సంక్రాంతి బెర్తులన్నీ ఫుల్‌!

ABN , First Publish Date - 2022-06-26T09:04:58+05:30 IST

సంక్రాంతికి ఊరెళ్లాలంటే... మూడు నెలల ముందు రైల్వే టికెట్‌ రిజర్వేషన్‌ చేయించుకొంటే సరిపోతుంది.

సంక్రాంతి బెర్తులన్నీ ఫుల్‌!

సంక్రాంతికి ఊరెళ్లాలంటే... మూడు నెలల ముందు రైల్వే టికెట్‌ రిజర్వేషన్‌ చేయించుకొంటే సరిపోతుంది. ఆలస్యమయ్యే కొద్దీ.. టికెట్ల కోసం కటకట మొదలైపోతుంది. అయితే... సినిమాలకు మూడు నెలలు సరిపోవు. బెర్తుల్ని ముందే బుక్‌ చేసుకోవాలి. చిత్రసీమకు చెందినంత వరకూ సంక్రాంతి తిరుగులేని సీజన్‌. ఈ పండక్కి తమ సినిమాని విడుదల చేయాలని నిర్మాతలు కలలు కంటుంటారు. హీరోలకు ‘సంక్రాంతి సెంటిమెంట్‌’ సరేసరి. పండక్కి సినిమా వచ్చి హిట్టయితే.. కాసుల వర్షమే. అందుకే అందరి దృష్టీ ముగ్గుల పండగ మీదే. కాబట్టే... పండగ కోసం ముందే మేల్కొని, తమ సినిమాల్ని సిద్ధం చేసే పనిలో పడతారు. ఈసారీ అదే జరుగుతోంది. సంక్రాంతికి ఇంకా ఆరేడు నెలల సమయం ఉంది. ఇప్పుడే ‘పండక్కి వచ్చేస్తున్నాం..’ అంటూ సంకేతాలు ఇచ్చేసి, యుద్ధానికి సన్నద్ధం అవుతున్నారు. ఇప్పటికే చాలా సినిమాలు సంక్రాంతి బరిలో నిలిచామంటూ ప్రకటించేశాయి. 2023 సంక్రాంతి... సినిమా సంబరాలు ఎక్కువగానే కనిపించడం ఖాయం అనిపిస్తోంది.


ప్రతీ యేడాదీ సంక్రాంతి సీజన్‌తోనే సినిమా క్యాలెండర్‌ మొదలవుతుంది. తెలుగువారికి అత్యంత ముఖ్యమైన పండుగల్లో సంక్రాంతి ఒకటి. స్కూలు, కాలేజీలకు వరుసగా సెలవలు వస్తాయి. కొత్త ధాన్యం ఇంటికొచ్చే వేళ. కొత్త అల్లుళ్లతో తెలుగు లోగిళ్లన్నీ కళకళలాడే రోజులు. కోడి పందేలు ఒక వైపు.. కొత్త సినిమాలు ఒకవైపు. ఇంతకంటే గొప్ప పండుగ ఏముంటుంది? సంక్రాంతికి సినిమా వచ్చి.. హిట్టయితే... ఆ సినిమాకి భారీ వసూళ్లు దక్కడం ఖాయం. ఎన్ని సినిమాలొచ్చినా.. ఆదరించేంత గొప్ప మనసు.. తెలుగు ప్రేక్షకులది. అందుకే సంక్రాంతి అనగానే విరివిగా పెద్ద సినిమాలొస్తాయి. భోగి, సంక్రాంతి, కనుమ.. ఇలా ఒక్కో పండక్కి ఒక్కో సినిమాని విడుదల చేసుకోవచ్చు. ఒకే రోజు రెండు పెద్ద సినిమాలూ చూసే అవకాశం సంక్రాంతి సీజన్‌లోనే దక్కుతుంది. అందుకే ప్రతీ యేటా సంక్రాంతికి థియేటర్లన్నీ కళకళలాడుతూ కనిపిస్తాయి. ఈసారీ అదే జరగబోతోంది. 2023 సంక్రాంతికి భారీ చిత్రాలు వరుస కట్టబోతున్నాయి.


మెగా ఫ్యామిలీ నుంచి మూడు...

ఈసారి సంక్రాంతి బరిలో చిరంజీవి సినిమా నిలుస్తోంది. ఆయన నటిస్తున్న 154వ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. బాబి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం కోసం ‘వాల్తేరు వీరయ్య’ అనే పేరు పరిశీలనలో ఉంది. మైత్రీ మూవీస్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రుతిహాసన్‌ కథానాయిక. ఫుల్‌ మాస్‌ మసాలా సినిమా ఇది. పండక్కి ఇలాంటి చిత్రాలకు ఎక్కువ గిరాకీ. పైగా చిరు సినిమా సంక్రాంతికి విడుదలై చాలాకాలమైంది. అందుకే ఈసారి ఎలాగైనా చిరు సినిమాని పండక్కి  దించేయాలని భావిస్తున్నారు. మరో రకంగానూ ఈ సంక్రాంతి మెగా అభిమానులకు ప్రత్యేకంగా నిలవబోతోంది. ఎందుకంటే పవన్‌ కల్యాణ్‌ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’నీ సంక్రాంతికే విడుదల చేయాలని అనుకుంటున్నారు. క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. 2022లోనే ఈ సినిమా రావాలి. కానీ చిత్రీకరణ ఆలస్యమవ్వడంతో తదుపరి టార్గెట్‌ 2023 సంక్రాంతి అయ్యింది. చారిత్రక నేపథ్యంలో సాగే సినిమా ఇది. భారీ బడ్జెట్‌ కేటాయించారు. ఇంత బడ్జెట్‌ని రాబట్టాలంటే సంక్రాంతికి మించిన సీజన్‌ లేదు. అందుకే... పవన్‌ లక్ష్యం కూడా సంక్రాంతినే అయ్యింది. ‘ఉప్పెన’తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మరో మెగా హీరో.. వైష్ణవ్‌ తేజ్‌. తను కథానాయకుడిగా ఓ కొత్త చిత్రం ఇటీవలే పట్టాలెక్కింది. ఈ చిత్రాన్నీ సంక్రాంతికే విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించారు. అంటే... మెగా ఫ్యామిలీ నుంచి మూడు సినిమాలు ఈ సంక్రాంతి పండక్కి రాబోతున్నాయన్నమాట. 


భారీ సినిమాలే అన్నీ!

సంక్రాంతి అంటేనే పెద్ద సినిమాల పండగ. స్టార్‌ హీరోల చిత్రాలే ఎక్కువ కనిపిస్తాయి. ఈసారీ అంతే. అన్నీ భారీ బడ్జెట్‌ చిత్రాలే. అందులో.. ‘ఆది పురుష్‌’ ఒకటి. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రాల్లో ‘ఆదిపురుష్‌’ ఒకటి. ప్రభాస్‌ సినిమా అంటే... మినిమం రూ.300 కోట్ల బడ్జెట్‌ తేలుతోంది. ‘ఆదిపురుష్‌’ అయితే రూ.500 కోట్లు దాటేసింది. పాన్‌ ఇండియా ప్రాజెక్టు కాబట్టి ఆ మాత్రం ఖర్చు పెట్టడం సమంజసమే. అదంతా తిరిగి రాబట్టుకోవాలంటే సంక్రాంతి సీజన్‌లో విడుదల చేయడమే బెటర్‌ ఆప్షన్‌. అందుకే 2023 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది. రామాయణ ఇతివృత్తం ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది. బాలీవుడ్‌లోని బడా స్టార్స్‌ ఈ చిత్రంలో కనిపిస్తున్నారు. ప్రభాస్‌ సినిమా, అందులోనూ పాన్‌ ఇండియా స్థాయి. దానికి తోడు అందరికీ ఇష్టమైన రామాయణ నేపథ్యం. పండక్కి ఇంతకు మించిన సినిమా ఏముంటుంది?

దక్షిణాదిన భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రాల్లో ‘వారసుడు’ ఒకటి. తమిళ సూపర్‌ స్టార్‌ విజయ్‌ తొలిసారి తెలుగులో నటిస్తున్న చిత్రమిది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. దిల్‌ రాజు నిర్మాత. ఆయనకు సంక్రాంతిపై గురి ఎక్కువ. దిల్‌ రాజు నిర్మాణంలో వచ్చిన సినిమాలు చాలా వరకూ సంక్రాంతికి విడుదలయ్యాయి. అవన్నీ సూపర్‌ హిట్‌ అయ్యాయి. దాంతో ఆయనకు సంక్రాంతి సెంటిమెంట్‌ మొదలైంది. విజయ్‌ సినిమానీ సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు. మరో విజయ్‌.. అంటే మన విజయ్‌ దేవరకొండ సినిమా కూడా సంక్రాంతినే టార్గెట్‌ చేసింది. విజయ్‌ దేవరకొండ - సమంత జంటగా ‘ఖుషి’ అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. శివ నిర్వాణ దర్శకుడు. తనవన్నీ పూర్తిగా ఫ్యామిలీ మార్కు సినిమాలే. సంక్రాంతికి ఫ్యామిలీ డ్రామాలు బాగా వర్కవుట్‌ అవుతాయని చరిత్ర చెబుతోంది. అందుకే ‘ఖుషి’ కూడా ఈ పండక్కి  వస్తే బాగుంటుందన్నది నిర్మాతల ఆలోచన. 

ప్రస్తుతానికి ఈ సినిమాలన్నీ సంక్రాంతి బరిలో ఉన్నట్టే. వీటిలో ఒకట్రెండు పోటీ నుంచి చివరి నిమిషాల్లో తప్పుకొన్నా, మిగిలినవన్నీ వచ్చేస్తాయి. వీటితో పాటు చివరి నిమిషంలో టికెట్‌ ఖాయం చేసుకొనే సినిమాలు ఇంకొన్ని ఉంటాయి. ఎలా చూసినా 2023 సంక్రాంతి.. కొత్త సినిమాలతో కళకళలాడడం ఖాయం. కొత్త యేడాది చిత్రసీమకు మంచి ప్రారంభం కావాలంటే... సంకాంత్రికి ఎక్కువ సినిమాలు రావాలి. వాటిలో హిట్లూ పడాలి. మరి వచ్చే సంక్రాంతి జాతకం ఎలా ఉంటుందో!?

Updated Date - 2022-06-26T09:04:58+05:30 IST