Deepti Ganta: అతడే నాకు స్ఫూర్తి

ABN , First Publish Date - 2022-11-29T22:48:12+05:30 IST

తెలుగు పరిశ్రమలో మహిళా దర్శకులు అరుదే. అమెరికాలో ఉద్యోగానికి తాత్కాలిక విరామం ఇచ్చి... హైదరాబాద్‌కు వచ్చి ‘మీట్‌ క్యూట్‌’ అనే వెబ్‌సిరీస్‌కు దర్శకత్వం వహించారు దీప్తి గంట.

Deepti Ganta: అతడే నాకు స్ఫూర్తి

అభిరుచి

తెలుగు పరిశ్రమలో మహిళా దర్శకులు అరుదే. అమెరికాలో ఉద్యోగానికి తాత్కాలిక విరామం ఇచ్చి... హైదరాబాద్‌కు వచ్చి ‘మీట్‌ క్యూట్‌’ అనే వెబ్‌సిరీస్‌కు దర్శకత్వం వహించారు దీప్తి గంట. హీరో నాని అక్కగా ఎంట్రీ ఇచ్చినా... తొలి ప్రయత్నంలోనే అభిరుచి గల దర్శకురాలిగా అభినందనలు అందుకున్న దీప్తి తన కథతో పాటు అనేక విషయాలను ‘నవ్య’తో చెప్పారిలా...

చిన్నప్పటి నుంచే నాకు రాయడమంటే ఆసక్తి ఉంది. కథలు కాకపోయినా ప్రతి చిన్న విషయాన్నీ రాసి చెప్పడం నాకు అలవాటు. ఇప్పుడు కూడా నాని ‘నా సినిమా ఎలా ఉంది?’ అని అడిగితే వెంటనే చెప్పలేను. నా అభిప్రాయం రాసి పంపిస్తాను. నా ఆలోచనలను కాగితంపైన పెట్టినప్పుడే స్పష్టత వస్తుంది.

‘మీట్‌ క్యూట్‌’ దర్శకత్వం చేయటానికి కారణం?

సిరీ్‌సగా తీయాలని మొదలుపెట్టిన ప్రాజెక్ట్‌ కాదు ఇది. నాకు రచనలు చేయడం ఇష్టం. కొవిడ్‌ టైమ్‌లో రిలాక్స్‌ అవ్వడానికి రాయడం మొదలుపెట్టాను. ఇద్దరు అపరిచితుల సంభాషణల నేపథ్యంలో రాసుకున్నాను. దాన్ని నానీకీ, మా వారికీ చూపించాను. ‘భలే రాశావే బాగుంది’ అని మెచ్చుకున్నారు. ఆపకుండా మరో అరగంట ఎపిసోడ్‌ రాశాను. దాన్ని నానీకి చూపించాను. ‘ఇది చాలా స్వీట్‌గా ఉంది. కచ్చితంగా చెప్పలేను గానీ మరికొన్ని ఎపిసోడ్‌లు ఇదే స్థాయిలో నువ్వు రాయగలిగితే ప్రొడ్యూస్‌ చేయడం గురించి ఆలోచిస్తా’ అన్నాడు.

దర్శకత్వం వహించాలనే ఆలోచన ఎవరిది?

ఐదు ఎపిసోడ్లు రాశాక నానీకి చూపిస్తే.. తనకు నచ్చాయి. ‘వీటితో ఏం చేద్దాం’ అని నన్ను అడిగాడు. ‘ఈ స్టోరీస్‌ నీకు ఇచ్చేస్తాను... నీ ఇష్టం’ అన్నాను. మొదట్లో ఎవరైనా డైరెక్టర్‌ని అడుగుదామనుకున్నాడు. కానీ వేరేవాళ్లు డైరెక్ట్‌ చేస్తే కథకు న్యాయం జరగదని భావించాడు. ‘లోతైన సంభాషణలు, భావోద్వేగాలు ఉన్న కథ కాబట్టి రచయితగా నువ్వయితేనే బాగా డీల్‌ చేయగలవు. ఇందులోని భావోద్వేగాలు నీకే ఎక్కువగా అర్థమవుతాయి. వేరొకరు దర్శకత్వం వహిస్తే పూర్తిగా న్యాయం చేయలేరు. అందుకే నువ్వు డైరెక్ట్‌ చేస్తావా’ అని అడిగాడు.

నాని వైపు నుంచి ఎలాంటి సహకారం అందింది?

దర్శకత్వంలో నాకు ఎలాంటి అనుభవం లేదు. నేరుగా సెట్స్‌కి వెళ్లి డైరెక్ట్‌ చే యడం రిస్క్‌ కదా అనిపించింది. ‘నువ్వు నిర్మాత అంటే నేను ఆషామాషీగా తీసుకోలేను. రిస్క్‌ చేయలేను’ అన్నాను నానీతో. ‘నువ్వు కథ రాసుకునేటప్పుడు నీ ఊహల్లో ఉన్న విషయాలను తెరపైకి తీసుకురావడంలో నా పూర్తి సహకారం ఉంటుంది’ అన్నాడు తను. చెప్పినట్లే మంచి చిత్ర బృందాన్ని ఇచ్చాడు. మొదటి రోజు నుంచీ కావలసిన అవుట్‌పుట్‌ వచ్చిందా, లేదా అని మానిటర్‌లో చూసుకోవడం నా పని. మిగిలిన ప్రతి విషయం తనే పర్యవేక్షించాడు. నటీనటుల ఎంపిక, సెట్‌ డిజైన్‌, ప్రీ ప్రొడక్షన్‌, పోస్ట్‌ ప్రొడక్షన్‌ దాకా ప్రతి దశలోనూ నేను అడిగిన ప్రతిదీ ఇచ్చాడు. నిర్మాతగా నాని నాకు బాగా నచ్చాడు. ‘నువ్వు తీయాలనుకున్నది బాగా తియ్యి... మిగిలినవి నాకొదిలిపెట్టు’ అన్నాడు.

ఇంతకుముందు సినిమాకు పనిచేశారా?

గతంలో ‘అనగనగా ఒక నాన్న’ అనే లఘు చిత్రం చేశాను. దానికి నాని నిర్మాత. అయితే మూడురోజుల్లో దాని షూటింగ్‌ పూర్తయింది. దాంతో పెద్దగా నేర్చుకున్నదేం లేదు.

సెట్స్‌లో దర్శకురాలిగా ఎలా అనిపించింది?

మేకింగ్‌ చాలా అద్భుతంగా అనిపించింది. మా చిత్ర బృందం సహకారాన్ని మర్చిపోలేను. షూటింగ్‌ వాతావరణాన్ని, వాళ్లందరినీ మిస్సవుతున్న ఫీలింగ్‌ కలిగింది.

మీ విద్యాభ్యాసం గురించి చెప్పండి...

ఇక్కడ కెమికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తయిన తరువాత అమెరికాలో ‘ఇంజనీరింగ్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌’లో మాస్టర్స్‌ చేశాను. ప్రస్తుతం అక్కడే డేటా మేనేజర్‌గా వర్క్‌ చేస్తున్నాను.

చిన్నతనం నుంచే సినిమాలపై ఆసక్తి ఉందా?

అవును. చిన్నప్పటి నుంచే సినిమాలు బాగా చూడడం, నానీతో స్టోరీ గురించి చర్చించడం చేసేదాన్ని. అయితే సినిమా మేకింగ్‌ మీద నాకైతే ఎప్పుడూ ఆసక్తి కలగలేదు. భవిష్యత్తులో కూడా దీన్ని కొనసాగిస్తానని అనుకోవడ ం లేదు.

బాల్యంలో మీ జ్ఞాపకాల గురించి చెప్పండి?

మాది మధ్యతరగతి కుటుంబం. ప్రతి శుక్రవారం సత్యం థియేటర్‌కు వెళ్లి సినిమాలు చూడడం ఓ ఆనవాయితీలా కొనసాగించేవాళ్లం. అప్పట్లో మాకు అదే ఎంటర్‌టైన్‌మెంట్‌.

మీ ఇద్దరిలో ఎవరు ఎక్కువ పెత్తనం చేసేవారు?

నాని కంటే నేను ఏడాదిన్నర పెద్ద. ఇద్దరం సమానంగా జులుం చేసేవాళ్లం. అరగంట మాట్లాడుకుంటే 20 నిమిషాలు కొట్టుకోవడానికే సరిపోయేది. అయితే అవన్నీ సరదాకే. మా మధ్య అనుబంధం చాలా దృఢమైనది.

నాని సినిమాల్లోకి వెళతానంటే ఏమన్నారు?

వద్దని ఇంట్లో ఒత్తిడి చేశాం. తను స్ట్రగుల్‌ అవుతుండడం చూసి వెనక్కు రమ్మన్నాం. ‘మనకు సినిమాల్లో ఎలాంటి నేపథ్యం లేదు... సక్సెస్‌ అవ్వలేం’ అని నేనూ, అమ్మానాన్న చెప్పేవాళ్లం. కనీసం డిగ్రీ అయినా పూర్తి చేయమని గొడవ చేసేవాళ్లం. కానీ నాని దృష్టంతా సినిమాలపైనే. ‘నేను మీకు భారం కాను. నా ఇబ్బందులేవో పడతాను. సినిమాలు తప్ప నేను ఏదీ చేయలేను’ అన్నాడు. రోజూ 24 గంటలు పని చేసేవాడు. ఓ పక్క ఆర్జేగా చేస్తూ, మిగిలిన టైమ్‌లో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గానూ చేసేవాడు. ఇష్టంతో తనకు నచ్చిన సినీరంగం వైపు వెళ్లనివ్వడమే కరెక్ట్‌ అని వదిలేశాం.

రచయితగా ఎప్పుడు మారారు?

చిన్నప్పటి నుంచే నాకు రాయడమంటే ఆసక్తి ఉంది. కథలు కాకపోయినా ప్రతి చిన్న విషయాన్నీ రాసి చెప్పడం నాకు అలవాటు. ఇప్పుడు కూడా నాని ‘నా సినిమా ఎలా ఉంది’ అని అడిగితే వెంటనే చెప్పలేను. నా అభిప్రాయం రాసి పంపిస్తాను. నా ఆలోచనలను కాగితంపైన పెట్టినప్పుడే నాకు స్పష్టత వస్తుంది. ఏం చెప్పాలనుకున్నా ముందు రాస్తాను. కొవిడ్‌ టైమ్‌లో ఒత్తిడిని దూరం చేసేందుకు చిన్న చిన్న స్టోరీలు రాశాను. ఇక దర్శకురాలిగా మారడానికి మాత్రం నాని ప్రోత్సాహమే కారణం. ‘రాయడం పూర్తయితే సినిమాకు సంబంధించి 70 శాతం చిత్రీకరణ పూర్తయినట్లే’ అన్నాడు నాని. ‘మంచి టీమ్‌ను ఇస్తాను, నువ్వు షూట్‌ చెయ్యి’ అన్నాడు.

మీ ఇంట్లో ఎలాంటి సహకారం లభించింది?

షూటింగ్‌ కోసం ఆర్నెల్లు భారత్‌కు వె ళతానని చెప్పినప్పుడు ‘పిల్లలతో ఇబ్బంది అవుతుందేమో’ అని మావారు కొంచెం ఆందోళన చెందారు. అయితే ‘నువ్వు రాసిన స్ర్కిప్టు బాగుంది కదా... నువ్వు డైరెక్ట్‌ చేస్తేనే బావుంటుంది... వెళ్లు... ఎలాగో ఒకలా మేనేజ్‌ చేద్దాం’ అన్నారు.

మీ హాబీలు ఏంటి?

రచనలు చేయడం, సినిమాలు చూడడం ఇష్టం. కానీ నాకు చాలా తక్కువ టైమ్‌ ఉంటుంది. ఏమాత్రం కుదిరినా లాప్‌టా్‌పలో సినిమాలు చూస్తాను.

నాని ప్రభావం మీ మీద ఎంతవరకూ ఉంది?

పని చేసే రంగం కన్నా తను అందులో పని చేసే తీరు నాకు ఇష్టం. పనిలో చాలా నిక్కచ్చిగా ఉంటాడు. ఏదో కాలక్షేపం కోసం అన్నట్లు చేయడు. తన వైపు నుంచి నూటికి నూరు శాతం ఇవ్వాలనుకుంటాడు. ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక ఎలాంటి సాకులూ ఉండవు. ప్రాణం పెట్టి పని చేయాలన్నట్లు ఉంటాడు. వృత్తిపట్ల తన నిబద్ధత నాకు చాలా ఇష్టం. ‘ఏది ఏమైనా కానివ్వు నేను ఈ పని చేయాలనుకున్నాను, చేసి తీరతాను. ఎంచుకున్న పనిలో మన బెస్ట్‌ ఇవ్వాల’నే నాని తాపత్రయం నుంచి నేను స్ఫూర్తి పొందుతాను.

తదుపరి కెరీర్‌ ప్లానింగ్‌ ఏమిటి?

ప్రస్తుతం రాస్తున్న స్ర్కిప్టు పూర్తయ్యాక కానీ ఏం చేయాలనేది ఆలోచించను. బహుశా మళ్లీ నాని దగ్గరకే తీసుకెళ్తాను.

నాని కాకుండా మీకు నచ్చిన నటుడు..?

జూనియర్‌ ఎన్టీఆర్‌. ‘రంగస్థలం’ చిత్రంలో రామ్‌చరణ్‌ నటన నాకు చాలా ఇష్టం. ‘జెర్సీ’ చిత్రంలో నాని నటన నన్ను చాలా రోజులు వెంటాడింది.

నాని సినిమాల్లో మీకు నచ్చని విషయాల గురించి అతనితో చెబుతారా?

తప్పకుండా. నాకు ఏం అనిపిస్తే అది చెబుతాను. నాకు నచ్చనివాటిని నోట్‌ చేసుకొని చెబుతాను. నాని కూడా దాన్ని సద్విమర్శగానే తీసుకుంటాడు.

-సివిఎల్‌ఎన్‌ ప్రసాద్‌

Updated Date - 2022-11-30T13:42:40+05:30 IST