నటుడు అర్జున్ సర్జాకు మాతృవియోగం
ABN , First Publish Date - 2022-07-24T08:04:15+05:30 IST
నటుడు అర్జున్ సర్జాకు మాతృవియోగం

ప్రముఖ నటుడు అర్జున్ సర్జాకు మాతృవియోగం కలిగింది. అర్జున్ తల్లి లక్ష్మీదేవమ్మ(85) బెంగళూరు జయనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. ప్రముఖ నటుడు శక్తిప్రసాద్ భార్య అయిన లక్ష్మీదేవమ్మ, వయోభారం కారణంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. అర్జున్ కుటుంబానికి వరుసగా దెబ్బలు పడుతున్నాయి. అర్జున్ మేనల్లుడు, కన్నడ హీరో చిరంజీవి సర్జా రెండేళ్లకిందట మృతి చెందారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో అర్జున్ మామ, ప్రముఖ నటుడు రాజేశ్ మృతి చెందారు. కుటుంబసభ్యులు ఆ బాధ నుంచి కోలుకునేలోపే అర్జున్ తల్లి లక్ష్మీదేవమ్మ కన్నుమూశారు. సమాచారం తెలియగానే శాండల్‌వుడ్ నటులు, దర్శక నిర్మాతలు సంతాపం తెలిపారు.
బెంగళూరు (ఆంధ్రజ్యోతి)