2020 Delhi Riots: ఆప్ మాజీ నేతకు చుక్కెదురు, క్రిమినల్ ప్రొసీడింగ్స్‌పై స్టేకు సుప్రీం నిరాకరణ
ABN , First Publish Date - 2022-11-14T16:02:32+05:30 IST
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ సస్పెండెడ్ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్ సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. 2020 ఢిల్లీ అల్లర్ల ..
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) సస్పెండెడ్ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్ (Tahir Hussain)కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. 2020 ఢిల్లీ అల్లర్ల (2020 Delhi Riots) కేసులో ఆయనపై నమోదైన ఎప్ఐఆర్‌లకు సంబంధించి క్రిమినల్ ప్రొసీడింగ్స్‌పై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఢిల్లీ హైకోర్టు సెప్టెంబర్ 16న ఇచ్చిన ఆదేశాల్లో తాము జోక్యం చేసుకోలేమని న్యాయమూర్తులు అజయ్ రస్తోగి, సీటీ రవికుమార్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. హుస్సేన్ తరఫున హాజరైన సీనియర్ అడ్వకేట్ మనేక గురుస్వామి తన వాదన వినిపిస్తూ, ఇది సెటిల్ట్ లా అని, ఒకే ఘటనపై రెండు ఎఫ్ఐఆర్‌లు సరికాదని అన్నారు.
ఖజురి ఖాస్ పోలీస్ స్టేషన్‌లో తనపై అల్లర్లు, ఆయుధాల చట్టం కింద నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయాలంటూ హుస్సేన్ దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు గతంలో నోటీసులు ఇచ్చింది. సెప్టెంబర్ 16న ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టులో హుస్సేన్ సవాలు చేశారు. ఒకే ఘటనపై పలు ఎఫ్ఐఆర్‌లు దాఖలు చేశారంటూ ఆయన దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లపై హైకోర్టు స్టేకు నిరాకరిస్తూ తదుపరి విచారణను జనవరి 25వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు ధర్మసానం ప్రస్తావిస్తూ, హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో తాము జోక్యం చేసుకోలేమని తెలిపింది. 2020 మార్చి 16 నుంచి హుస్సేన్ జ్యూడిషియల్ కస్టడీలో ఉన్నారు.