గాజులమ్మిన చోటే.. ఆరు వ్యాపారాలు చేస్తోంది!

ABN , First Publish Date - 2022-12-07T23:09:49+05:30 IST

పేదరికం కారణంగా చదవలేకపోయింది. చిన్న వయసులోనే పెళ్లి చేసుకుంది. డబ్బు సంపాదించటానికి గాజులమ్మింది.

గాజులమ్మిన చోటే.. ఆరు వ్యాపారాలు చేస్తోంది!

పేదరికం కారణంగా చదవలేకపోయింది. చిన్న వయసులోనే పెళ్లి చేసుకుంది. డబ్బు సంపాదించటానికి గాజులమ్మింది. ఆ తర్వాత వ్యవసాయం, పౌల్ర్టీరంగంలోకి అడుగెట్టింది. ఆరు రకాల వ్యాపారాలు చేస్తోంది. మహారాష్ట్రకు చెందిన కమల్‌ కుంబార్‌ ఇపుడు ఏకంగా వేలమందికి ఉపాధినిచ్చే విషయాల్ని చెప్పే స్ఫూర్తి ప్రదాత.

‘‘మా ఊరిలో 70 మందికి శిక్షణ ఇచ్చా. మహారాష్ట్ర అంతా కలిపి 5 వేల మందికి శిక్షణనిచ్చా. శిక్షణకు కేవలం వందరూపాయలే తీసుకుంటా. ఫీజు కడితే ఎవరైనా రావొచ్చు. పది నెలల శిక్షణ ఉంటుంది. బ్యాంకు అకౌంట్‌ ఓపెన్‌ చేయటం, ఎలాంటి వ్యాపారం బావుంటుంది? మార్కెట్‌ రీసెర్చి విశేషాలు, గవర్నమెంటు పథకాల్లో ఎలా రిజిస్టర్‌ కావాలి? ఎలా లబ్ధి పొందాలనే విశేషాలు చెబుతుంటా.

పిల్లలు ఇబ్బంది పడకూడదు...

మా ఊరి చుట్టూ ఉండే మారుమూల పల్లెల్లో తిరుగుతుంటే.. చాలా ఇళ్లకు కరెంటు లేదు. దీనివల్ల పిల్లలు చదవటానికి ఇబ్బంది పడుతున్నారనే విషయం తెలిసింది. ఉర్జా అనే సంస్థతో కలిసి దాదాపు 25 పల్లెలకు సోలార్‌ విద్యుత్‌ బల్బ్‌లను ఇచ్చాం. దాదాపు 3000 వేల ఇళ్లకు వెలుతురు వచ్చింది. నా విషయానికొస్తే పేదకుటుంబం కావటంతో చిన్నపుడు చదువుకోలేకపోయాననే బాధ ఉండేది. పదో తరగతిలో చదువు ఆపేశా. నా మాదిరి ఇబ్బంది పడకూడదనే.. పేదరికంపై యుద్ధం చేస్తున్నా. ఏమాటకామాట చెప్పాలి కానీ.. విద్యుత్‌ కాంతులు వచ్చిన ఆ పల్లెల్లోని పిల్లల కళ్లల్లో ఉండే ఆనందాన్ని చూశాక.. కష్టాలన్నీ మర్చిపోయా.

అదే మలుపు తిప్పింది...

మహారాష్ట్రలోని హింగ్లజ్‌వాడీ మా ఊరు. పదిహేడేళ్ల వయసులో పెళ్లయింది. డబ్బుల్లేకపోవటంతో కుటుంబంకోసం నావంతు సపోర్టు ఇవ్వాలనుకున్నా. అప్పుడే పూణెలోని ‘స్వయం శిక్షణ్‌ ప్రయోగ్‌’ అనే ఎన్జీవో సంస్థకు వెళ్లా. పల్లెల్లో ఉండే మహిళలకు అండగా నిలుస్తోందని అక్కడకు వెళ్లా. అదే నాజీవితానికి మలుపు. వాళ్ల శిక్షణతో, మహిళా సహకార సంఘాల సపోర్టుతో గాజుల వ్యాపారాన్ని ప్రారంభించా. ఇంటింటికి తిరిగి అమ్మేదాన్ని. మూడు రోజులకే ముప్ఫయివేల రూపాయలు సంపాదించేదాన్ని. పదకొండేళ్లపాటు అలానే ఉన్నా. ఆ తర్వాత నాలా ఇతర మహిళలు కూడా తమ కాళ్లపై నిలబడేలా చేయాలనే ఆలోచన వచ్చింది. ఆర్థిక స్వాంతంత్య్రం అవసరమని పల్లెల్లో ప్రతి మహిళకూ చెప్పేదాన్ని. చిన్న వ్యాపారాలు చేయాలంటే బ్యాంకులు ఇచ్చే లోన్లు గురించి చెప్పేదాన్ని. అలా మంచి పేరొచ్చింది.

అదే నా లక్ష్యం..

ఏడేళ్లకిందట పౌలీ్ట్ర ఫామింగ్‌లోకి వచ్చా. గాజుల వ్యాపారం కంటే మరింత పెద్దగా ఆలోచించాలనుకున్నా. గొర్రెల పెంపకం చేపట్టా. కమల్‌ పౌలీ్ట్ర కాస్త ‘ఏక్తా సఖి ప్రొడ్యూసర్‌ కంపెనీ’గా పేరు మార్చా. రెండు పౌల్ర్టీల నిర్వహణతో పాటు హాచరీస్‌ వ్యాపారాన్ని మొదలెట్టా. ఆర్గానిక్‌ ఫామింగ్‌, కంపోస్ట్‌ బిజినెస్‌, పిల్లలకు మెస్‌, కరెంటు బల్బుల వ్యాపారంలోకి అడుగెట్టా. ఉపాధి కల్పించటంతో పాటు సొంతంగా బతకటానికి శిక్షణా కార్యక్రమాలు చేపట్టా. ఎంతో మంది వారి జీవితాలను మార్చుకోవాలని నా దగ్గరకు వచ్చేవారు. మహిళకు ఉపాధి, పేదరికంపై యుద్ధమే నా కాన్సెప్ట్‌. ఈ క్రమంలో అవార్డులెన్నో వరించాయి. దేశంలో ప్రతిష్టాత్మకమైన నారీ శక్తి అవార్డు అందుకున్నా. 2025 సంవత్సరానికి కనీసం పదివేల మంది మహిళలకు శిక్షణ ఇవ్వాలన్నదే లక్ష్యం.’’

పూణెలోని ‘స్వయం శిక్షణ్‌ ప్రయోగ్‌’ అనే ఎన్జీవో సంస్థ శిక్షణతో, మహిళా సహకార సంఘాల సపోర్టుతో గాజుల వ్యాపారాన్ని ప్రారంభించా. ఇంటింటికి తిరిగి అమ్మేదాన్ని. మహిళకు ఉపాధి, పేదరికంపై యుద్ధమే నా కాన్సెప్ట్‌. కనీసం పదివేల మంది మహిళలకు శిక్షణ ఇవ్వాలన్నదే లక్ష్యం.’’

Updated Date - 2022-12-07T23:10:03+05:30 IST