Heart care: ఈ లక్షణాలుంటే గుండె పోటుకు సంకేతాలు!
ABN , First Publish Date - 2022-12-20T14:00:29+05:30 IST
గుండె పోటు(Heart attack) లక్షణం ఛాతీలో నొప్పి ఒక్కటే కాదు. మన ఊహకందని లక్షణాల ద్వారా కూడా గుండెపోటు
గుండె పోటు(Heart attack) లక్షణం ఛాతీలో నొప్పి ఒక్కటే కాదు. మన ఊహకందని లక్షణాల ద్వారా కూడా గుండెపోటు బహిర్గతమవుతుంది. అయితే తికమకకు గురిచేసే ఆ లక్షణాలను కొట్టిపారేయకుండా, వెంటనే వైద్యుల(Doctors) దృష్టికి తీసుకువెళ్లాలి.
వెన్ను: గుండెపోటుకు ముందు, గుండెపోటుకు గురైన సమయంలో, మరీ ముఖ్యంగా మహిళల్లో వెన్ను నొప్పి తీవ్రమవుతుంది.
దవడ: దవడలోకి నొప్పి ప్రసరిస్తూ ఉంటే, పంటి నొప్పి లేదా కండరం నొప్పి అని సరిపెట్టుకోకుండా గుండెపోటుగా అనుమానించాలి.
మెడ: గుండె కండరానికి రక్తసరఫరా జరిగే రక్తనాళంలో అడ్డంకి ఏర్పడినప్పుడు ఆ అసౌకర్యం ఛాతీలోనే మొదలైనా, నొప్పి మెడలోకి కూడా ప్రసరించవచ్చు. మెడ పట్టేసినా, మెడ కండరాలు అలసట, ఒత్తిడికి లోనైనా మెడ నొప్పి రావచ్చు. అయితే అది గుండెపోటు లక్షణం కూడా కావచ్చనే విషయం మరవకూడదు.
భుజం: గుచ్చుకున్నట్టు ఛాతీలో మొదలయ్యే నొప్పి మెడ నుంచి, దవడవైపు, భుజంలోకి ప్రసరించడం గుండెపోటు లక్షణం. భుజం నొక్కేసినట్టు నొప్పి మొదలైనా, ఆ నొప్పి ఛాతీ నుంచి ఎడమ దవడ, చేయి, మెడ వైపుకు ప్రసరించినా నిర్లక్ష్యం చేయకూడదు.
ఎడమ చేయి: చేతుల్లో తేలికపాటి నొప్పులు వయసు పైబడిన వాళ్లలో సహజమే! అయితే హఠాత్తుగా, అసహజమైన నొప్పి ఎడమ చేతిలో మొదలైతే గుండెపోటుగా భావించి, ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రతించాలి.