస్తుంటారు కాబట్టి ఒకరికి ఒకరు గౌరవం ఇచ్చుకుంటే పిల్లలకు అదే అలవాటు అవుతుంది.


3. ఎదుటివారి ఎమోషన్స్ ను, వారి పరిస్థితులను అర్థం చేసుకోవాలి. దానివల్ల ఎదుటి వ్యక్తులకు గౌరవం ఇచ్చినట్టు అవుతుంది. తల్లిదండ్రులు పిల్లలు ఏ జెండర్ అయినా సొంత నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఇవ్వాలి. అవసరమైతే సలహాలు సూచనలు ఇవ్వచ్చు.


4. తప్పు చేసినా, తప్పుగా ప్రవర్తించినా, ఏదైనా సమస్యలో చిక్కుకున్నా దాన్ని బయటకు చెప్పి ఒప్పుకునే మనస్తత్వాన్ని పెంచాలి. దీనివల్ల భవిష్యత్తులో అన్నిటినీ అంగీకరించే మానసిక సామర్థ్యము పెరుగుతుంది.


పైన చెప్పుకున్నట్టు పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఇంటి నుండే నేర్పించాల్సిన విషయాలు. ఈ పద్దతిని అందరూ పాటిస్తే సమాజంలో లింగ వివక్షత అనే పెద్ద విషయాన్ని పరిష్కరించి లింగసమానత్వాన్ని సాధించవచ్చు.

Updated Date - 2022-07-19T19:46:39+05:30 IST