Iran: తగ్గేదే లే అంటున్న ‘హిజాబ్’ నిరసనకారులు.. ఇరాన్‌లో సోమవారం నుంచీ..

ABN , First Publish Date - 2022-12-04T19:03:33+05:30 IST

సోమవారం నుంచి ఇరాన్ అంతటా మూడు రోజుల పాటు స్ట్రైక్ నిర్వహించాలంటూ హిజాబ్ వ్యతిరేక నిరసనకారులు తాజాగా పిలుపునిచ్చారు.

Iran: తగ్గేదే లే అంటున్న ‘హిజాబ్’ నిరసనకారులు.. ఇరాన్‌లో సోమవారం నుంచీ..

టెహ్రాన్: ఇరాన్‌లో హిజాబ్ వ్యతిరేక నిరసనలు(Iran Anti-Hijab Protests) కొనసాగుతున్నాయి. హిజాబ్ తప్పనిసరిగా ధరించాలన్న ప్రభుత్వ నిబంధనను అక్కడి మహిళలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రెండు నెలలుగా ఇరాన్ నిరసనలతో అట్టుడుకుతోంది. ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో ఇప్పటివరకూ 200 మంది అసువులు బాసారు. కాగా.. తమ డిమాండ్‌కు ప్రభుత్వం తలొగ్గేలా ఒత్తిడి పెంచేందుకు.. సోమవారం నుంచి దేశవ్యాప్తంగా మూడు రోజుల పాటు స్ట్రైక్(3-day Strike) నిర్వహించాలంటూ నిరసనకారులు తాజాగా పిలుపునిచ్చారు. బుధవారం జాతీయ విద్యార్థి దినోత్సవాన్ని(Student Day) పురస్కరించుకుని అధ్యక్షుడు ఇబ్రాహిమ్ రైసీ(Ebrahim Raisi) టెహ్రాన్ యూనివర్శిటీని సందర్శించనున్నారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు నిరసనకారులు నిర్ణయించారు. దేశవ్యాప్తంగా వ్యాపారాలు మూసివేయాలని, ఆజాదీ స్క్వేర్ వరకూ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. అన్ని వాణిజ్య కార్యకలాపాలు నిలిపివేయాలని పిలుపునిచ్చారు.

కాగా.. హిజాబ్ నిబంధన అమలుపరిచే నైతిక పోలీసు విభాగాన్ని(మొరాలిటీ పోలీస్-Morality Police) రద్దు చేస్తున్నట్టు ఇరాన్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శనివారం ప్రకటించినట్టు అక్కడి వార్తా సంస్థ ఒకటి పేర్కొంది. ‘‘ఏ ప్రభుత్వం విభాగం ఈ వ్యవస్థను తీసుకొచ్చిందో అదే విభాగం దాన్ని రద్దు చేసింది’’ అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వ్యాఖ్యానించారు. అయితే.. మొరాలిటీ పోలీస్ విభాగాన్ని నియంత్రిస్తున్న ఇరాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ మాత్రం ఈ విషయంలో ఇప్పటివరకూ ఎటువంటి ప్రకటనా చేయలేదు. బహిరంగ ప్రదేశాల్లో పౌరుల ప్రవర్తన, వస్త్రధారణ తీరుతెన్నులు నియంత్రించేందుకు ఈ విభాగాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇదిలా ఉంటే.. తప్పనిసరి హిజాబ్ నిబంధనలో మార్పు చేయబోమని ఇరాన్ ఉన్నాతాధికారులు పలుమార్లు ప్రకటించారు. కాగా.. ప్రత్యర్థి ఇజ్రాయెల్ గూఢచార సంస్థకు సహకరించిన కేసులో నలుగురు నిందితులకు ఇరాన్ శనివారం మరణ శిక్ష అమలు చేసింది.

Updated Date - 2022-12-04T19:10:04+05:30 IST