అడ్డసరం ఆకులకూరతో ఉబ్బసం మాయం

ABN , First Publish Date - 2022-07-09T06:27:43+05:30 IST

అడ్డసరం ఆకుల గురించి కరోనా ఉధృతంగా ఉన్న రోజుల్లో విశేష ప్రచారం జరిగింది.

అడ్డసరం ఆకులకూరతో ఉబ్బసం మాయం

డ్డసరం ఆకుల గురించి కరోనా ఉధృతంగా ఉన్న రోజుల్లో విశేష ప్రచారం జరిగింది. ఊపిరితిత్తుల్లో జబ్బులకి ఇది తిరుగులేని ఆయుర్వేద ఔషధం. అడ్డసరం పెరటి మొక్కే. సరిహద్దు కంచెలుగా ఈ మొక్కల్ని పెంచుకుంటారు కూడా! దగ్గు, ఉబ్బసం, ఊపిరితిత్తుల వ్యాధులు, రక్తస్రావ వ్యాధులు, కామెర్లు, షుగరు వ్యాధి, వాంతులు, చర్మ వ్యాధులు, జ్వరాలు, హృదయ వ్యాధులు, గొంతు వ్యాధులు, మూత్రవ్యాధుల్లో ఈ మొక్క ఆకులు, పూలు, వేళ్లు కూడా పనిచేస్తాయి. తగిన మోతాదులో తీసుకుంటే ఇన్సులిన్‌ ఆధారిత షుగరు వ్యాధిలో కూడా ఇది బాగా పనిచేస్తుంది. దీంట్లో వాసినైన్‌ ఇంకా మరికొన్ని రసాయనాలున్నాయి. ఇవి ఈ ఫలితాలు కలగటానికి కారణంగా భావిస్తున్నారు. వీటికి సూక్ష్మజీవి నాశక గుణాలు, పుండును మాన్పే గుణాలు, కాలేయం, ప్లీహం వంటి అవయవాల్ని బలసంపన్నం చేసే గుణాలు, విషదోషాలను హరించే గుణాలు, కఫాన్ని ఎసిడిటీని తగ్గించే గుణాలు ఉన్నాయి. దీని ఆకులతో ఇనుముని శుద్ధి చేస్తారు. ఆయుర్వేదంలో వాసారిష్ట, వాసావలేహ్యం, మహా విషగర్భ తైలం లాంటి ఔషధాలు తయారౌతాయి. భారత ఉపఖండంలో ప్రసిద్ధ ఔషధం ఇది. దీని ఆకులు చేదుగా ఉంటాయి. కఫ దోషాన్ని, పైత్య దోషాన్ని పోగొడతాయి. అందుకని సాధారణంగా దీన్ని ఆహార యోగ్యమైనదిగా భావించం మనం. ఆ చేదుని తీసేయగలిగితే అడ్డసరం గొప్ప ఆహార ఔషధం కాగలుగుతుంది కదా! 


ఇలా వండుకోవాలి...

అడ్డసరం లేత ఆకుల్ని ఆహారపదార్థంగా తయారు చేసుకోవటం గురించి నలుడు విశేషంగా వివరించాడు. ఆయన ఈ ఆకుల్లోని చేదుని తీసేయటానికి చెప్పిన ఉపాయం గొప్పది. లేత అడ్డసరం ఆకుల్ని శుభ్రంగా కడిగి సున్నపు నీళ్లలో ఉడికిస్తే వాటిలో ఉన్న చేదు పోతుంది. అలా ఉడికిన ఆకుల్ని ముక్కలుగా తరిగి, మంచినీళ్ళలో వేసి చల్లకవ్వంతో బాగా చిలకాలి. అందువలన వాటిలో మిగిలి ఉన్న సున్నం, చేదు బయటకు వచ్చేస్తాయి. తరువాత ఈ ఆకుల్లో మీకు ఇష్టమైన సుగంధ ద్రవ్యాలు కలిపి కూరగా పప్పుగా పచ్చడిగా, పులుసుకూరగా కూడా వండుకోవచ్చు.  ఇలాంటి గొప్ప ఔషధ ద్రవ్యాలను ఆహారపదార్థాలుగా మార్చుకునే ఉపాయాలను తెలియజెప్పిన ఏకైక గ్రంథం నలుడి పాకదర్పణం.  వెయ్యేళ్ళ క్రితం సమస్త మానవాళి ఆరోగ్య పరిరక్షణకు జరిగిన గొప్ప కృషి ఇది. అడ్దసరం తాజా లేతాకులతో కూరగా వండుకునే అవకాశం లేనివారు దీని ఆకులను ఎండించి టీ కాచుకుని తాగితే పైన చెప్పిన వ్యాధులన్నింటిలోనూ ఉపశమనం కనిపిస్తుంది. అరచెంచాపొడి వేసుకుంటే సరిపోతుంది.  కఫదోషలన్నింటికీ ఇది గొప్ప ఔషధం. కరోనా వలన కలిగిన ఊపిరితిత్తుల లక్షణాలతో బాధపడ్తున్న వారు  ఇప్పుడైనా దీన్ని వాడుకోవచ్చు. రక్తంలో షుగరు స్థాయిని బాగా తగ్గించే గుణం ఉంది కాబట్టి దీన్ని ఒకేసారి ఎక్కువ తినకూడదు. షుగరు రోగులకు ఇది దివ్యౌషధమే! ఈ ఆకుల్లో చేదుని నలుడు చెప్పిన ప్రకారం తొలగించి, హల్వాగానో, లడ్డుగానో తయారు చేసుకుని తగిన మోతాదులో రోజూ తీసుకుంటే కచ్చితంగా కఫం తగ్గుతుంది. ఊపిరితిత్తులు, లివరు, మూత్ర పిండాలు బలసంపన్నం అవుతాయి. గాయకులకు గొంతు శ్రావ్యంగా అయ్యేలా చేస్తుంది. రక్తస్రావాలు అయే వ్యాధుల్లో మేలు చేస్తుంది. అలర్జీల తీవ్రతను తగ్గిస్తుంది. తెల్లవారుజామున తుమ్ములతో బాధపడేవారికి ఇది మేలు చేస్తుంది. అజీర్తి, గ్యాసు, పేగుపూత, అమీబియాసిస్‌ వ్యాధులున్నవారికి మంచి చేస్తుంది. 

గంగరాజు అరుణాదేవి

Updated Date - 2022-07-09T06:27:43+05:30 IST