Shraddha Walkar: అఫ్తాబ్ నుంచి ప్రాణభయం ఉందంటూ రెండేళ్ల క్రితమే పోలీసులకు ఫిర్యాదు

ABN , First Publish Date - 2022-11-23T16:05:44+05:30 IST

ముంబై: శ్రద్ధ వాకర్‌ను అఫ్తాబ్ పూనావాలా ముక్కలుగా నరికి చంపిన ఘటనపై పోలీసు విచారణలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. రెండేళ్ల క్రితమే తనకు..

Shraddha Walkar: అఫ్తాబ్ నుంచి ప్రాణభయం ఉందంటూ రెండేళ్ల క్రితమే పోలీసులకు ఫిర్యాదు

ముంబై: శ్రద్ధ వాకర్‌ (Shraddha Walkar)ను అఫ్తాబ్ పూనావాలా (Aaftab Poonawala) ముక్కలుగా నరికి చంపిన ఘటనపై పోలీసు విచారణలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. రెండేళ్ల క్రితమే తనకు అఫ్తాబ్ నుంచి ప్రాణభయం ఉందని శ్రద్ధ గ్రహించింది. అదే విషయాన్ని మహరాష్ట్రలోని వాసై టౌన్ తిలుంజ్ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసినట్టు పోలీసు విచారణలో వెల్లడైంది. 2020 నవంబర్ 23న మహారాష్ట్ర పోలీసులకు శ్రద్ధ ఫిర్యాదు చేసింది. ''ఇవాళ అతను (అఫ్తాబ్) నన్ను ఊపిరి ఆడకుండా చేసి చంపాలనుకున్నాడు. కొట్టాడు. చంపుతానని, ముక్కలు ముక్కలు చేస్తానని బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడు. గత ఆరునెలలుగా కూడా నన్ను కొడుతూనే ఉన్నాడు. చంపుతానని బెదరిస్తుండటంతో ఇంతవరకూ పోలీసులకు చెప్పుకునే సాహసం చేయలేకపోయాను'' అని ఆ లేఖలో శ్రద్ధ పేర్కొంది.

ఇద్దరూ కలిసి ఉంటున్న ఫ్లాట్‌లోనే తనను అఫ్తాబ్ కొట్టినట్టు పోలీసులకు శ్రద్ధ లిఖితపూర్వక ఫిర్యాదు చేసింది.అతని హింసాత్మక ప్రవర్తన గురించి అతని కుటుంబ సభ్యులకు కూడా తెలుసునని ఆమె పేర్కొన్నట్టు ఢిల్లీ పోలీసు వర్గాలు తెలిపాయి. గొడవ తర్వాత అఫ్తాబ్ తల్లిదండ్రులు నచ్చచెప్పడంతో తాము ఇకమీదట పోట్లాడుకోమంటూ స్థానిక పోలీసులకు శ్రద్ధ మరో లిఖితపూర్వక లేఖ సమర్పించింది. శ్రద్ధా వాకర్ రెండేళ్ల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసిన సమయంలోనే అఫ్తాబ్‌తో పోట్లాటలో గాయపడిన తన ఫోటోను తనతో పనిచేస్తున్న కరణ్‌కు వాట్సాప్‌లో షేర్ చేసింది. ఒక వారం తర్వాత పైకి కనిపించని గాయలతో ఆసుపత్రిలో కూడా చేరింది.

డేటింగ్ యాప్ ద్వారా 2019లో దగ్గరైన శ్రద్ధ, అఫ్తాబ్‌లు అప్పటి నుంచి సహజీవనం సాగిస్తున్నారు. 2020లో అఫ్తాబ్‌పై పోలీసులకు శ్రద్ధ ఫిర్యాదు చేసిన తర్వాత కూడా కలిసే ఉన్నారు. అఫ్తాబ్ సైతం ఆమెపై దాడులు, చంపుతాననే బెదిరింపులు మానలేదు. ఏదో ఒక దశలో ఇద్దరూ పెళ్లి చేసుకుంటామని, అప్పుడు పెద్దలని ఒప్పించవచ్చని శ్రద్ధ ఆలోచనగా ఉంటూ వచ్చింది. ఇద్దరూ కాల్‌సెంటర్ ఉద్యోగులు కావడంలో ఈ ఏడాది మేలో ఢిల్లీకి షిఫ్ట్ అయ్యారు. మతాంతర వివాహానికి శ్రద్ధ తల్లిదండ్రులు ఇష్టపడకపోవడంతో ఆమెతో చాలాకాలంగా వారు మాట్లాడటం లేదు. మేలో ఢిల్లీ మెహ్రౌలిలోని ఫ్లాట్‌లోకి శ్రద్ధ-అఫ్తాబ్ మారిన తర్వాత ఈ దారుణ హత్యా ఘటన జరిగింది. చాలా నెలలుగా శ్రద్ధ తమ ఫోన్ కాల్స్‌కు స్పందించడం లేదంటూ ఆమె తండ్రికి ఓ స్నేహితుడు చెప్పడంతో ఆయన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో శ్రద్ధ దారుణ హత్యా ఘటన ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది.

Updated Date - 2022-11-23T16:05:45+05:30 IST