Tawang Clash: డ్రాగన్ కుతంత్రాలపై అమెరికా డేగ కన్ను, భారత్‌కు బాసట...

ABN , First Publish Date - 2022-12-14T15:19:56+05:30 IST

న్యూఢిల్లీ: ఓవైపు సరిహద్దు చర్చలు జరుపుతూనే, మరోవైపు కవ్వింపు చర్యలతో అరుణాచల్‌లోని తవాంగ్ వద్ద భారత భూభాగంలోకి తెగబడిన చైనా తీరును అగ్రదేశమైన అమెరికా ..

Tawang Clash: డ్రాగన్ కుతంత్రాలపై అమెరికా డేగ కన్ను, భారత్‌కు బాసట...

న్యూఢిల్లీ: ఓవైపు సరిహద్దు చర్చలు జరుపుతూనే, మరోవైపు కవ్వింపు చర్యలతో అరుణాచల్‌లోని తవాంగ్ వద్ద భారత భూభాగంలోకి తెగబడిన చైనా (Chaina) తీరును అగ్రదేశమైన అమెరికా (USA) తప్పుపట్టింది. ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత్ తీసుకున్న చర్యలకు పూర్తి మద్దతు ప్రకటించింది. తమ భాగస్వాముల భద్రతకు సహకరించేందుకు తాము దృఢంగా కట్టుబడి ఉన్నమని తెలిపింది. అమెరికాలోని రక్షణ శాఖ కేంద్ర పెంటగాన్, అమెరికా విదేశాంగ శాఖ సైతం యాంగ్జే వద్ద చైనా-భారత్ దళాల ఘర్షణపై ఘాటుగా స్పందించాయి. ''భారత్-చైనా సరిహద్దుల్లోని వాస్తవాధీన రేఖ వద్ద పరిణామాలను జాగ్రత్తగా గమిస్తున్నాం. చైనా నిరంతరాయంగా సైనిక మౌలిక వసతుల నిర్మాణాలు, దళాలు మోహరిస్తోంది. ఇది ఇండో పసిఫిక్‌లోని మా మిత్రులు, భాగస్వాములను కవ్వించే వైఖరిగా కనిపిస్తోంది. మేము మా భాగస్వాముల రక్షణకు కట్టుబడి ఉన్నాం. ఇదే సమయంలో ఉద్రిక్తతలు తగ్గించే విషయంలో భారత్ తీసుకుంటున్న చర్యలకు మద్దతిస్తున్నాం'' అని పెంటగాన్ ఓ ప్రకటనలో తెలిపింది.

యథాతథ పరిస్థితిని మార్చే ప్రయత్నాలకు వ్యతిరేకం

కాగా, ఎల్ఎసీ వెంబడి ఏకపక్షంగా యథాతథ పరిస్థితిని మార్చేందుకు యత్నించడాన్ని తాము వ్యతిరేకిస్తామని, విభేదాల పరిష్కారానికి ద్వైపాక్షిక మార్గాలను ఉపయోగించుకుని పరిష్కరించుకోవాలని, ఈ విషయమై ఉభయ దేశాలను (భారత్-చైనా) తాము ప్రోత్సహిస్తామని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్ తెలిపారు. భారత్ ద్వైపాక్షికంగానే కాకుండా, క్యాడ్ వంటి పలు వేదికలపై కూడా తమకు వ్యూహాత్మక భాగస్వామిని అని ఆయన చెప్పారు. మరోవైపు, ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని ఐరాస సెక్రటరీ జనర్ల ఆంటోనియా గుటెర్రస్ కూడా ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.

రెండున్నరేళ్ల తర్వాత...

గుజరాత్ కీలక ఎన్నికలు ముగిసి, పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమైన తరుణంలో డ్రాగన్ దేశం మరోసారి తన వక్రబుద్ధి ప్రదర్శించింది. 2020లో గల్వాన్‌‌లో చైనా దురాక్రమణను భారత్‌ గట్టిగా తిప్పికొట్టినప్పటి నుంచి లోలోపల ఉడికిపోతున్న డ్రాగన్ దేశం ఇదే అదనుగా మరోసారి అరుణాచల్‌లో దురాక్రమణకు గత శుక్రవారం తెగబడింది. గల్వాన్ ఘటనలో 20 మంది భారత సైనికులు, 40 మంది చైనా సైనికులు మరణించిన ఘటనను భారతదేశ ప్రజలు మరచిపోకముందే మరోసారి 400 మంది సైనికులతో మన దేశ చెక్‌పోస్టును ఆక్రమించే ప్రయత్నం చేసింది. ఇనుప ముళ్ల కంచెలు చుట్టిన కర్రలు, టీజర్ గన్‌లతో మన దేశ చెక్‌పోస్టును ఆక్రమించే ప్రయత్నానికి దిగింది. అక్కడి భారత సైన్యాన్ని వెళ్లిపోవాలని హెచ్చరించింది. ఆ సమయంలో సంఖ్యాబలం తక్కువగా ఉన్న భారత సైన్యం దీటుగా ఎదుర్కొంది. కొద్ది సమయంలోనే అదనపు బలగాలు రావడం, ఎదురుదాడికి దిగడంతో చైనా బలగాలు తోకముడిచాయి. అరగంటలోనే వాస్తవాధీన రేఖ ఆవలకు డ్రాగన్ సైన్యాన్ని తరిమికొట్టింది. భారత్ సైన్యంలో సుమారు 15 మంది, అంతకంటే ఎక్కువ మంది శత్రుదేశం సైనికులు గాయపడ్డారు.

చైనా 'దురాక్రమణ'పై మోదీ సమాధానం చెప్పాలి...

మరోవైపు, ఎల్ఏసీ వద్ద చైనా సైనికుల దురాక్రమణ ప్రయత్నాలపై విపక్ష పార్టీలు ముక్తకంఠంతో మోదీ సర్కార్‌పై విమర్శల దాడి కొనసాగిస్తున్నాయి. చైనా 'దురాక్రణ'పై మోదీ సమాధానం చెప్పాలని (Jawab do, Modi..) కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. చైనా ప్రభుత్వ మీడియా గ్లోబల్ టైమ్స్ వ్యాఖ్యలను ఉటంకిస్తూ చైనాతో మోదీ సంబంధంపై సమాధానం చెప్పాలని ఓ ట్వీట్‌లో నిలదీసింది. ''మోదీ గుజరాత్‌లో ఓడిపోయి ఉంటే చైనాపై అది ప్రతికూల ప్రభావం చూపించేది'' అంటూ గ్లోబల్ టైమ్స్ వ్యాఖ్యలు చేయడాన్ని ఆ ట్వీట్‌లో కాంగ్రెస్ ప్రస్తావించింది. ''జవాబ్ దో మోదీ'' అనే హ్యాష్ ట్యాగ్‌ను కూడా ఆ ట్వీట్‌కు కాంగ్రెస్ జోడించింది.

''జవాబ్ దో మోదీ'' అనే నినాదాన్ని కాంగ్రెస్ పార్టీ 2014లోనూ లేవనెత్తింది. విద్యేష పూరిత ప్రసంగం చేసిన సాధ్వి నిరంజన్ జ్యోతిని కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగించాలని విపక్షాలు ఏకతాటిపై నిలబడి ఆ నినాదాన్ని ఇచ్చాయి.తాజాగా ఈశాన్య ప్రాంతంలో యథాతథ పరిస్థితిని మార్చేందుకు చైనా అక్రమ యత్నాలకు దిగడంతో మళ్లీ ''జవాబ్ దో మోదీ'' నినాదాలు తెరపైకి వచ్చాయి.

రాజ్‌నాథ్ వివరణ...పెదవి విరిచిన కాంగ్రెస్

కాగా, 2020 గల్వాన్ ఘర్షణల తరహాలో కాకుండా ఈసారి చైనా దురాక్రమణ యత్నంలో భారత సైనికులు ఎవరూ మరణించలేదని, తీవ్రంగా గాయపడలేదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పార్లమెంటులో వివరణ ఇచ్చారు. అయితే ఈ వివరణపై కాంగ్రెస్ పెదవి విరిచింది. రాజ్‌నాథ్ సింగ్ వివరణ అసంపూర్తిగా ఉందని, ప్రధాని, ప్రభుత్వం వాస్తవాలను మరుగుపరుస్తున్నారని విమర్శించింది. సరిహద్దులు దాటుతున్న చైనాపై చర్యల విషయంలో మోదీ ప్రభుత్వం మౌన ప్రేక్షకునిలా వ్యవహరిస్తోందని ఆరోపించింది. కాంగ్రెస్ వాదనను కమ్యూనిస్టు పార్టీ, శివసేన, ఆర్జేడీ, ఎస్‌పీ ఎంపీలు బలపరుస్తూ వాకౌట్ జరిపాయి. ప్రభుత్వ వాదనకు పట్టుబడుతు విపక్ష పార్టీలు బుధవారం ఉదయం రాజ్యసభ నుంచి వాకౌట్ చేశాయి.modi-china.jpg

Updated Date - 2022-12-14T15:51:43+05:30 IST