Buddha: త్యాగనిరతి

ABN , First Publish Date - 2022-12-15T22:15:30+05:30 IST

బుద్ధుడు చెప్పిన మార్గాన్ని ‘మధ్యేమార్గం’ అంటారు. ఇది అతి విలాసాలకూ, అతి కఠోర దీక్షలకూ మధ్యస్థంగా ఉండే విధానం.

Buddha: త్యాగనిరతి

ధర్మపథం

బుద్ధుడు చెప్పిన మార్గాన్ని ‘మధ్యేమార్గం’ అంటారు. ఇది అతి విలాసాలకూ, అతి కఠోర దీక్షలకూ మధ్యస్థంగా ఉండే విధానం. బౌద్ధ ప్రపంచంలో... ప్రథమశ్రేణి భిక్షువులు, ప్రాథమిక స్థాయి భిక్షువులు, బౌద్ధాన్ని పాటించే గృహస్తులు (ఉపాసకులు), బౌద్ధాన్ని అభిమానించేవారు.. ఇలా రకరకాల స్థాయీ బేధాలతో ఉంటారు. బుద్ధుడు అందరికీ ఒకే నియమాన్ని చెప్పలేదు. గృహస్తులకు కఠిన నియమాలు ఉండవు. పంచశీల, ఇతర నియమాలు ప్రాథమిక స్థాయిలో ఉంటాయి. ఇక ఉన్నత శ్రేణి భిక్షువులకు రెండువందలకు పైగా నియమాలు ఉంటాయి. అవి కఠినంగానూ ఉంటాయి. వాటిని తూ.చ. తప్పకుండా పాటించాల్సిందే. అలాంటివారే బౌద్ధ సంఘాల్లో ఉండడానికి అర్హులు. భిక్షువు ఆ నియమాలను అతిక్రమించడం దోషం అవుతుంది. అది నేరంగా బౌద్ధ సంఘం పరిగణిస్తుంది. నియమాల విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శించేవారిని దిగువ శ్రేణిలో ఉంచుతారు.

ఈ నియమాలన్నీ మనస్సును అదుపు చేయడం మీదే ఆధారపడతాయి. మనో నిగ్రహం కోసం విశేష సాధన ఉంటుంది. భిక్షువు ఈ సాధన చేసి సాధించాల్సింది ఒక్కటే. అన్ని కోరికలనూ అదుపు చేసుకోవడం, విలాసాల జోలికి పోకుండా ఉండడం. బౌద్ధ ధర్మాన్ని స్థాపించిన బుద్ధుడు సాధారణ వ్యక్తి కాదు. ఒక యువరాజు, మహా పరాక్రమశాలి. కానీ... భిక్షువు అయ్యాక.. ఆయన భిక్షాపాత్ర పట్టుకొనే తిరిగాడు. వందలాది చిరుగుల్ని కుట్టుకున్న వస్త్రాన్నే ధరించాడు. అంటే కోరికల పట్ల అంత విముఖతతో ఉండేవాడు. ఇక, విలాస జీవితం అంటే భిక్షువులు సైతం భయపడేవారు. వ్యక్తిగత ఆస్తి అంటే పరమ దోషంగా, క్షమించరాని నేరంగా పరిగణించేవారు. వారు విలాసాలను ఎంత నేరంగా భావించేవారో తెలియజేసే కథ ఇది:

వారణాసిలో కాంచన కుమారుడు అనే పండితుడు ఉన్నాడు. అతను యుక్త వయసు వచ్చేసరికి... తక్షశిలకు పోయి, విద్యలను అభ్యసించి వచ్చాడు. కాంచనుడికి ఆరుగురు సోదరులు. అతనే పెద్దవాడు. విద్య నేర్చి వచ్చిన అతనికి వివాహం చేసి, ఇంటి బాధ్యతలు అప్పగించాలని తల్లితండ్రులు అనుకున్నారు. అతను కాదన్నాడు.

‘‘నేను గృహత్యాగం చేస్తాను. ధార్మిక జీవితం సాగిస్తాను. తమ్ముళ్ళకు ఆ బాధ్యత అప్పగించండి’’ అన్నాడు. అయితే, అతని తమ్ముళ్ళు కూడా గృహ బాధ్యతలకు అంగీకరించలేదు. అన్నగారి మార్గాన్నే అనుసరిస్తామన్నారు. వారి తల్లితండ్రులు వృద్ధులై... కాలం చేశారు. కుమారులు వారి ఉత్తర క్రియలను పూర్తిచేశారు. తమకు సంక్రమించిన ఆస్తినీ, ధనాన్నీ దానాలు చేసి, గృహత్యాగం చేసి, హిమాలయాలకు చేరారు. కఠోర తపస్సు చేశారు. ఒక చోట పర్ణశాల నిర్మించుకొని, అక్కడ దొరికేకందమూలాలు తింటూ కాలం గడుపుతున్నారు. వంతులవారీగా ఇద్దరు ముగ్గురు కందమూలాల కోసం ఉదయాన్నే అడవికి పోతారు. అందరికీ సరిపడేటన్ని దుంపలు తెస్తారు. ఏడు భాగాలు చేస్తారు. ఒక ప్రదేశంలో ఉంచుతారు. ఎవరి వాటా వారు తీసుకుంటారు. వారి జీవన పద్ధతులను ఆ ప్రాంతంలో సంచరించే మరో తాపసి... గమనించాడు. వారి స్వభావం ఎలాంటిదో పరీక్షించాలనుకున్నాడు. రహస్యంగా వచ్చి, ఒక భాగం దుంపలను తీసుకుపోయేవాడు. అలా రెండు మూడు రోజులు జరిగింది. దాంతో... తమలోనే ఎవరో ఇలా దొంగిలిస్తున్నారనే అనుమానం ఆ అన్నదమ్ములకు కలిగింది. అన్నగారైన కాంచనుడు అందరినీ సమావేశపరిచి, ‘‘ఎవరు ఇలా చేస్తున్నారు? ఇది తపోధర్మానికే చేటు’’ అన్నాడు.

అప్పుడు అందరికన్నా చిన్నవాడు లేచి ‘‘ఓ తపోధనుడా! నేను ఆ పని చేయలేదు. చేసి ఉంటే... నాకు గోసంపద కలుగుతుంది. వెండి, బంగారం లభిస్తాయి. భార్యా, సంతానం లభిస్తారు. నేను తపోభ్రష్టుణ్ణి అవుతాను’’ అని ఒట్టు పెట్టుకున్నాడు.

వెంటనే మరో సోదరుడు లేచి ‘‘ఆ పని నేను చేసి ఉంటే... చందన సుగంధాలు నాకు అబ్బుతాయి. భోగ భాగ్యాలు కలుగుతాయి. బహు సంతానం కలుగుతుంది. నా తపస్సు భ్రష్టం అవుతుంది’’ అన్నాడు. ‘‘నేను కందమూలాలను దొంగిలించినట్టైతే, ధనం, ఐశ్వర్యం కలుగుతాయి. సుక్షేత్రం నా సొంతమవుతుంది. నా తపస్సు నిష్ఫలం అవుతుంది’’ అని మరో సోదరుడు ఒట్టు వేశాడు. వెంటనే నాలుగోవాడు లేచి ‘‘తాపసులారా! నేను ఈ తప్పు చేసి ఉంటే... క్షత్రియత్వం కలుగుతుంది. రాజ్యం నా సొంతం అవుతుంది. అలా నా తపఃఫలం హరించుకుపోతుంది’’ అన్నాడు. ‘‘మాకూ అంతే... ఎంతో కీర్తి కలిగి, మహా యశస్సు పొందుతాం. రాజ పూజితులం అవుతాం. ఎన్నో బహుమతులు పొందుతాం. అలా మా తపస్సు హరించుకుపోతుంది’’ అన్నారు మిగిలినవారు. అలా వారంతా ఒట్లు పెట్టుకున్నారు.

ఆ తాపసులకు సంపదల పట్ల, సౌకర్యాల పట్ల, అధికారం పట్ల ఎంత విముఖత ఉందో ఆ కొత్త తాపసికి అర్థమైంది. కాషాయ వస్త్రాలు త్యాగానికి ప్రతీక. ఆ వస్త్రాలు ధరించడానికి వారే సరైన యోగ్యులని అతను భావించాడు. ఆ సోదరుల వద్దకు వచ్చి, విషయం చెప్పాడు. వారి త్యాగ నిరతిని కొనియాడాడు. కాంచన కుమారుడి పాదాలను తాకి నమస్కరించాడు.

బుద్ధుడు ఈ దృష్టాంతం చెప్పి ‘‘ఇలాంటి భిక్షువులతో నా భిక్షు సంఘం ఏర్పడింది. అందరు భిక్షువులూ ఇంతటి త్యాగంతో నడచుకోవాలి’’ అని చెప్పాడు.

-బొర్రా గోవర్ధన

Updated Date - 2022-12-15T22:29:50+05:30 IST