BJP: గుజరాత్‌, హిమాచల్‌లో రాణించినా.. బీజేపీకి ఎదురవుతున్న ప్రశ్న ఇదే !

ABN , First Publish Date - 2022-12-09T20:32:04+05:30 IST

గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికల వరకు బీజేపీ ప్రదర్శన అద్భుతంగానే ఉంది. కానీ గురువారమే వెలువడిన పలు రాష్ట్రాల ఉపఎన్నికల ఫలితాల్లో బీజేపీ భంగపాటుకు గురైందా? ఆయా స్థానాల్లో తన ప్రాబల్యాన్ని చూపలేకపోయిందా?. రానున్న సార్వత్రిక ఎన్నికలు బీజేపీకి అంత సులువు కాదా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానాలే ఇస్తున్నారు రాజకీయ పరిశీలకులు.

BJP: గుజరాత్‌, హిమాచల్‌లో రాణించినా.. బీజేపీకి ఎదురవుతున్న ప్రశ్న ఇదే !

గురువారం వెలువడిన గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్‌ ఎన్నికల ఫలితాల్లో (Election results) బీజేపీ (BJP) సత్తా చాటింది. ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) సొంత రాష్ట్రం గుజరాత్‌లో అద్వితీయమైన విజయంతో కషాయ దళం చరిత్ర లిఖించింది. 182 స్థానాలకుగానూ ఏకంగా 156 చోట్ల గెలుపుబావుటా ఎగురువేసింది. ఎగ్జిట్ పోల్ అంచనాలను మించిన స్థానాల్లో గెలిచి విపక్ష పార్టీలను సైతం కకావికలం చేసింది. పక్కా ప్రణాళికలు, మోదీ బ్రాండ్, భారీగా పెట్టుబడులు, ఇతర సానుకూలాంశాలు కమల దళం చిరస్మరణీయ విజయాన్ని బాటలు వేశాయి. ఫలితంగా గుజరాత్‌ ఏడవసారి బీజేపీలో ఖాతాలో పడింది. మరోవైపు హిమాచల్‌ప్రదేశ్‌లో బీజేపీ ఓడినా ఘోరపరాభవమేమీ కాదు. కాంగ్రెస్, బీజేపీ ఓట్ల మధ్య వ్యత్యాసం కేవలం 0.9 శాతమే ఉండడం ఇందుకు నిదర్శనం. కేవలం 20 వేల ఓట్లే బీజేపీని అధికారానికి దూరం చేయగా... కాంగ్రెస్ అభ్యర్థుల్లో 15 మంది 2 వేల లోపు మెజారిటీతోనే గట్టెక్కారు. పార్టీలో అంతర్గత పోరు కూడా బీజేపీ కొంపముంచింది. వీటన్నింటినిబట్టి చూస్తే హిమాచల్‌లో కాంగ్రెస్‌తో బీజేపీ ఏ స్థాయిలో పోరాడిందో తేటతెల్లమవుతోంది. ఈ రెండు రాష్ట్రాల వరకు బీజేపీ ప్రదర్శన అద్భుతంగానే ఉంది. కానీ గురువారమే వెలువడిన పలు రాష్ట్రాల ఉపఎన్నికల ఫలితాల్లో బీజేపీ భంగపాటుకు గురైందా? ఆయా స్థానాల్లో తన ప్రాబల్యాన్ని చూపలేకపోయిందా?. రానున్న సార్వత్రిక ఎన్నికలు బీజేపీకి అంత సులువు కాదా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానాలే ఇస్తున్నారు రాజకీయ పరిశీలకులు. ఒక పార్లమెంట్‌.. ఆరు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీకి మిశ్రమ ఫలితాలు రావడాన్ని ఇందుకు కారణంగా విశ్లేషిస్తున్నారు.

యూపీలోని మెయిన్‌పురి లోక్‌సభ స్థానాన్ని సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) నిలబెట్టుకుంది. ఉత్సాహంతో ముందుకు సాగిన కమలదళానికి ఇక్కడి ఫలితం నిరాశే మిగిల్చింది. యూపీ అసెంబ్లీ ఉప ఎన్నికల్లోనూ దాదాపు ఇదే ఫలితం ప్రతిబింబించింది. ఎస్పీ సిటింగ్‌ స్థానమైన అయిన రాంపూర్‌లో బీజేపీ, కమలదళం కంచుకోట అయిన కతౌలీలో రాష్ట్రీయ లోక్‌దళ్‌(ఆర్‌ఎల్డీ) జయకేతనం ఎగురవేశాయి. ఇక రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లో ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్‌కు జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ తన స్థానాలను పదిలపరుచుకుంది. ఒడిసాలో తన సిటింగ్‌ స్థానాన్ని బిజూ జనతాదళ్‌(బీజేడీ) నిలబెట్టుకుంది. బిహార్‌లోని కుర్హానీలో జేడీయూ తన సిటింగ్‌ స్థానాన్ని కోల్పోయింది. అక్కడ బీజేపీ జయకేతం ఎగురవేసింది. దీనినిబట్టి గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ మినహా మిగతా చోట్ల బీజేపీ ఆశించిన మేర ఫలితాలు రాబట్టలేకపోయిందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

ఈ ఫలితాలను బట్టి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ దేశవ్యాప్తంగా ప్రభావం చూపడం అంత సులభమేమీ కాదని విశ్లేషిస్తున్నారు. ప్రచారంలో కాంగ్రెస్‌ విఫలమవడం, ఆమ్‌ ఆద్మీ పార్టీ ఓట్లను చీల్చడం, మోదీ సర్వశక్తులూ ఒడ్డడంతోనే గుజరాత్‌లో బీజేపీ భారీ విజయాన్ని అందుకోగలిగిందని వ్యాఖ్యానిస్తున్నారు. ఇవే ప్రణాళికలు, వ్యూహాలు ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తాయని చెప్పలేమంటున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లో వేలాది కోట్ల అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టినా ఆ పార్టీ రెండోసారి అధికారంలోకి రాలేకపోయిందని ఉదహరిస్తున్నారు. అదే సమయంలో ఢిల్లీ మునిసిపల్‌ ఎన్నికల్లోనూ బీజేపీ పరాజయం పాలైన విషయాన్ని రాజకీయ పరిశీలకులు గుర్తుచేస్తున్నారు. విపక్ష పార్టీలు కూడా ఇదే అంశాన్ని ఎత్తిచూపుతున్నాయి. బీజేపీకి వచ్చే ఎన్నికల్లో తిప్పలు తప్పవంటున్నాయి. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై రాజకీయ విశ్లేషణలు ఎలా ఉన్నా.. రాబోవు 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఎలాంటి ఎత్తులు, వ్యూహాలతో బరిలో దిగుతుందో వేచిచూడాలి.

Updated Date - 2022-12-09T20:45:40+05:30 IST