Shraddha delhi news: శ్రద్ధా హత్య కేసులో వెలుగులోకి ఒళ్లు గగుర్పొడిచే విషయాలు

ABN , First Publish Date - 2022-11-15T14:01:25+05:30 IST

దేశ రాజధాని ఢిల్లీలో వెలుగుచూసిన పాశవిక ‘శ్రద్ధా హత్య కేసు’లో (Shraddha murder case) మరిన్ని షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.

Shraddha delhi news: శ్రద్ధా హత్య కేసులో వెలుగులోకి ఒళ్లు గగుర్పొడిచే విషయాలు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వెలుగుచూసిన పాశవిక ‘శ్రద్ధా హత్య కేసు’లో (Shraddha murder case) మరిన్ని షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. శ్రద్ధా మృతదేహాన్ని 35 ముక్కలుగా ఖండించిన అఫ్తాబ్ అమీన్ పూవానాలా (Aftab Poonawala) శరీర భాగాలు ఫ్రిడ్జ్‌లో ఉండగానే నమ్మశక్యంకాని చర్యకు పాల్పడ్డాడు. మరో యువతితో డేటింగ్ మొదలుపెట్టి.. ఆమెను తన అపార్ట్‌మెంట్‌కు తీసుకొచ్చుకునేవాడని పోలీసులు వెల్లడించారు. శ్రద్ధా వాల్కర్(26)ను కలిసిన డేటింగ్ యాప్ ‘బంబుల్’ (Bumble)పైనే కొత్త గర్ల్‌ఫ్రెండ్‌ని కలిశాడని, శ్రద్ధాను చంపిన 15-20 రోజుల్లోనే ఆమెతో డేటింగ్ మొదలుపెట్టాడని అధికారులు వివరించారు. కొత్త ప్రేయసిని రెగ్యులర్‌గా అపార్ట్‌మెంట్‌కు తీసుకొస్తుండేవాడని, ఆ సమయంలో ఫ్రిడ్జ్‌లోని శరీర భాగాలను కప్‌బోర్డ్‌లోకి మార్చేవాడని పోలీసులు తెలిపారు.

శ్రద్ధా శరీర భాగాలను ముక్కలుగా నరికిన గదిలోనే నిద్రించేవాడని, శ్రద్ధా తలను ఫ్రిడ్జ్‌లో పెట్టి చూస్తుండేవాడని దర్యాప్తులో తేలిందన్నారు. రాత్రి 2 గంటల సమయంలో శరీర భాగాలనే పడేసేవాడని చెప్పారు. నల్లటి కవర్‌లో శరీర భాగాలను తీసుకెళ్లేవాడు కానీ ఆ కవర్‌ను మాత్రం అక్కడ వదిలేసేవాడు కాదు. ఎవరికీ అనుమానం కలగకుండా ఈ విధంగా వ్యవహరించాడని పోలీసులు వివరించారు. చెఫ్‌గా శిక్షణ పొందిన అఫ్తాబ్.. రక్తపు మరకలను ఎలా క్లీన్ చెయ్యాల్లో గూగుల్‌లో తెలుసుకున్నాడు. శరీరాన్ని ముక్కలుగా కట్ చేయడానికి ముందు శరీర నిర్మాణం ఏవిధంగా ఉంటుందో కూడా తెలుసుకున్నాడు. కాగా శరీర భాగాలు ఖండించడానికి ఏ కత్తిని ఉపయోగించాడనేదానిపై పోలీసులు అన్వేషిస్తున్నారు. మరోవైపు శ్రద్ధా హత్యపై ఎవరికీ అనుమానం రాకుండా.. ఆమె ఇన్‌స్టాగ్రామ్ యాక్టివ్‌గా ఉండేలా అఫ్తాబ్ వ్యవహరించాడని, శ్రద్ధా ఫ్రెండ్స్‌తో టచ్‌లో ఉండేవాడని పోలీసులు గుర్తించారు. అయితే రెండు నెలలుగా ఆమె ఫోన్ స్విచ్చాఫ్ వస్తుండడంతో ఆమె స్నేహితురాళ్లకు అనుమానం వచ్చిందని వివరించారు. హత్య చేయాలనే ప్రణాళికలో భాగంగానే అపార్ట్‌మెంట్ అద్దెకు తీసుకున్నాడని అనుమానిస్తున్నట్టు పేర్కొన్నారు.

హత్య జరిగిందిలా...

వారిద్దరూ ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకుందామనుకున్నారు.. ఇద్దరి మతాలు వేరు కావడంతో పెద్దలు అంగీకరించలేదు. ఇంట్లోంచి పారిపోయి.. సహజీవనం చేస్తున్నారు. అంతలోనే ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. అవి కాస్తా తీవ్ర రూపం దాల్చాయి. అంతే.. అతనిలోని మృగాడు నిద్ర లేచాడు. ప్రేయురాలిని అత్యంత కిరాతకంగా చంపేశాడు. అంతేకాదు.. ఆమె శరీరాన్ని 35 ముక్కలు చేశాడు. వాటిని 18 రోజుల పాటు వేర్వేరు ప్రాంతాల్లో విసిరేశాడు! ఒళ్లు గగుర్పొడిచే ఈ పాశవిక ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. ఆర్నెల్ల తర్వాత ఈ దారుణ హత్య గురించి బాహ్యప్రపంచానికి తెలియడం గమనార్హం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రద్ధా వాకర్‌ (26), అఫ్తాబ్‌ అమీన్‌ పూనావాలా (28) ముంబైలోని ఓ కాల్‌సెంటర్‌లో పనిచేసేవారు. ఒకే సంస్థలో పనిచేస్తున్న వీరి మధ్య పరిచయం కాస్తా ప్రేమగా మారింది. మతాలు వేరు కావడంతో పెద్దలు పెళ్లికి అంగీకరించలేదు. దీంతో వారిద్దరూ ముంబై నుంచి దక్షిణ ఢిల్లీలోని మెహ్రౌలీ ప్రాంతానికి వచ్చేసి సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలో పెళ్లి విషయమై ఇద్దరి మధ్యా తరచూ గొడవలు జరిగాయి. మే నెల మధ్యలో ఓ రోజు ఘర్షణ పెరిగి పెద్దదైంది. అఫ్తాబ్‌ ఆమెను చంపేశాడు..

అనంతరం ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా నరికాడు. ఆ భాగాలను నిల్వ చేసేందుకు 300 లీటర్ల ఫ్రిజ్‌ను కొన్నాడు. రోజూ అర్ధరాత్రి 2 గంటల సమయంలో శరీర భాగాలను తీసుకెళ్లి ఢిల్లీలోని వేర్వేరు ప్రాంతాల్లో విసిరేసి వచ్చాడు. ఇలా 18 రోజుల పాటు చేశాడని పోలీసులు తెలిపారు. తమకు ఇష్టం లేని వ్యక్తితో సహజీవనం చేస్తున్న శ్రద్ధాతో కుటుంబ సభ్యులు మాట్లాడడం లేదన్నారు. అయితే శ్రద్ధ ఫోన్‌ రెండు నెలలుగా కలవడం లేదని ఆమె స్నేహితురాలు చెప్పడంతో తండ్రి వికాస్‌ మదన్‌ వాకర్‌ అఫ్తాబ్‌కు ఫోన్‌ చేశాడు. తాము విడిపోయి చాలా కాలమైందని అతడు చెప్పడంతో తన కుమార్తె కనిపించడం లేదంటూ వికాస్‌ నవంబరులో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతురాలి ఫోన్‌ లొకేషన్‌ పరిశీలించి, కేసును ఢిల్లీకి బదిలీ చేశారు. వికాస్‌ ఢిల్లీ వచ్చి చూడగా.. శ్రద్ధ ఉండే ఫ్లాట్‌కు తాళం వేసి ఉంది. దీంతో ఆయన శ్రద్ధ, అఫ్తాబ్‌ల ప్రేమ గురించి పోలీసులకు వెల్లడించడంతో పాటు తన కుమార్తె అదృశ్యమవడంలో అఫ్తాబ్‌ పాత్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు శనివారం అఫ్తాబ్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా.. అతను చేసిన దారుణం వెలుగులోకి వచ్చింది. నిందితుణ్ని ఐదు రోజుల కస్టడీకి తీసుకున్నామని, తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు సోమవారం తెలిపారు.

Updated Date - 2022-11-15T14:11:35+05:30 IST