ధర్మవిజయ పర్వం.. దసరా

ABN , First Publish Date - 2022-10-05T10:06:05+05:30 IST

మధ్వాచార్యుని ఆవిర్భావం జీవ-బ్రహ్మ ఏకత్వాన్ని బోధిస్తున్న అద్వైత సిద్ధాంతంతో విభేదిస్తూ, జీవుడు అన్నటికీ భగవంతునితో సమానుడు కాదని తెలుపుతూ, జీవ-బ్రహ్మ భిన్నత్వాన్ని

ధర్మవిజయ పర్వం.. దసరా

మధ్వాచార్యుని ఆవిర్భావం జీవ-బ్రహ్మ ఏకత్వాన్ని బోధిస్తున్న అద్వైత సిద్ధాంతంతో విభేదిస్తూ, జీవుడు అన్నటికీ భగవంతునితో సమానుడు కాదని తెలుపుతూ, జీవ-బ్రహ్మ భిన్నత్వాన్ని వివరించే ద్వైత సిద్ధాంతాన్ని సంస్థాపించిన మూల ఆచార్యులైన శ్రీ మధ్యాచార్యులు విజయదశమినాడే ఆవిర్భవించడం విశేషం. హరి మాత్రమే సర్వోత్తముడనీ, తక్కినవారు ఆ శ్రీహరి సేవకులనీ శాస్త్రపరంగా తెలియజెప్పి, అత్యున్నత ఆధ్యాత్మిక పథానికి దారి చూపినవారు మధ్యాచార్యులు. 


సీతమ్మ తల్లిని అపహరించిన లంకాధీశుడు రావణుడి వధ జరిగిన రోజును శ్రీరామచంద్ర విజయోత్సవంగా, విజయదశమిగా నిర్వహించుకోవడం జరుగుతోంది. ‘దశ’ అంటే పది. ‘హర’ అంటే లయము లేదా ఓటమి. ధర్మసంస్థాపన కోసం శ్రీరామచంద్రుడి అవతరించి, దశకంఠుడైన రావణుణ్ణి ఓటమి పాలు చేయడమే ‘దశహర’. ఇది కాలక్రమేణా ‘దశరా’గా, ‘దసరా’గా ప్రఖ్యాతి చెందింది. రామాయణంలోని ‘యుద్ధకాండ’లో విశేషంగా వర్ణించిన ఈ ఘట్టాన్ని పురస్కరించుకొని... దేశంలోని పలుచోట్ల రావణ దహన వేడుకను నిర్వహిస్తున్నారు. ఇంతకీ తపోసంపన్నుడు, పరమ శివభక్తుడు అయిన రావణుడి పతనానికి కారణమేమిటి? గర్వంతో, భగవంతుడి సృష్టి మర్మాన్ని ఎరుగకుండా... రావణుడు పొందిన స్థితిని పరిశీలిస్తే... మానవ జీవిత లక్ష్య సాధనకు ధర్మాధర్మ విచక్షణ, ధర్మావలంబన ఎంత ముఖ్యమైనవో అర్థమవుతుంది. అది మన ఆధ్యాత్మిక పురోగతికి తోడ్పడుతుంది. 


రావణుడి అసలు పేరు దశగ్రీవుడు. అతని తండ్రి విశ్రవశో బ్రహ్మకు ఇలావిద, కైకసి అనే ఇద్దరు భార్యలున్నారు. ఇలావిద పుత్రుడు కుబేరుడు కాగా, కైకసి కుమారుడు రావణుడు. కుబేరుడంటే రావణుడికి అసూయ. కుబేరుడి మీద పైచేయి సాధించాలని బ్రహ్మకోసం తపస్సు చేసి, వరాలు పొందాడు. కుబేరుణ్ణి లంక నుంచి తరిమేసి, రాజ్యాన్ని ఆక్రమించాడు. ఒక రోజు పరమశివుని దర్శనం కోసం వెళ్ళిన దశగ్రీవుణ్ణి నంది అనుమతించకపోవడంతో... అతను కైలాస పర్వతాన్నే ఎత్తే దుస్సాహసానికి పాల్పడ్డాడు. పరమశివుడు తన బొటనవేలును కిందకు అదిమాడు. కైలాస పర్వతం కింద చిక్కుకున్న దశగ్రీవుడు బిగ్గరగా ఆర్తనాదాలు చేశాడు. ఆ అరుపులను విన్న పరమశివుడు ‘రావణా’ అని పిలవడంతో, అప్పటి నుంచి ఆ పేరే అతనికి స్థిరపడింది. రావణుడు శివునికి పరమ భక్తుడు. కానీ నిస్వార్థమైన భక్తిప్రపత్తుల వల్ల మాత్రమే భగవంతుడు ప్రసన్నం కాగలడు. ఈ సత్యాన్ని మరచి, కేవలం తన స్వార్థ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చేవారి పట్ల... ఆ భగవంతుడి అనుగ్రహం ఎల్లకాలం నిలవదు. దీనికి రావణుడి జీవితమే నిదర్శనం. రావణాసురుడు విద్య నేర్చినవాడే. కానీ అధర్మమైన మార్గం పట్టాడు. 


మన మనస్సును ఉన్నత స్థానానికి చేరడానికి వినియోగించుకోవాలే కాని పతనానికి కాదని భగవద్గీత బోధిస్తోంది. మనసు పరిశుద్ధంగా ఉన్నప్పుడు అది మంచి మిత్రుడు. కల్మషాలు చేరితే అది శత్రువు అవుతుంది. అలాంటి కపట, కల్మషాల నుంచి విముక్తి పొందేందుకు కలియుగంలో నిర్దేశించినదే హరేకృష్ణ మహా మంత్రం. 


పరమాత్మ నుంచి జీవాత్మ చేతనత్వాన్ని అపహరించి తమ వశం చేసుకోవాలని ప్రయత్నిస్తున్న కామ, క్రోధ, మోహ, లోభ, మద మాత్సర్యాలనే రావణులను రామనామమే సంహరించగలదు.


విరాట పర్వం... ఆయుధ పూజ

శమీ వృక్షం లేదా జమ్మి చెట్టును పూజించడం కూడా దసరా పండుగలో అంతర్భాగం. అందుకు సంబంధించిన వృత్తాంతాన్ని మనకు ‘మహా భారతం’ తెలియజేస్తుంది. పన్నెండేళ్ళ అరణ్య వాసాన్ని పూర్తి చేసిన పాండవులు చివరగా ఒక సంవత్సరం పాటు అజ్ఞాతవాసం కోసం వేషాలు మార్చారు. విరాటరాజు కొలువులో వివిధ వృత్తులు చేపట్టారు. పాండవులు ఎక్కడున్నారో కనుక్కోగలిగితే... తిరిగి వాళ్ళను పన్నెండేళ్ళ అరణ్య వాసానికి పంపవచ్చునని ఆలోచించిన దుర్యోధనుడు... వారిని ఎలాగైనా బయటకు రపిఁంచాలని, విరాటరాజుకు చెందిన గోవులను అపహరించాడు. బృహన్నల వేషంలో ఉన్న అర్జునుడు గోవుల సంరక్షణ కోసం... విరాటరాజు పుత్రుడైన ఉత్తరకుమారుడి రథసారథిగా బయలుదేరాడు. మార్గమధ్యంలో తమ ఆయుధాలు ఉంచిన శమీ వృక్షం వద్దకు వెళ్ళి, ఆయుధాలు తీసుకున్నాడు. కౌరవసేనలోని అతిరథ మహారథులైన భీష్మ, ద్రోణ, కర్ణ, దుర్యోధనులను ఒక్కడే నిలువరించి, గో సంరక్షణ చేశాడు.


అతడే అర్జునుడని దుర్యోధనుడు గుర్తించినా, అప్పటికే పాండవుల అజ్ఞాతవాసం ముగిసిపోయింది. దుర్యోధనుడి వ్యూహం కాస్తా విఫలమయింది. ఈ విధంగా పాండవులు తమ ఆయుధాలను పొందిన రోజు... దసరా తిథిగి ముందు రోజే కావడంతో, వివిధ వృత్తుల వారు తమ వృత్తులకు తోడ్పడుతున్న పనిముట్లను, ఇంటిల్లి పాది సామగ్రినీ సమీక్షించుకొనే రోజు... ‘ఆయుధ పూజ’గా మన సంప్రదాయంలో అంతర్భాగమయింది. ఇక శ్రీకృష్ణుడు తాను చేయవలసిన ధర్మసంస్థాపనకు... పాండవుల ద్వారా తుదిరూపం అందించే సమయం ఆసన్నమయిందని కూడా విజయదశమి సూచించింది.


మహిషాసుర సంహారం

దసరా పండుగ కేవలం ఒక రోజు ఉత్సవం కాదు. ప్రముఖ దేవాలయాలన్నిటిలో నవరాత్రి ఉత్సవాలు జరపడం సంప్రదాయం. మహిషాసురుడితో దుర్గాదేవి తొమ్మిదిరోజుల పాటు ప్రచండ యుద్ధం చేసి, ఆ రాక్షసుణ్ణి సంహరించింది. అందుకే ‘దుర్గా పూజ’గా ఈ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారు. ‘విష్ణు శక్తిః పరా ప్రోక్త’ అన్నట్టు... దేవాదిదేవుడైన శ్రీకృష్ణుని అనంతమైన శక్తులలో ఒకటైన బాహ్య శక్తే... ఆ భౌతిక సృష్టి. ఈ బాహ్య శక్తి (మహామాయ) స్వరూపమే దుర్గాదేవి. ఈ శక్తి దుర్బేధ్యమైనది. 


శ్రీకృష్ణుణ్ణి బ్రహ్మదేవుడు స్తోత్రం చేస్తూ-

సృష్టి స్థితి ప్రళయ సాధన శక్తిరేక

ఛాయేవ యస్య భువనాని భిభర్త దుర్గ

ఇచ్ఛానురూపమపి యస్య చ చేష్టతేస

గోవిందం ఆది పురుషం తమహం భజామి..


‘‘ఎవరి ఇచ్ఛానుసారం ఈ సృష్టి, స్థితి, ప్రళయ సాధనలో ఒక ఛాయగా తనను అనువర్తిస్తూ... దుర్గ తన కార్య నిర్వహణను చేపడుతుందో, అట్టి ఆది పురుషుడైన గోవిందుణ్ణి నేను సదా భజిస్తాను’’ (బ్రహ్మ సంహిత) అంటాడు. పైన వివరించిన విధంగా... విష్ణువు సంకల్పానికి అనుగుణంగా.. ఈ భౌతిక ప్రపంచంలోని పలు కార్యనిర్వహణలను శక్తి స్వరూపిణి అయిన దుర్గ చేపడుతుంది. శ్రీకృష్ణుడు అవతరించిన సమయంలో, ఆ పిల్లవాడిని తండ్రి వసుదేవుడు గోకులానికి చేర్చి, అక్కడ యశోదకు పుట్టిన బిడ్డను మధురకు తెచ్చాడు. ‘ఆడ పిల్ల కదా, వదిలేయ’మని వసుదేవుడు వేడుకున్నా, కంసుడు ఆ బిడ్డను చంపడానికి ప్రయత్నించాడు. ఆ పసిబిడ్డ శక్తి స్వరూపిణిగా, దుర్గాదేవిగా దర్శనమిచ్చి, కంసుణ్ణి హెచ్చరించి, అదృశ్యమయింది. ఈ విధంగా శ్రీకృష్ణుని సోదరిగా జన్మించిన దుర్గాదేవి... వైష్ణవిగా పిలుపులందుకుంటోంది.


ఒక సందర్భంలో దుర్గా దేవి గురించి శ్రీల ప్రభుపాదులవారు మాట్లాడుతూ ‘‘కేవలం దుష్ట సంహారానికే అయితే శ్రీ కృష్ణుడు ఈ లోకంలో అవతరించాల్సిన అవసరం లేదు. ఈ భౌతిక ప్రపంచంలోని దశ దిశల్లో వ్యాపించిన ఆయన శక్తి స్వరూపమైన దుర్గాదేవి చాలు. దుర్గాదేవి ఒక్క వేటు వేస్తే... ఎంతటి అసురుడైనా నేల రాలవలసిందే’’ అన్నారు. కాబట్టి భగవంతుడు స్వయంగా అవతరించినా, ఒక శక్తిగా ప్రకటితమైనా, లేదా ఆచార్యుని రూపంలో జన్మించినా... జీవులను ఉద్ధరించడమే లక్ష్యం. కల్మష భూయిష్టమైన ఈ కలియుగంలో ‘హరేర్నామైవ కేవలమ్‌’ అంటూ కలియుగానికి శాస్త్రం నిర్దేశించిన ‘హరినామం’ అనే దివ్యౌషధాన్ని ప్రతి ఒక్కరూ సేవించేలా రూపకల్పన చేసిన వదాన్యులు శ్రీ చైతన్య మహా ప్రభువు. ఆనాడు లోకంలోని అనర్థాలను సృష్టించిన రావణాదులను రామబాణం దహించి వేసింది. నేడు మనలో అనర్థాలను సృష్టించే కామ, క్రోధ, లోభాదులను కూడా దహించగలిగేది ఆ రామనామమే.


హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే

హరే రామ హరే రామ రామ హరే హరే




సత్యగౌర చంద్రదాస ప్రభూజీ, 

అధ్యక్షుడు, హరే కృష్ణ మూవ్‌మెంట్‌, హైదరాబాద్‌

9396956984 

Updated Date - 2022-10-05T10:06:05+05:30 IST