నిమ్జ్‌.. ఫార్మాలకు మొండిచేయి

ABN , First Publish Date - 2022-09-11T09:37:33+05:30 IST

నిమ్జ్‌.. ఫార్మాలకు మొండిచేయి

నిమ్జ్‌.. ఫార్మాలకు మొండిచేయి

జాతీయ హోదా ఇచ్చి చేతులు దులుపుకున్న కేంద్రం

ఫార్మాసిటీకి 10 వేల కోట్లు అవసరం 

జహీరాబాద్‌కు 4,048 కోట్లు  కావాలి

పైసల్లేక.. ముందుకు కదలని ప్రాజెక్టులు 

రూపాయి విదల్చని కేంద్ర సర్కారు

రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తులు బేఖాతర్‌


హైదరాబాద్‌/జహీరాబాద్‌, సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి): తెలంగాణలో నిమ్జ్‌ హోదా కలిగిన రెండు ప్రాజెక్టులకు నిధులు విడుదల చేయడంలో కేంద్ర ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోంది. కేంద్రమే జాతీయ హోదా ఇచ్చినా.. ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా విదల్చకపోవడంతో ప్రాజెక్టుల పనులు అటకెక్కాయి. ఈ ప్రాంతాల్లో పరిశ్రమలను పెట్టేందుకు ఎన్నో కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నా.. ఆయా చోట్ల కనీస మౌలిక సదుపాయాలు కూడా లేకపోవడంతో.. నిమ్జ్‌లు వెలవెలబోతున్నాయి. దాదాపు 20 వేల ఎకరాల్లో ప్రపంచంలోనే అతిపెద్ద ఔషధ నగరిగా పేర్కొనబడుతున్న హైదరాబాద్‌ ఫార్మా సిటీ, జహీరాబాద్‌ నిమ్జ్‌ ప్రాజెక్టులు తీవ్రమైన నిధుల కొరతను ఎదుర్కొంటున్నాయి. ఫార్మాసిటీకి రూ.5వేల కోట్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లుగా కోరుతున్నా స్పందన లేదు. ఇటీవలే కేంద్రం ‘బల్క్‌ డ్రగ్‌ పార్క్‌’ల కేటాయింపులోనూ రాష్ట్రానికి మొండిచేయి చూపింది. దీంతో పార్క్‌ కేటాయిస్తే కనీసం రూ.వెయ్యి కోట్ల నిధులు దక్కుతాయన్న రాష్ట్ర ప్రభుత్వ ఆశలు అడియాసలయ్యాయి. మరోవైపు జహీరాబాద్‌ నిమ్జ్‌ సైతం తీవ్ర నిధుల కొరతను ఎదుర్కొంటోంది. అక్కడ పెట్టుబడులకు పరిశ్రమలు సిద్ధంగా ఉన్నా.. నిధుల కొరతతో కనీస మౌలిక సదుపాయల కల్పనలో జాప్యం జరుగుతోంది. ఈ రెండు ప్రాజెక్టులకు కేంద్రం నిమ్జ్‌ హోదా ఇచ్చినప్పటికీ.. తన వాటా నిధులను విడుదల చేయకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అసంతృప్తితో ఉంది. 


ఫార్మా సిటీపై శీతకన్ను..

ప్రపంచంలోనే అతిపెద్ద సమీకృత ఔషధ తయారీ సంస్థల సముదాయం హైదరాబాద్‌ ఫార్మా సిటీ. రంగారెడ్డి జిల్లాలోని యాచారం, కడ్తాల్‌, కందుకూరు మండలాల్లోని పది గ్రామాల పరిధిలో 19,333 ఎకరాల్లో దీనిని ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే 70శాతం భూసేకరణ పూర్తయింది. ఫార్మాసిటీ అంతర్గత అభివృద్ధి కోసం రూ.9వేల కోట్లు, రహదారుల అభివృద్ధికి రూ.వెయ్యి కోట్లు ఖర్చవుతాయని మూడేళ్ల క్రితమే ప్రభుత్వం అంచనా వేసింది. ఇప్పటికే దీనిని జాతీయ ప్రయోజన ప్రాజెక్టుగా గుర్తించిన కేంద్ర ప్రభుత్వం.. రెండేళ్ల క్రితమే నేషనల్‌ ఇన్వె్‌స్టమెంట్‌ మ్యాన్యుఫ్యాక్చరింగ్‌ జోన్‌(నిమ్జ్‌) హోదా కూడా ప్రకటించింది. ఈ హోదా ప్రకటిస్తే మౌలిక సదుపాయాల కల్పన, మాస్టర్‌ ప్లాన్‌ వ్యయం, వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ కోసం కేంద్ర ప్రభుత్వం నిధులను కేటాయించాల్సి ఉంది. అలాగే అంతర్జాతీయ సంస్థల నుంచి నిధుల సేకరణకు కేంద్రం సహకరించాలి. కానీ, ఈ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి ఇంత వరకు నిధులు రాలేదు. కనీసం రూ.5వేల కోట్లు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం అనేకసార్లు లేఖలు రాసినా, కేంద్ర మంత్రులను కలిసినా స్పందన లేదు. ఫార్మాసిటీలో స్థలం కేటాయించాలంటూ ఇప్పటికే 350 కంపెనీలు దరఖాస్తులు చేసుకున్నాయి. అయితే నిధుల కొరతతో ఈ ప్రాజెక్టు జాప్యం అవుతోంది. 


జహీరాబాద్‌కూ మొండిచేయి.. 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు 9 కి.మీ దూరంలో ఝరాసంగం, న్యాలకల్‌ మండలాల్లో నిమ్జ్‌ ఏర్పాటుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇందుకోసం 12,835 ఎకరాల భూసేకరణ లక్ష్యంగా పెట్టుకోగా.. మొదటి విడతలో 2,924 ఎకరాల స్థలం సిద్ధమైంది. ఇటీవలే కేంద్ర పర్యావరణ అనుమతులు రావడంతో ప్రభుత్వం పరిశ్రమలకు స్థలాలను అప్పగిస్తోంది. ఇక్కడ అన్ని పరిశ్రమలు ఏర్పాటైతే రూ.44వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నిమ్జ్‌లో రహదారులు, విద్యుత్తు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు రూ.4,048 కోట్లు ఖర్చవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. ప్రాజెక్టుకు రూ.5వేల కోట్ల ఆర్థిక సహకారం అందించాలని మంత్రి కేటీఆర్‌ ఇప్పటికే అనేకసార్లు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు. కానీ కేంద్రం నుంచి పైసా రాలేదు. అన్ని అనుమతులు వచ్చినా.. తీవ్రమైన నిధుల కొరతతో ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు మరింత జాప్యం అయ్యే అవకాశాలున్నాయి. 

Updated Date - 2022-09-11T09:37:33+05:30 IST