నలుగురు హీరోలను కలిపిన ఖైదీ

ABN , First Publish Date - 2022-10-02T07:00:18+05:30 IST

మెగాస్టార్‌ చిరంజీవి, దర్శకుడు విజయబాపినీడులది సక్సెస్‌ఫుల్‌ కాంబినేషన్‌.

నలుగురు హీరోలను కలిపిన ఖైదీ

మెగాస్టార్‌ చిరంజీవి, దర్శకుడు విజయబాపినీడులది సక్సెస్‌ఫుల్‌ కాంబినేషన్‌. ‘పట్నం వచ్చిన పతివ్రతలు’ సినిమాతో మొదలైన ఈ కలయిక ‘బిగ్‌బాస్‌’ వరకూ విజయవంతంగా కొనసాగింది. ఈ కాంబినేషన్‌లో వచ్చిన . ‘గ్యాంగ్‌ లీడర్‌’ సినిమా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అయింది. మిగిలిన సినిమాలు కూడా విజయవంతమైనా ‘బిగ్‌బాస్‌’ మాత్రం తీవ్రంగా నిరాశపరిచింది. ఈ సినిమా తర్వాత మళ్లీ చిరంజీవితో సినిమా తీయాలని విజయబాపినీడు ఎంతో ప్రయత్నించారు కానీ వర్కవుట్‌ కాలేదు. తన సినిమాలకు విజయ బాపినీడు పెట్టే టైటిల్స్‌ విభిన్నంగా ఉంటాయి. ‘డాక్టర్‌ ముద్దుకృష్ణ’ పేరుతో చిరంజీవి హీరోగా ఒక సినిమా ప్లాన్‌ చేశారు కానీ ఆ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కలేదు. చిరంజీవి, విజయబాపినీడు కాంబినేషన్‌లో వచ్చిన మరో హిట్‌ మూవీ ‘ఖైదీ నంబర్‌ 786’. ఈ చిత్రం షూటింగ్‌ 1987 అక్టోబర్‌ 25న వాహినీ స్టూడియోలో మొదలైంది. ఈ ప్రారంభోత్సవానికి ముగ్గురు అగ్ర హీరోలు కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు హాజరు కావడం విశేషం. హీరోలందరితో విజయబాపినీడుకు మంచి రిలేషన్స్‌ ఉండడం వల్లే ఈ కలయిక సాధ్యమైంది. చిరంజీవి, భానుప్రియపై చిత్రీకరించిన ముహూర్తపు షాట్‌కు కృష్ణంరాజు కెమెరా స్విచ్‌ఆన్‌ చేయగా, శోభన్‌బాబు తొలి క్లాప్‌ ఇచ్చారు. హీరో కృష్ణ తొలి షాట్‌కు గౌరవ దర్శకత్వం వహించారు. ఇలా నలుగురు అగ్రహీరోలు ఒకే వరుసలో నిలబడి గ్రూప్‌ ఫొటో దిగడం అభిమానులకు ఆనందం కలిగించిన అంశం.


నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజున అంటే 1988 జూన్‌ 10న ‘ఖైదీ నంబర్‌ 786’ విడుదల కావడం గమనార్హం. ఈ చిత్రం ఘన విజయం సాధించింది. సినిమాకు ఫస్ట్‌ హాఫ్‌, సెకండ్‌ హాఫ్‌ ఉన్నట్లే ఈ చిత్రం శత దినోత్సవాన్ని   ఉదయం, సాయంత్రం కూడా నిర్వహించి తన ప్రత్యేకతను మరోసారి చాటుకున్నారు విజయబాపినీడు.

Read more