Chandramukhi: ఆ బొమ్మలు... మనుషుల ప్రతిరూపాలు

ABN , First Publish Date - 2022-11-22T22:18:03+05:30 IST

అచ్చుగుద్దినట్టు చిత్తరువులు సృష్టించడం సాధ్యమే! కానీ మనిషిని పోలిన ప్రతిరూపాన్ని రూపొందించడం కొంత క్లిష్టం. అలాంటి క్లిష్టమైన పనినే ఇష్టంగా మలుచుకుని రెప్లికాలను తయారుచేస్తున్నారు

Chandramukhi: ఆ బొమ్మలు...  మనుషుల ప్రతిరూపాలు
Chandramukhi

వినూత్నం

అచ్చుగుద్దినట్టు చిత్తరువులు సృష్టించడం సాధ్యమే! కానీ మనిషిని పోలిన ప్రతిరూపాన్ని రూపొందించడం కొంత క్లిష్టం. అలాంటి క్లిష్టమైన పనినే ఇష్టంగా మలుచుకుని రెప్లికాలను తయారుచేస్తున్నారు హైదరాబాద్‌కు చెందిన ‘తూర్పు పల్లవి చంద్రముఖి’. ఆవిడ నవ్యతో పంచుకున్న బొమ్మల కబుర్లు.

చిన్నప్పటి నుంచీ బొమ్మలంటే ఇష్టం. మట్టితో బొమ్మలు తయారుచేయడం, రబ్బరు బొమ్మలకు అందమైన దుస్తులు కుట్టించి, వాటికి కొత్త రూపాన్ని ఇస్తూ ఉండేదాన్ని. ఎలాంటి బొమ్మను చూసినా, దాన్ని ఇంకోలా ఎలా మలచవచ్చో ఆలోచించి, సృజనాత్మకతను జోడించి కొత్త రూపం ఇవ్వడం అలవాటుగా మారిపోయింది. పైగా బాల్యంలో ఆంధ్ర బాలానంద సంఘంలో సభ్యురాలిగా కళల పట్ల కొంత పట్టు ఏర్పడింది. అయితే పరిస్థితులు అనుకూలించేవరకూ బొమ్మల తయారీ ఆసక్తి అభిరుచికే పరితమైపోయింది. అయితే 2018లో మా వారికి యాక్సిడెంట్‌ జరిగి, ఆయన ఇంటికే పరిమతమైపోయారు. అంతకు ముందు వరకూ విద్యా రంగంలో వేర్వేరు హోదాల్లో పని చేసిన నేను కూడా బాబు పదో తరగతిలో ఉండగా, గృహిణిగా స్థిరపడిపోయాను. దాంతో హఠాత్తుగా ఆర్ధిక ఇబ్బందులు మొదలయ్యాయి. ఆ సమయంలో ముందు నుంచీ ఆసక్తి ఉన్న బొమ్మల తయారీనే జీవనభృతిగా ఎందుకు మార్చుకోకూడదు అనే ఆలోచన వచ్చింది. అలా గత నాలుగేళ్లుగా బొమ్మల తయారీలో మునిగిపోయాను.

మాది నాగర్‌కర్నూల్‌ జిల్లా, కొల్లాపూర్‌. కానీ పుట్టి, పెరిగింది హైదరాబాద్‌లోనే! పిజి డిప్లొమా ఇన్‌ లాంగ్వేజ్‌ టీచింగ్‌, లైబ్రరీ సైన్స్‌ చేశాను. బొమ్మలకు ఉడెన్‌ సపోర్ట్‌లను సమకూర్చడం, బొమ్మలను కొరియర్‌ చేయడం లాంటి పనుల్లో మా వారు తూర్పు శ్రీధర్‌ సహాయపడుతూ ఉంటారు. పెద్ద బాబు యానిమేషన్‌ పూర్తి చేసి ఉద్యోగంలో స్థిరపడ్డాడు. చిన్న బాబు మిమిక్రీ ఆర్టిస్ట్‌.

ముఖ కవళికలే కీలకం

మొదట్లో పెయింటింగ్స్‌లోని ఫిగర్స్‌ను పోలిన బొమ్మలను తయారు చేయడం, దేవతామూర్తుల రెప్లికాలను తయారుచేయడం మొదలుపెట్టాను. వాటిని కజిన్స్‌కు ఇచ్చినప్పుడు, అవి అందరికీ నచ్చడం, నచ్చినవాళ్లు నన్ను సంప్రతించడం... అలా క్రమేపీ బొమ్మల తయారీకి డిమాండ్‌ పెరిగిపోయింది. బొమ్మల అమ్మకాలన్నీ ‘పల్లవి కలెక్షన్స్‌’ అనే ఫేస్‌బుక్‌ అకౌంట్‌ ద్వారానే జరుగుతూ ఉంటాయి. బొమ్మల తయారీ కోసం బార్బీ బొమ్మలను కొనుగోలు చేస్తాను. వేర్వేరు సైజుల్లో, వేర్వేరు ముఖ కవళికలతో కూడిన బార్బీ బొమ్మలను ఎంచుకుని, వాటిని అవసరానికి తగినట్టు మలుచుకుంటాను. ముఖ కవళికల విషయంలో ఎన్నో జాగ్రత్తలు పాటిస్తాను. ఇందుకోసం మౌల్డింగ్‌ క్లే’ (బంకమట్టి)తో కనుముక్కు తీరు అవసరమైనట్టు తీర్చిదిద్దుతాను. నూలుతో వెంట్రుకలు, శరీరాకారాలను మలుస్తాను. పొడవాటి జుట్టు కోసం సవరాలు వాడతాను. తగిన దుస్తులు స్వయంగా కుట్టి, బొమ్మలకు తొడుగుతాను. అంతిమంగా యాక్రిలిక్‌ రంగులతో మేక్‌పను ముగిస్తాను.

కష్టమైనా ఇష్టంగా...

బొమ్మల ముఖ కవళికలను మలచడం కష్టమైన పని. అలాగే బొమ్మలకు తగినట్టు స్వయంగా చిన్న సైజులో ఆభరణాలను తయారుచేయడం, దుస్తులను కుట్టడం కత్తి మీద సామే! మరీ ముఖ్యంగా ఆడ బొమ్మలకు చీరలు, జాకెట్టు అంచులకు జరీ బార్డర్ల ప్యాచ్‌వర్క్‌ చేయడం, పనిముట్ల సహాయంతో చిన్న సైజు లోహపు ఆభరణాలను తయారుచేయడానికి ఎంతో కష్టపడతాను. బొమ్మల తయారీ పట్ల నాకున్న అభిరుచి వల్ల ఈ పనులన్నీ నాకు కష్టంగా అనిపించవు. సృజనాత్మకత ఉంటే, చుట్టూ ఉండే వస్తువులను బొమ్మల తయారీలో ఎలా సద్వినియోగం చేసుకోవచ్చో మనసుకు తడుతుంది. సాధ్యమైనంత సహజంగా కనిపించడం కోసం బొమ్మల తయారీలో అందుకు తోడ్పడే వస్తువులను వాడుతూ ఉంటాను.

ప్రతి బొమ్మా ఓ సవాలే!

బొమ్మల తయారీ నుంచి రెప్లికాల తయారీలోకి యాధృచ్చికంగా అడుగు పెట్టాను. అయితే తయారుచేసే ప్రతి బొమ్మా ప్రత్యేకమైనదే! ప్రతి బొమ్మా భిన్నంగా ఉంటుంది. నా బొమ్మలకు అభిమానులు పెరిగిన తర్వాత, పౌరాణిక బొమ్మలను తయారుచేసి పెట్టమని అడిగే వాళ్ల సంఖ్య పెరిగింది. దేవతామూర్తుల పాత ఫొటోలను పంపించి రెప్లికాలను తయారుచేసి ఇవ్వమని అడిగేవాళ్లూ పెరిగారు. అలా నేను మూలవిరాట్టు రంగనాధస్వామి విగ్రహాన్ని తయారుచేసి అందించాను. గోదా కల్యాణం, సీతారాముల కల్యాణం బొమ్మలు తయారుచేసి అందించాను. ఇవే కాకుండా సీమంతం, హాఫ్‌ శారీ సెరిమనీ, గృహ ప్రవేశాలు, పెళ్లిళ్లు, అన్నప్రాసన... ఇలా వేర్వేరు సందర్భాల్లో రెప్లికాలను ప్రదర్శించుకోవడం కోసం నన్ను ఎంతోమంది సంప్రతిస్తూ ఉంటారు. ఈ బొమ్మలను దుమ్ము, ధూళిల నుంచి జాగ్రత్తగా కాపాడుకోగలిగితే, ఏళ్ల తరబడి చెక్కుచెదరకుండా ఉంటాయి. ఇలా నేను ఇప్పటివరకూ 1500 వరకూ బొమ్మలను తయారుచేసి అందించాను. నటి ఉపాసన, సిపి సజ్జనార్‌, నటుడు జె.డి చక్రవర్తి... ఇలా కొందరు ప్రముఖులకు నేనే స్వయంగా రెప్లికాలను తయారుచేసి అందించాను.

దివంగతుల రెప్లికాలు సైతం

రెప్లికాలను తయారుచేయడానికి రెట్టింపు కష్టపడాలి. ముఖ కవళికలు, శరీర తీరు లాంటివన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. ఇందుకోసం వేర్వేరు యాంగిల్స్‌లో ఉన్న ఫొటోలను పరీక్షించి రెప్లికాలను తయారుచేస్తూ ఉంటాను. మార్కెట్లో దొరికే నమూనా బొమ్మలన్నీ ఒకే ఆకారంలో ఉంటాయి. అలాంటి బొమ్మలను సజీవ వ్యక్తుల ప్రతిరూపాలుగా మలచడం కోసం, లావుగా కనిపించేలా చేయడం కోసం లోపల స్టఫ్‌ను ఉపయోగిస్తాను. అలా ఆకారాన్ని తెచ్చుకుని, కస్టమర్లు కోరుకునే రంగు, డిజైన్‌ దుస్తులను కుట్టి, రెప్లికాలను తయారుచేస్తూ ఉంటాను. మరీ ముఖ్యంగా దివంగత వ్యక్తుల రెప్లికాల విషయంలో ఎంతో జాగ్రత్తగా మలసుకుంటూ ఉంటాను. ఆ రెప్లికాలలో దూరమైన సొంతవాళ్లను చూసుక ుంటారు కాబట్టి, సాధ్యమైనంత సజీవంగా రూపొందిస్తూ ఉంటాను. రెప్లికాలను అందించినప్పుడు, కస్టమర్ల కళ్లలో ప్రతిఫలించే సంతోషం నాకెంతో తృప్తినిస్తూ ఉంటుంది. ఎక్కువ బొమ్మల ఆర్డర్లన్నీ విదేశాల నుంచే అందుతూ ఉంటాయి.

-గోగుమళ్ల కవిత.

Updated Date - 2022-11-22T22:28:00+05:30 IST