Himachal polls: ప్రైవేటు వాహనంలో ఈవీఎంల తరలింపు, సిబ్బందిని సస్పెండ్ చేసిన ఈసీ

ABN , First Publish Date - 2022-11-13T18:13:32+05:30 IST

హిమాచల్ ప్రదేశ్‌ ఎన్నికల పోలింగ్ అనంతరం ఓ పోలింగ్ కేంద్రానికి చెందిన ఈవీఎంలను ప్రైవేటు వాహనంలో తరలించడం సంచలనమైంది. దీనిపై కాంగ్రెస్ ఆందోళనకు దిగడంతో జిల్లా ఎన్నికల కమిషన్ చర్యలు..

Himachal polls: ప్రైవేటు వాహనంలో ఈవీఎంల తరలింపు, సిబ్బందిని సస్పెండ్ చేసిన ఈసీ

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌ ఎన్నికల పోలింగ్ అనంతరం ఓ పోలింగ్ కేంద్రానికి చెందిన ఈవీఎంలను ప్రైవేటు వాహనంలో తరలించడం సంచలనమైంది. దీనిపై కాంగ్రెస్ ఆందోళనకు దిగడంతో జిల్లా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంది. ఈవీఎంలను ప్రైవేటు వాహనంలో తరలించిన సిబ్బందిని ఆదివారంనాడు సస్పెండ్ చేసింది.

రామ్‌పూర్ నియోజకవర్గం పరిధిలోని దత్‌నగర్-49 పోలింగ్ కేంద్రానికి కేటాయించిన పోలింగ్ పార్టీ నంబర్ 146 సిబ్బంది ఈవీఎం, వీవీప్యాట్‌లను ప్రైవేటు వాహనంలో తీసుకువెళ్తున్నట్టు గమనించిన కాంగ్రెస్ వర్కర్లు ఆ విషయాన్ని వెంటనే ఈసీ దృష్టికి తీసుకువెళ్లారు. బీజేపీకి అనుకూలంగా ట్యాంపరింగ్ చేసేందుకు ఈవీఎంలను ప్రైవేటు వాహనంలో తరలించారంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. దీంతో పోలీసు అధికారులు ఆ ప్రాంతానికి చేరుకుని ఈవీఎం/వీవీప్యాట్ మిషన్లను స్ట్రాంగ్ రూమ్‌కు తరలించారు. స్ట్రాంగ్ రూమ్ బయట బీజేపీ, కాంగ్రెస్ నేతల సమక్షంలో ఈవీఎంలను బయటకు తీశారు. వాటికి వేసిన సీల్స్ సరిగానే ఉన్నాయని, ఎలాంటి ట్యాంపరింగ్ కాలేదని వెల్లడించారు. ఈవీఎంలను త్వరగా అప్పగించి తమ బాధ్యతలు పూర్తిచేసుకోవాలనే ఉద్దేశంతోనే సిబ్బంది వాటిని ప్రైవేటు వాహనంలో తీసుకువచ్చారని అధికారులు అన్నారు. ప్రైవేటు వాహనంలో ఈవీఎంలను తరలించడం ఈసీఐ ఆదేశాల ఉల్లంఘన కిందకే వస్తుందని, ప్రాథమిక సమాచారం మేరకు ఈసీఐ ఆదేశాల ఉల్లంఘన జరిగినట్టు గుర్తించి సబంధిత పోలింగ్ పార్టీ నెంబర్.146 సిబ్బందిని సస్పెండ్ చేసినట్టు రిటర్నింగ్ అధికారి (ఎస్‌డీఎం) సురేందర్ మోహన్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Updated Date - 2022-11-13T18:14:25+05:30 IST