Christians Prayer: ప్రార్థనా బలం...
ABN , First Publish Date - 2022-12-15T22:10:44+05:30 IST
ఎవరైనా తాము నమ్మిన దైవ శక్తిని పూజించడం, ప్రార్థించడం అనాదిగా ఉన్నదే. ప్రార్థన అంటే ‘ప్రాధేయపడి అడగడం’ అనే అర్థం చెప్పుకోవచ్చు.
దైవమార్గం
ఎవరైనా తాము నమ్మిన దైవ శక్తిని పూజించడం, ప్రార్థించడం అనాదిగా ఉన్నదే. ప్రార్థన అంటే ‘ప్రాధేయపడి అడగడం’ అనే అర్థం చెప్పుకోవచ్చు. క్రైస్తవులకు ప్రార్థన ఒక నిత్య ఆహారం. క్షణ క్షణం ఆచరించే ఆచారం. అది మానసిక ఆయుధం, దివ్యౌషధం. విశ్వాసులకు ప్రార్థన లేనిదే ఏదీ మొదలుకాదు. దేవుడు తమ ప్రార్థనను ఆలకిస్తాడనీ, ప్రార్థిస్తే అనుకున్న పనులు తప్పక జరుగుతాయనీ వారి ప్రగాఢ నమ్మకం. కానీ కష్టపడకుండా ఏ పనీ జరగదు. దేవుడూ కరుణించడు... ఏవో అద్భుతాలు జరిగితే తప్ప. వాస్తవానికి ప్రార్థన అంటే- మనసు విప్పి... దేవుడితో చేసే సంభాషణ. సాక్షాత్తూ ఏసు ప్రభువే కొండ కోనల్లో తన తండ్రి అయిన దైవంతో ఒంటరిగా మాట్లాడేవాడు. ప్రార్థనకు ఆయన ఇచ్చిన... అతి సున్నితమైన కార్యరూప నిర్వచనం అది. ప్రార్థనకు ఏవో పడికట్టు మాటలు, కంఠస్త వాక్యాలూ అవసరం లేదు. మామూలు మాటలతోనైనా, మౌనంగానైనా మనం చేసే ప్రార్థనను దైవం గ్రహించగలడు. ఒక విధంగా మౌన ధ్యానమే ప్రార్థనకు ప్రాతిపదిక. ఆకలైనప్పుడు అమ్మ దగ్గరకు ఎంత చనువుగా, ఎంత స్వతంత్రంగా వెళ్ళి అడుగుతామో... అలాగే అవసరాలు తీర్చాలని దేవుణ్ణి అడిగితే అదే ప్రార్థన అవుతుంది.
అసలు దేవుణ్ణి ఎలా ప్రార్థించాలి? ఈ ప్రశ్నను రెండువేల ఏళ్ళ క్రితమే సాధారణ ప్రజలు ఏసు ప్రభువును అడిగారు. దానికి ఏసు బదులిస్తూ ‘‘దేవుని సృష్టినీ, ఔన్నత్యాన్నీ స్తుతించండి. ఆయన నైతిక రాజ్యం రావాలని కోరుకోండి. దేవుడి మాట పరలోకంలో దూతల ముందు, పునీతుల ముందు ఎలా చలామణి అవుతుందో... అలాగే ఈ లోకంలోనూ జరగాలని ఆశించండి. ‘మాకు ఆధ్యాత్మిక బలం అందించి, నీవైపు నడిపించుకో’ అని ప్రతి రోజూ అర్థించండి. క్షణక్షణం మిమ్మల్ని అణచివేయాలని కాపు కాసే సైతాను కుట్రల నుంచి తప్పించాలని వేడుకోండి. సాటివారి దోషాలను మీరు ఎలా క్షమిస్తారో, మీకు చేసే తప్పులను కూడా అలాగే క్షమించాలని అడగండి. కీడులకూ, చెడులకూ దూరంగా.... తప్పుల్లో పడనీయకుండా రక్షించమనండి’’ అంటూ అక్కడున్న వారికి ప్రార్థించడం ఎలాగో నేర్పించాడు. దీన్ని పరలోక ప్రార్థనగా క్రైస్తవులు పరిగణించి, ప్రతి సందర్భంలో భక్తిపూర్వకంగా జపిస్తారు.
తమ కోసం, తమ సంఘం కోసం మాత్రమే కాకుండా... తోటి వ్యక్తుల బాగోగుల కోసం, దేశ సౌభాగ్యం కోసం ప్రార్థించే ఆనవాయితీ సామూహిక ప్రార్థనల్లో కనిపిస్తుంది. కానీ, వ్యక్తిగతమైన ఏకాంత ప్రార్థనలోనే వ్యక్తి హృదయం ఆవిష్కృతమవుతుంది. అయితే అంతఃశుద్ధి, ఇతరుల కష్టాలకు స్పందించని హృదయం, నైతిక నిష్ట లేని వారు చేసే ప్రార్థనలతో ప్రయోజనం లేదు ప్రార్థన... పరహితాన్ని కోరుతూ, ఆత్మానందాన్ని పొందుతూ సాగాలి. వేకువజామున చేసే ప్రార్థనను దేవుడు తప్పక ఆలకిస్తాడని పవిత్ర గ్రంథమైన బైబిల్ చెబుతోంది. ఆర్తితో చేసే ప్రార్థనను... దేవుడు పరలోకం నుంచి కదలి వచ్చి, పక్కనే కూర్చొని, శ్రద్ధగా వింటాడట!
-డాక్టర్ దేవదాసు బెర్నార్డ్ రాజు, 9866755024