Tawang Face-off : తవంగ్‌ సెక్టర్‌లో భారత్-చైనా సైనికుల ఘర్షణపై ఎవరేమన్నారు?

ABN , First Publish Date - 2022-12-13T14:15:08+05:30 IST

అరుణాచల్ ప్రదేశ్‌లోని తవంగ్ సెక్టర్‌లో చైనా సైనికులు ఘర్షణకు దిగిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు

Tawang Face-off : తవంగ్‌ సెక్టర్‌లో  భారత్-చైనా సైనికుల ఘర్షణపై ఎవరేమన్నారు?
Indian Army, China PLA

న్యూఢిల్లీ : అరుణాచల్ ప్రదేశ్‌లోని తవంగ్ సెక్టర్‌లో చైనా సైనికులు ఘర్షణకు దిగిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) మంగళవారం లోక్‌సభలో మాట్లాడుతూ, చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) దళాలు వాస్తవాధీన రేఖను అతిక్రమించాయని, దీనిని మన రక్షణ దళాలు దీటుగా తిప్పికొట్టాయని, చైనా సైన్యాన్ని తరిమికొట్టాయని చెప్పారు. 2022 డిసెంబరు 9న జరిగిన ఈ సంఘటనలో భారతీయ సైనికులు ఎవరూ తీవ్రంగా గాయపడలేదని చెప్పారు. ఎటువంటి అతిక్రమణలనైనా దీటుగా ఎదుర్కొనే సత్తా భారత సైన్యానికి ఉందన్నారు. మన సైనికుల ధైర్యసాహసాలకు గౌరవ వందనం చేస్తున్నామన్నారు. గెలిచే అవకాశం చైనాకు ఇవ్వబోమని హామీ ఇస్తున్నానని చెప్పారు.

ఈ ఘర్షణ నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీల స్పందనలను పరిశీలిద్దాం.

సత్తా, సున్నిత సామర్థ్యాలను భారత్ ప్రదర్శిస్తోంది : కేంద్ర మంత్రి రిజిజు

కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు (Kiren Rijiju) మీడియాతో మాట్లాడుతూ, అరుణాచల్ ప్రదేశ్ భారత దేశంలో అంతర్భాగమని చెప్పారు. భారత దేశ చరిత్రను మర్చిపోతున్నారని, భారత దేశం సత్తాను, సున్నితమైన శక్తిసామర్థ్యాలను ప్రదర్శిస్తుందని అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) బలమైన నాయకత్వాన్ని యావత్ ప్రపంచం చూస్తోందన్నారు. మనం కలిసికట్టుగా ఉంటే బలంగా ఉంటామని, విడిపోతే విఫలమవుతామని చెప్పారు.

ఇరు దేశాల సంబంధాలపై ప్రభావం : బీజేపీ ఎంపీ తపిర్ గావో

అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎంపీ తపిర్ గావో సోమవారం మాట్లాడుతూ, వాస్తవాధీన రేఖ (LAC) వెంబడి జరిగే ఇటువంటి ఘర్షణలు, సంఘటనల వల్ల భారత్-చైనా సంబంధాలపై ప్రభావం పడుతుందని చెప్పారు. సమస్యలను పరిష్కరించుకోవడానికి ఇరు దేశాల ప్రభుత్వాలు కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) ఇటువంటి పనులను కొనసాగిస్తే, ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతింటాయన్నారు.

ఈ ఘర్షణపై లోక్‌సభలో చర్చించేందుకు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ వాయిదా తీర్మానాన్ని ఇచ్చారు. ఈ విషయాన్ని ఆయన ఓ ట్వీట్ ద్వారా తెలిపారు. చైనా 2017లో డోక్లాంలోనూ, 2020 ఏప్రిల్‌లో లడఖ్‌లోనూ ఇదే విధంగా చేసిందన్నారు. అరుణాచల్ ప్రదేశ్‌లో మన బలాన్ని ఎందుకు పెంచలేదని ప్రశ్నించారు. ఇది తాత్కాలికమేనని, చైనీయులు తిరిగి వారి అసలు చోటుకు వెళ్లిపోతారని మనం (భారత్) ఆశిస్తున్నట్లు తనకు తెలిసిందని చెప్పారు. చైనా కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ సమావేశాల్లో ఆ దేశాధ్యక్షుడు జీ జిన్‌పింగ్ (Xi Jinping)ను మళ్ళీ మరో ఐదేళ్ళకు ఎన్నుకున్నారని, అంతకుముందే అంటే 2022 ఆగస్టులో అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా తన దళాలను 75 శాతం పెంచుకుందని తెలిపారు.

తవంగ్ ఘర్షణపై మాయావతి ఆందోళన

తవంగ్ సెక్టర్‌లో డిసెంబరు 9న భారత్-చైనా దళాల మధ్య జరిగిన ఘర్షణ పట్ల బీఎస్‌పీ చీఫ్ మాయావతి ట్విటర్ వేదికగా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చైనా దళాలకు దీటుగా సమాధానం చెప్పిన భారతీయ దళాలను ఆమె ప్రశంసించారు. ఈ ఘర్షణలో అనేక మంది సైనికులు గాయపడినట్లు వచ్చిన వార్తలు తీవ్ర ఆవేదన కలిగిస్తున్నాయన్నారు. ఉక్రెయిన్ యుద్ధం వల్ల పర్యవసానాలను ప్రపంచం ఎదుర్కొంటున్న సమయంలో భారత్-చైనా సైన్యాల మధ్య కొత్త ఘర్షణ నుంచి తక్షణమే దౌత్య మార్గంలో బయటపడటం అవసరమని చెప్పారు. చైనాతో జరిగిన తాజా ఘర్షణలో సైతం భారత సైన్యం తన కీర్తి, ప్రతిష్ఠలకు తగినట్లుగా మరోసారి దీటుగా సమాధానం చెప్పిందన్నారు. భారత సైన్యం చర్యలు ప్రశంసనీయమని చెప్పారు. ఇప్పుడు ఇక దౌత్యపరమైన నైపుణ్యాన్ని ప్రదర్శించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, దేశం ఇప్పుడు ఆశిస్తున్నది అదేనని తెలిపారు. మీ మేధాశక్తిని మరింత బలోపేతం చేసుకోవలసిన అవసరం ఉందన్నారు.

కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి స్పందన

లోక్‌సభలో కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ, ప్రభుత్వం ఈ ఘర్షణపై ప్రకటన చేయాలన్నారు. ఇటువంటి ఘర్షణలు తరచూ జరుగుతున్నాయన్నారు. మన భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందన్నారు. లడఖ్, ఉత్తరాఖండ్‌ల నుంచి ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్‌కు చైనా చేరిందన్నారు. చైనా కుట్రను ఎదుర్కొనేందుకు ఏ విధంగా సిద్ధమవుతున్నామో తెలుసుకునే హక్కు తమకు ఉందన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikharjun Kharge) ఈ ఘర్షణపై రాజ్యసభలో ప్రస్తావించారు. భారత్-చైనా సైనికుల ఘర్షణపై చర్చించాలని కోరుతూ కాంగ్రెస్ సభ్యులు ఓ తీర్మానాన్ని ప్రతిపాదించారు.

ఇదిలావుండగా, ఈ ఘర్షణలో భారత సైనికుల కన్నా ఎక్కువ సంఖ్యలో చైనా సైనికులు గాయపడినట్లు తెలుస్తోంది. దాదాపు 300 మంది చైనా సైనికులు సకల హంగులతో భారత సైనికులపై దాడికి తెగబడినప్పటికీ, భారత సైనికులు సర్వసన్నద్ధంగా ఉన్నారనే విషయాన్ని వారు గ్రహించలేకపోయారని సమాచారం. భారత సైనికుల ధాటికి తట్టుకోలేకపోయినట్లు తెలుస్తోంది. స్వల్పంగా గాయపడిన భారత సైనికులను అస్సాంలోని గువాహటి సైనిక ఆసుపత్రిలో చేర్పించారు.

Updated Date - 2022-12-13T14:15:14+05:30 IST