Almonds: బ్యూటిరేట్ ఉత్పత్తిని గణనీయంగా పెంచే బాదాములు.. అధ్యయనంలో తేలింది ఇదే!

ABN , First Publish Date - 2022-10-31T18:45:00+05:30 IST

బాదాములతో ఆరోగ్య ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. అది చేసే మేలు తాజా అధ్యయనంలో వెలుగు చూసింది. మనం తీసుకునే ఆహారం మన

Almonds: బ్యూటిరేట్ ఉత్పత్తిని గణనీయంగా పెంచే బాదాములు.. అధ్యయనంలో తేలింది ఇదే!

న్యూఢిల్లీ: బాదాములతో ఆరోగ్య ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. అది చేసే మేలు తాజా అధ్యయనంలో వెలుగు చూసింది. మనం తీసుకునే ఆహారం మన పేగుల్లోని సూక్ష్మజీవులు (గట్ మైక్రోబయోమ్)పై ప్రభావం చూపుతుంది. ఫలితంగా ఆరోగ్య ప్రయోజనాలతోపాటు వ్యాధుల నివారణ కూడా సాధ్యమవుతుంది. అయితే, ఇదెలా జరుగుతోంది? దీని వెనక ఉన్న కారణమేంటనేది ఇప్పటి వరకు ఎవరికీ అంతుచిక్కలేదు. తాజాగా, బాదాము (Almonds)లపై చేసిన అధ్యయనంలో ఈ విషయంలో కొంత స్పష్టత వచ్చింది. గట్ మైక్రోబయోమ్‌ను ఆరోగ్యంగా ఉంచే బ్యూటిరేట్‌ ఉత్పత్తిని బాదాములు గణనీయంగా పెంచుతాయని ఈ అధ్యయనంలో వెల్లడైంది. రోజుకు 56 గ్రాముల బాదాములు అంటే దాదాపు 46 బాదాములు తీసుకోవడం వల్ల బ్యూటిరేట్ గణనీయంగా పెరుగుతున్నట్టు తేలింది.

పెద్దపేగుల్లో ఉండే ప్రయోజనకారి షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్ (SCFA) రకం ఈ బ్యూటిరేట్. పేగుల్లో ఉండే మైక్రోబయోమ్‌లు ఫైబర్‌ను జీర్ణం చేసుకున్నప్పుడు బ్యూటిరేట్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఇంకా చెప్పాలంటే కొలనోసైట్స్‌కు ఈ ఫైబర్ ప్రధాన ఇంధన వనరు. మన ఆరోగ్యానికి ఇది విస్తృత ప్రయోజనాలను అందిస్తుంది. నిద్రను మెరుగు పరుస్తుంది. వాపులతో పోరాటం చేసేందుకు, పేగు క్యాన్సర్ ప్రమాదం తగ్గించేందుకు కూడా ఇది తోడ్పడుతుంది. అలాగే, స్టూల్ (మలం) అవుట్‌పుట్ పెరుగుతుంది. లండన్‌లోని కింగ్స్ కాలేజీకి చెందిన ప్రొఫెసర్ కెవిన్ వీలాన్ నేతృత్వంలోని పరిశోధకుల బృందం గట్‌మైక్రోబయోటాపై బాదాముల ప్రభావం, గట్ మైక్రోబయోటా వైవిధ్యత, గట్ ట్రాన్సిట్ టైమ్‌పై అధ్యయనం నిర్వహించింది. ఆల్మండ్‌ బోర్డ్‌ ఆఫ్‌ కాలిఫోర్నియా దీనికి అవసరమైన సహకారం అందించింది.

ఈ అధ్యయనం కోసం 87 మంది ఆరోగ్యవంతులైన 18 నుంచి 45 ఏళ్ల వయసున్న స్త్రీపురుషులను ఎంచుకున్నారు. వీరిని పలు గ్రూపులుగా విభజించి ఒక్కో గ్రూపునకు ప్రతి రోజు 56 గ్రాముల హోల్‌ అల్మండ్స్‌ అందిస్తే, మరో గ్రూప్‌కు బాదముల పొడి అందించారు. మరో గ్రూప్‌కు దీనికి సరిపోయే రీతిలో స్నాక్‌ మఫిన్స్‌ అందించారు. ప్రతి స్నాక్‌తో పాటుగా 100మిల్లీ లీటర్ల నీటిని కూడా తీసుకోవాల్సిందిగా వీరికి సూచించారు. అధ్యయనంలో భాగంగా ఫీకల్‌ బైఫిడో బ్యాక్టీరియా, ఫీకల్‌ మైక్రోబయోటా కంపోజిషన్‌, డైవర్సిటీ, ఫీకల్‌ ఎస్‌సీఎఫ్‌ఏ, హోల్‌గట్‌ ట్రాన్సిట్‌ టైమ్‌, గట్‌ పీహెచ్‌, స్టూల్ ఔట్‌పుట్‌ (ఫ్రీక్వెన్సీ, స్థిరత్వం రెండూ),గట్‌ లక్షణాలు పరిశీలించారు.

బాదాములు తీసుకున్న వారిలో బ్యూటిరేట్‌ గణనీయంగా వృద్ధి చెందడంతో పాటు స్టూల్‌ ఫ్రీక్వెన్సీ కూడా వృద్ధి చెందింది. అంతేకాదు, బాదములు తినడం వల్ల ఎలాంటి ప్రతికూల ప్రభావాలూ లేకుండా ఫైబర్‌ను పెంచడానికి ఓ మార్గమని అధ్యయనకారులు కొనుగొన్నారు. ఇది మైక్రోబయోటా పనితీరుపై సానుకూల మార్పులను సూచిస్తుందని గుర్తించారు. బాదాములను తినడం వల్ల బ్యాక్టీరియల్ మెటబాలిజానికి ప్రయోజనం కలుగుతుందని గుర్తించినట్టు ప్రొఫెసర్‌ వీలాన్‌ పేర్కొన్నారు.

ఈ అధ్యయనంపై న్యూట్రిషన్, వెల్‌నెస్ కన్సల్టెంట్ షీలా కృష్ణస్వామి మాట్లాడుతూ.. బ్యూటిరేట్‌ అనేది షార్ట్‌ చైన్‌ ఫ్యాటీ యాసిడ్స్‌లో ఒకటని అన్నారు. ఉదర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. బాదముల వల్ల అదనపు ప్రయోజనాలైన ముఫా, టోటల్‌ ఫైబర్‌, పొటాషియం, మెగ్నీషియం, ఇతర పోషకాలు కూడా లభిస్తాయని అన్నారు. ప్రతి వంద గ్రాముల బాదాముల్లో 3.5 గ్రాముల ఫైబర్‌తోపాటు 15 అత్యవసర పోషకాలు కూడా ఉంటాయన్నారు.

Updated Date - 2022-10-31T18:45:02+05:30 IST