Election duty: గురువులను తప్పించారు!

ABN , First Publish Date - 2022-11-30T12:12:13+05:30 IST

ఎన్నికల ఒత్తిడి ఐదేళ్లకు ఒక్కసారే! కానీ, విద్యార్థుల హాజరు, బాత్‌రూమ్‌ల ఫొటోలు, మధ్యాహ్న భోజనం ఫొటోలు, నాడు నేడు ఫొటోలు, గుడ్లు, చిక్కీల ఫొటోలు అంటూ టీచర్లపై పరిమితికి మించి పడే యాప్‌ల భారం

Election duty: గురువులను తప్పించారు!
పూర్తిగా టీచింగే..

ఎన్నికల్లో టీచర్లు లేనట్టే!

పూర్తిగా టీచింగ్‌, అకడమిక్‌ వ్యవహారాలకే..

ఇతర శాఖలకు మాత్రమే ఇతరేతర పనులు

తప్పనిసరైతేనే ఉపాధ్యాయులకు ప్రమేయం

విద్యాహక్కు చట్ట నిబంధనలకు సవరణ

ఇందుకోసం అమలులోకి కొత్తగా నిబంధన

సంచలన నిర్ణయం.. ఉత్తర్వులు జారీ

ముందే చెప్పిన ‘ఆంధ్రజ్యోతి’ కథనం

ఎన్నికల ఒత్తిడి ఐదేళ్లకు ఒక్కసారే! కానీ, విద్యార్థుల హాజరు, బాత్‌రూమ్‌ల ఫొటోలు, మధ్యాహ్న భోజనం ఫొటోలు, నాడు నేడు ఫొటోలు, గుడ్లు, చిక్కీల ఫొటోలు అంటూ టీచర్లపై పరిమితికి మించి పడే యాప్‌ల భారం ప్రతిరోజూ వేధిస్తోంది. వీటిని తాజా ఉత్తర్వుల్లో టీచర్లు నిర్వర్తించాల్సిన ‘విద్యా అనుబంధ’ విధుల్లో కలిపేసిన సర్కారు, ఎలక్షన్‌ డ్యూటీ నుంచి తక్షణం తొలగించేలా హడావుడిగా గెజిట్‌ను మాత్రం జారీ చేసేసింది.

అమరావతి, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): అనుకున్నదే అయ్యింది. ‘ఆంధ్రజ్యోతి’ చెప్పిందే నిజమైంది. బోధనేతర పనులకు వారిని దూరం పెడుతున్నామనే సాకుతో ఉపాధ్యాయుల (Teachers)ను ఎన్నికల విధులకు దూరం చేయాలనే తన అసలు లక్ష్యాన్ని ప్రభుత్వం నెరవేర్చుకుంది. దీనికోసం చట్ట సవరణ చేయాలని తొలుత భావించారు. చివరకు రాష్ట్ర విద్యా హక్కు చట్టంలో నిబంధనలకు సవరణలు చేసి నూతన విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చేశారు. ఈ మేరకు ‘ఆంధ్రప్రదేశ్‌ ఉచిత నిర్బంధ విద్య నిబంధనలు-2010’కు రాష్ట్ర ప్రభుత్వం(Ycp Government) సవరణలు చేసింది. ఇప్పటివరకూ 29 నిబంధనలు ఉండగా, కొత్తగా 30వ నిబంధనను తాజా ఆదేశాలతో జతచేస్తూ మంగళవారం గెజిట్‌ జారీ చేసింది. ఈ సవరణలను సమర్థించుకునేందుకు రాష్ట్రంలోని విద్యారంగ పరిస్థితులను తన ఉత్తర్వుల్లో ఏకరువు పెట్టింది. అలాగే ఉపాధ్యాయ సంఘాలు కూడా తమను బోధనేతర, విద్యా సంబంధేతర పనుల నుంచి తప్పించాలని విజ్ఞప్తి చేసిన విషయాన్ని అందులో పేర్కొంది. అలాగే రాష్ట్రంలో విద్యా రంగ స్థితిగతులు, విద్యార్థుల ప్రతిభ, అక్షరాస్యత రేటును వివరించింది. గత ప్రభుత్వాలు విద్యా రంగాన్ని నిర్లక్ష్యం చేశారని ఆక్షేపించింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమలుచేస్తున్న పథకాల గురించి, చేయనున్న వాటిగురించి సుదీర్ఘంగా వివరించింది. విద్యా రంగం లక్ష్యాలను చేరుకోవాలంటే ఉపాధ్యాయులను బోధనేతర పనుల నుంచి తప్పించక తప్పదనే కోణంలో తాజా నిర్ణయాన్ని సమర్థించింది.

ఎన్నికలే లక్ష్యం

ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 1.8లక్షల మంది టీచర్లు పనిచేస్తున్నారు. వీరిలో ఎక్కువమందికి ఎన్నికల విధుల్లో పాల్గొన్న అనుభవం ఉంది. తొలినుంచీ టీచర్లే ఎన్నికల నిర్వహణలో కీలకంగా ఉన్నారు. అయితే ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఉపాధ్యాయులు ఎన్నికల విధుల్లో ఉంటే అధికార పార్టీకి మేలు జరగదని ప్రభుత్వం భావించింది. దశాబ్దాలుగా ఉన్న విధానాన్ని తుడిచిపెట్టేలా కీలక మార్పు చేసి వారిని ఎన్నికలకు దూరం చేసింది. తాజా ఉత్తర్వుల్లోని మూడో నిబంధన ప్రకారం ఎలాంటి పరిస్థితుల్లోనూ టీచర్లు పాఠశాల వదిలి వెళ్లకూడదని స్పష్టంచేసింది. అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు పాల్గొన్న తర్వాత కూడా అవసరమైతేనే టీచర్లు భాగస్వామ్యం కావాలని ఆదేశించడం అంటే ఇక వారి సేవలు ఎన్నికలకు అవసరం లేదని పరోక్షంగా వెల్లడించింది. దీంతో ఎన్నికల్లో అన్ని శాఖల ఉద్యోగులు పాల్గొన్న తర్వాత అప్పటికీ అవసరమని భావిస్తే టీచర్లను వినియోగిస్తారు. బోధనేతర పనుల నుంచి టీచర్లను తొలగించిన నిర్ణయంపై ఉపాధ్యాయ వర్గాలు సానుకూలంగా స్పందిస్తున్నాయి. అయితే దాని అసలు ఉద్దేశం వేరే కావడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల డ్యూటీపై అసంతృప్తి ఉన్నప్పటికీ సుదీర్ఘకాలం నుంచి బాధ్యతగా ఉన్న పని కావడంతో ఈ విధులను తొలగించాలనే డిమాండ్లు పెద్దగా వినిపించలేదు. ఐదేళ్లకు ఒకసారే కావడంతో దీనిపై కంటే రోజూ సమయం తినేస్తున్న యాప్‌ల బాధ తగ్గించాలని టీచర్లు గగ్గోలు పెడుతున్నారు. ముఖహాజరు, అనంతరం విద్యార్థుల హాజరు, బాత్‌రూమ్‌ల ఫొటోలు, మధ్యాహ్న భోజనం ఫొటోలు, నాడునేడు ఫొటోలు, గుడ్లు, చిక్కీల ఫొటోలు అంటూ టీచర్లపై పరిమితికి మించి యాప్‌ల భారం మోపారు. దీంతో బోధనకు సమయం తగ్గిపోతోంది. అందువల్ల ప్రతిరోజూ వేధించే ఈ పనులను తీసేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. వాటిని తొలగించకుండా బోధన, విద్యానుబంధ వ్యవహారాలకు మాత్రమే పరిమితం కావాలని ప్రభుత్వం తాజా ఉత్తర్వుల్లో స్పష్టంచేసింది. అంటే బోధనతో పాటు యాప్‌ల పని తప్పదని పరోక్షంగా చెప్పింది.

ఇది ఎన్నికల వ్యూహమేనా?: ఎస్టీయూ

ఉపాధ్యాయులను బోధనేతర పనుల నుంచి మినహాయించడాన్ని ఎస్టీయూ స్వాగతించింది. అయితే ఇది ఎన్నికల విధుల నుంచి తొలగించే కుట్రగా కనిపిస్తోందని అనుమానం వ్యక్తంచేసింది. ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతోందని ఆ సంఘం ప్రధాన కార్యదర్శి హెచ్‌ తిమ్మన్న పేర్కొన్నారు. 75 ఏళ్లుగా ఉపాధ్యాయులు ఎన్నికల విధుల్లో భాగంగా ఉన్నారని, ఏపీ ప్రభుత్వం దానికి భిన్నంగా నిర్ణయం తీసుకుందన్నారు.

ఇవీ ఆదేశాలు..

  • విద్యార్థుల తరగతి, వయస్సు ఆధారంగా విద్యా లక్ష్యాలను మెరుగుపరిచేందుకు ఉపాధ్యాయులు వారి సమయాన్ని బోధన సంబంధిత ముఖ్య అంశాలకే కేటాయించాలి.

  • టీచర్లు పాఠశాలల్లో బోధన, విద్యా అనుబంధ కార్యక్రమాలు తప్ప ఏ ఇతర పనుల్లోనూ నిమగ్నం కాకూడదు.

  • ఒకవేళ ఏవైనా తప్పించుకోలేని పరిస్థితులు నెలకొంటే, అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు వాటిలో పాల్గొన్న తర్వాత, అప్పటికీ అవసరమైనప్పుడే టీచర్లు వాటిలో పాల్గొనాలి.

Updated Date - 2022-11-30T12:12:13+05:30 IST

Read more