పట్టు విడవడంకన్నా చావడం మేలన్నాడు

ABN , First Publish Date - 2022-09-17T07:53:25+05:30 IST

తెలంగాణ సాయుధ పోరాట వీరోచిత గాథలను గుర్తు చేసుకున్నప్పుడల్లా 96 ఏళ్ల పశ్య కన్నమ్మ కళ్లల్లో కాంతులు కనిపిస్తాయి. తుపాకీ పట్టి పోరు భూమిలో కొట్లాడిన ఆమె అన్న తలపునకొస్తే మాత్రం అవే కళ్లు వర్షిస్తాయి. ‘భూమి కోసం...

పట్టు విడవడంకన్నా చావడం మేలన్నాడు

తెలంగాణ సాయుధ పోరాట వీరోచిత గాథలను గుర్తు చేసుకున్నప్పుడల్లా 96 ఏళ్ల పశ్య కన్నమ్మ కళ్లల్లో కాంతులు కనిపిస్తాయి. తుపాకీ పట్టి పోరు భూమిలో కొట్లాడిన ఆమె అన్న తలపునకొస్తే మాత్రం అవే కళ్లు వర్షిస్తాయి. ‘భూమి కోసం... భుక్తి కోసం... వెట్టి చాకిరీ విముక్తి కోసం’ అంటూ ఆనాడు భూస్వామ్య వ్యవస్థను పెకలించడానికి పిడికిలెత్తిన వారిలో ఒకరైన కన్నమ్మ... ఆ పోరాట స్ఫూర్తిని ‘నవ్య’తో పంచుకున్నారు.


‘‘హుజూర్‌నగర్‌ తాలూకా చిలుకూరులో రావి నారాయణరెడ్డి అధ్యక్షతన 1941లో 8వ ఆంధ్ర మహాసభకు మా అన్న దొంతిరెడ్డి శంభిరెడ్డితో కలిసి నేనూ వెళ్లాను. అక్కడి నుంచి తిరిగొస్తూ ప్రగతిశీల భావాలను ఇంటికి తెచ్చాం. నా పుట్టిల్లు, మెట్టిల్లు హుజూర్‌నగరే. మా అన్నకు నా భర్త పశ్య రాంరెడ్డి మంచి స్నేహితుడు. ఇద్దరూ మొదట్లో కమ్యూనిస్టు పార్టీ సానుభూతిపరులు. కడవెండిలో దొడ్డి కొమరయ్య అమరుడైన తర్వాత కమ్యూనిస్టు సాయుధ దళాలు భూస్వాములపై పోరాటాన్ని ఉధృతం చేశాయి. అప్పుడు మా అన్న కూడా తుపాకీ పట్టి దొడ్డా నర్సయ్య దళంలో చేరాడు. నా భర్త బయట ఉండి, దళాలకు సహకరిస్తుండేవాడు. మా అన్న వాళ్లంతా కలిసి లింగగిరి, బేతవోలు, నడిగూడెం... వాటి చుట్టుపక్కల గడీలమీద దండెత్తి, కొన్ని వందల మందికి వెట్టిచాకిరీ నుంచి విముక్తి కల్పించారు. దేశ్‌ముఖ్‌ల ఆగడాలను అరికట్టారు. కొందరు నాయకులు కమ్యూనిస్టు పార్టీ సాహిత్యాన్ని, కరపత్రాలను మా ఇంటికి చేర్చేవారు.


వాటిని ఆంధ్రా ప్రాంతంలోని కమ్యూనిస్టు నాయకులకు అందించడం నా బాధ్యత. అలా పార్టీ పుస్తకాలను, కాగితాలను గంపలో పెట్టి... దానిమీద కండువా కప్పి, పైన ఎరువు వేసుకొని, ఎవరికీ అనుమానం రాకుండా రహస్యంగా మా చేను కాడికి తీసుకెళ్లేదాన్ని. మళ్లీ వాటిని జాగ్రత్తగా ఇనుప డబ్బాల్లో భద్రపరిచి, మా జొన్న చేలోనే గొయ్యి తీసి పెడితే, ఆంధ్రా కామ్రేడ్లు వచ్చి తీసుకెళ్లేవారు. అలా లేక్కలేనన్నిసార్లు సాయుధ పోరాటంలో రహస్య సమచారాన్ని బట్వాడా చేశాను. గదర్‌ వీరుల చరిత్ర వంటి పోరాట గాథల పుస్తకాలను ఒక చోట నుంచి మరొక చోటుకు తీసుకెళ్లి అందించాను. పార్టీ కరపత్రాలను పంచాను. రజాకర్ల కళ్లుగప్పి ఇదంతా చేయడం చాలా కష్టమే, కానీ ఇష్టంగానే పనిచేశాను. 


అప్పుడు చచ్చిపోవాలనుకున్నా... 

ఓసారి ఇంట్లో అబద్ధం చెప్పి, నన్ను మా అన్న జగ్గయ్యపేటలో ‘మా భూమి’ నాటకానికి తీసుకెళ్లాడు. వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా నేనూ పోరాడాలని అప్పుడే అనుకున్నాను. బహుశా ఆ ధైర్యమే నన్ను ముందుకు నడిపిందేమో. లింగగిరిలో ఇద్దరు దొరలను స్థానిక ప్రజలు చంపడంతో, రజాకర్లు మా అన్నావాళ్లమీద కక్ష కట్టారు. శంభిరెడ్డి ఆచూకీ చెప్పమంటూ ఓ రోజు మా ఇంటి మీద దాడి చేసి, మా నాన్న తల పగలగొట్టారు. అప్పుడు ఏం చేయాలో తోచక, తలకు తువ్వాలు చుట్టి, హుజూర్‌నగర్‌కు అడ్డ తొవ్వన 25 కిలోమీటర్లు నడుచుకుంటూ జగ్గయ్యపేట తీసుకెళ్లి, నాన్నను ఆస్పత్రిలో చేర్పించాను. నాకు కన్నీళ్లు వచ్చాయి కానీ భయమేయలేదు. అదొక్కసారేకాదు... మా ఇంటి మీద ఆరేడుసార్లు రజాకర్లు దాడి చేశారు.


ఒకసారి నన్నూ పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లబోతుంటే... వాళ్ల చేతుల్లో హింస పడేకన్నా ఇంటి మీదెక్కి దూకి చచ్చిపోవాలనుకుని పరిగెత్తబోయాను. అంతలో రజాకర్లు పట్టుకొని నిర్బంధించారు. తీరా స్టేషన్‌కు తీసుకెళ్లాక ఇంకో అమీన్‌ వదిలేయమనడంతో, అదే రోజు నన్ను వాళ్లు విడుదల చేశారు. రజాకర్లంతా ముస్లింలే అయినా... వాళ్లు పనిచేసిందంతా హిందూ మతానికి చెందిన దేశ్‌ముఖ్‌లు, దొరల కోసమే. కనుక తెలంగాణ సాయుధ పోరాటమంటే భూస్వామ్యానికి వ్యతిరేకంగా సాగిన ఉద్యమమే కానీ ఓ మతానికి సంబంధించింది కాదు. ఇది ఇప్పటి తరం అర్థం చేసుకోవాలి. 


మా అన్నను చంపారు... 

దొడ్డా నర్సయ్య దళంలో మా అన్నతో పాటు దాసరి లింగన్న, బొమ్మకంటి గోపన్న అంటే రజాకర్లకే కాదు, దొరలకూ హడల్‌. అందులోనూ ఆర్మీలో పని చేసే గోపన్న కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతం నచ్చి, సర్వీస్‌ రివాల్వర్‌తో సహా వచ్చి, పోరాటంలోకి దిగాడు. ఆ దళాన్ని మట్టుబెట్టాలని కుట్ర పన్నిన రజాకర్లకు మన్యం నర్సిరెడ్డి అనే ఓ ద్రోహి సాయపడ్డాడు. కమ్యూనిస్టు సానుభూతి పరుడిగా నటించిన ఆ ద్రోహి మా అన్నావాళ్లను నమ్మించి... 1948 ఫిబ్రవరి 22న చింతలమ్మ గుడి దగ్గరలోని ఆయన ఇంటికి భోజనానికి పిలిచాడు. అదే అదనుగా రజాకర్లు మా అన్న శంభిరెడ్డితో పాటు లింగన్న, గోపన్నలను పొట్టన పెట్టుకున్నారు. అదివరకు కొందరు పోరాట యోధులు అమరులైనప్పుడు నాకు భయమేసి, సాయుధ పంథాను వదిలి బయటకు రమ్మని మా అన్నను బతిమాలాను. ‘పట్టిన పట్టు విడవడంకన్నా చావడం మేలు’ అని మా అన్న చెప్పిన మాట నాకిప్పటికీ జ్ఞాపకమే. ఓ అమరవీరుడి తోబుట్టువుగా గర్వపడుతుంటా. 


జయసూర్యను సాయం అడిగా...

సాయుధ పోరాటానికి మద్దతుగా పనిచేస్తున్న నా భర్తను అరెస్టు చేసి, ముషీరాబాద్‌ జైలులో బంధించారు.  అప్పటికే ఆయన ఒళ్లంతా వాచి, అవస్థ పడుతున్నాడని వేరేవాళ్లు చెప్పగా విని తల్లడిల్లిపోయా. ఒక్కసారి ఆయన్ని చూడనివ్వండని కాళ్లావేళ్లా పడినా పోలీసులు కనికరించలేదు. దాంతో అబిడ్స్‌లోని సరోజినీదేవి నాయుడు కుమారుడు డాక్టర్‌ జయసూర్యను కలిసి నా కష్టం చెప్పాను. అప్పుడు ఆయన నాకు ధైర్యం చెప్పడంతో పాటు పోలీసు అధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. ఆ సమయంలో రెండు రోజులు గోల్డెన్‌ త్రెషోల్డ్‌లోనే ఉన్నాను. జయసూర్య భార్య మమ్మల్ని ఆప్యాయంగా చూశారు. పోలీసు యాక్షన్‌ తర్వాత కొన్నాళ్లకు నా భర్తను విడుదల చేశారు. ఇలా రజాకర్ల దాడులను బాగానే ఎదుర్కొన్నాం. ఇప్పటికీ అవి గుర్తొస్తే, కళ్ళనీళ్లు ఆగవు. 
మహిళా మండలిలో...

నేను మహిళా సంఘం సభలు, సమావేశాల్లో చురుగ్గా పాల్గొనేదాన్ని. రావి నారాయణరెడ్డి, మగ్దూం మొహియుద్దీన్‌ వంటి పెద్ద నాయకులు నన్ను తోబుట్టువులా ఆదరించేవారు. 1946లో సుందరయ్య, పీసీ జోషి మా ఊరి పక్కనే లింగగిరికి వచ్చారు. హుజూర్‌నగరే కాదు, మా చుట్టుపక్కల ఒక్కో గ్రామానిది ఒక్కో పోరాట చరిత్ర. అదంతా భారత ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ నేపథ్యమే. కమ్యూనిస్టు పార్టీ సాయుధ పోరాటాన్ని విరమించాక కూడా మా కుటుంబమంతా ఆ పార్టీతోనే కలిసి నడుస్తున్నాం. హుజూర్‌నగర్‌లో నలభై ఏళ్లుగా ‘అరుణ అసఫ్‌ అలీ’ పేరుతో మహిళా సంఘం నడుపుతున్నాను. అందులో అమ్మాయిలకు ఉచితంగా కుట్లు, అల్లికలు, కంప్యూటర్‌ కోర్సులు నేర్పిస్తున్నాం. ఇప్పుడు ఆ కేంద్రం బాధ్యతలను నా కుమారుడు శ్రీనివాసరెడ్డి, కోడలు అనితలు చూస్తున్నారు.


అక్కడే మా అన్నయ్య శంభిరెడ్డి స్మారకంగా హాలు కట్టి, ఉచిత కంటి పరీక్షల కేంద్రాన్ని ప్రారంభించబోతున్నాం. నా కూతురు పశ్య పద్మది కులాంతర వివాహం. మా అమ్మాయి ఆ రోజుల్లోనే ఎమ్మెస్సీ కెమెస్ట్రీ చదివింది. మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చినా, వాటన్నిటినీ కాదనుకొని, కమ్యూనిస్టు పార్టీ కోసం పనిచేస్తోంది. ఒక అమర వీరుడికి చెల్లిగా, ఓ ఉద్యమకారిణికి తల్లిగా ఇంతకు మించిన జీవితం ఇంకేముంటుంది.’’   


కొందరు నాయకులు కమ్యూనిస్టు పార్టీ సాహిత్యాన్ని, కరపత్రాలను మా ఇంటికి చేర్చేవారు. వాటిని ఆంధ్రా ప్రాంతంలోని కమ్యూనిస్టు నాయకులకు అందించడం నా బాధ్యత. అలా పార్టీ పుస్తకాలను, కాగితాలను గంపలో పెట్టి... దానిమీద కండువా కప్పి, పైన ఎరువు వేసుకొని, ఎవరికీ అనుమానం రాకుండా రహస్యంగా మా చేను కాడికి తీసుకెళ్లేదాన్ని. 


కె.వెంకటేశ్‌ , ఫొటోలు: అలువాల రవి

Read more