అమ్మఒడిలో దళిత విద్యార్థికి దగా! స్కాలర్‌షిప్‌ వస్తే..!

ABN , First Publish Date - 2022-06-24T16:31:26+05:30 IST

అమ్మఒడి పథకం మూడో విడత సాయంలో వింత వింత విషయాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ఆర్థిక భారం తగ్గించుకునేందుకు వడపోత పేరిట.. లక్ష మందికిపైగా అనర్హుల జాబితాలోకి చేర్చిన ప్రభుత్వం.. అర్హులకు ఇచ్చే మొత్తంలో సైతం కోత పెట్టేందుకు కొత్త దారులు వెదుకుతోంది. కేంద్ర ప్రభుత్వం, ఇతర సంస్థల ద్వారా దళిత విద్యార్థులెవరైనా..

అమ్మఒడిలో దళిత విద్యార్థికి దగా! స్కాలర్‌షిప్‌ వస్తే..!

అమ్మఒడిలో అనూహ్య కోత

స్కాలర్‌షిప్‌ వస్తే.. ఆ మొత్తం కటింగ్‌

పథకంలో పెరిగిపోయిన అనర్హుల జాబితా

అద్దెదారుల ఆధార్‌తో విద్యుత్‌ మీటర్లకు లింక్‌

అమ్మఒడి ఆరంచెల వడపోతలో అనర్హత

సాంకేతిక లోపంతో అర్హులైనా వేటే


(అమరావతి-ఆంధ్రజ్యోతి): అమ్మఒడి పథకం(Amma odi scheme) మూడో విడత సాయంలో వింత వింత విషయాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ఆర్థిక భారం తగ్గించుకునేందుకు వడపోత పేరిట.. లక్ష మందికిపైగా అనర్హుల జాబితాలోకి చేర్చిన ప్రభుత్వం.. అర్హులకు ఇచ్చే మొత్తంలో సైతం కోత పెట్టేందుకు కొత్త దారులు వెదుకుతోంది. కేంద్ర ప్రభుత్వం, ఇతర సంస్థల ద్వారా దళిత విద్యార్థులెవరైనా స్కాలర్‌షిప్‌(Scholarship)లు పొందుతుంటే.. అలాంటి విద్యార్థులకిచ్చే అమ్మఒడిలో ఆ మొత్తం కోత పెట్టాలని నిర్ణయించింది. అది మినహాయించుకుని మిగిలిన సొమ్ము మాత్రమే తల్లుల ఖాతాల్లో వేసేందుకు సిద్ధమైంది. అమ్మఒడికి సంబంధించిన అర్హుల జాబితా గురువారం గ్రామ, వార్డు సచివాలయ కేంద్రాలకు చేరింది. వాటిలో అనర్హుల జాబితా చూసి అక్కడ పనిచేసే సచివాలయ సిబ్బంది సైతం దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తున్నారు. అలాగే తమకు అమ్మఒడి ఎందుకు తక్కువగా వచ్చిందని ప్రశ్నించే లబ్ధిదారులకు ఏం సమాధానాలు చెప్పాలో అర్థం కాక అయోమయంలో పడ్డారు.  


రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 27న అమ్మఒడి పథకానికి ముఖ్యమంత్రి జగన్‌ బటన్‌ నొక్కి తల్లుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమచేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే అమ్మఒడి కోసం దరఖాస్తులు స్వీకరించడం, గతంలో అనర్హత ఉంటే వాటికి కారణాలను సరిచేసి మళ్లీ దరఖాస్తు చేసుకోవడం, ఆరంచెల వడపోత విధానం ద్వారా ప్రతి దరఖాస్తుల అర్హతను పరిశీలించడం తదతర ప్రక్రియలు చేపట్టి.. తాజాగా అర్హుల జాబితాను రూపొందించారు. ఈ జాబితా చూసిన లబ్ధిదారులతోపాటు సచివాలయ సిబ్బంది సైతం అవాక్కయ్యారు. అమ్మఒడి ఎంపికలో అడ్డగోలు విధానాలు అవలంబించారని, అర్హత కలిగిన సగం మంది లబ్ధిదారులు ఈ సారి అమ్మఒడిలో అనర్హులయిటన్లు చూసి గగ్గోలు పెడుతున్నారు. కొత్తగా కొంతమందిని అర్హులుగా చేర్చినప్పటికీ.. గతంలో అమ్మఒడి అర్హుల్లో చాలామందికి ఈ సారి మొండిచేయి చూపారని చెప్తున్నారు. గతేడాది 44,48,865 మందికి అమ్మఒడి అందింది. కానీ ఈ ఏడాది 43,19,090 మందికే మంజూరయినట్లు తెలుస్తోంది. అంటే దాదాపు 1.29 లక్షల మందికి కోతపడింది.


ఎస్సీ విద్యార్థుల అమ్మఒడిలో కోత...

కేంద్ర సామాజిక, సాధికారత మంత్రిత్వశాఖ అందిస్తున్న స్కాలర్‌షిప్పులతో పాటు పలు ప్రఖ్యాత సంస్థల నుంచి స్కాలర్‌షిప్పులు అందుకుంటున్న అమ్మఒడి లబ్ధిదారులకు ఇస్తున్న రూ.13 వేలల్లో కోత పడింది. గతంలో రూ.15 వేలు ఇస్తామని ప్రకటించిన జగన్‌ ఆ తర్వాత అందులో రూ.1000 ఆయా పాఠశాలల నిర్వహణ, పారిశుధ్యం కోసం ఇవ్వాలని సూచించారు. ఈ సారి ఆ మొత్తాన్ని రూ.2 వేలు చేశారు. అంటే అమ్మఒడి లబ్ధిదారులకు రూ.13 వేలు మాత్రమే అందిస్తారు. అయితే దళిత విద్యార్థులు స్కాలర్‌షిప్పులు పొందుతుంటే ఇందులోనుంచి వారు తీసుకుంటున్న ఆ మొత్తాన్ని మినహాయించి ఇవ్వనున్నారు. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. దళితులకు ప్రభుత్వం ఇచ్చిన ఆ ప్రయోజనాన్నీ మినహాయించి లెక్కగట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. 


పలు కారణాలు చెప్పి వడపోత...

అమ్మఒడి పథకంలో కొత్త కొత్త నిబంధనలు పెట్టి ప్రభుత్వం వడపోతకు శ్రీకారం చుట్టింది. అద్దె ఇళ్లలో ఉంటున్న పలు కుటుంబాలు ఈ సారి అమ్మఒడికి అనర్హులుగా మారారు. గత రెండు దఫాలు అమ్మఒడి పొందిన వారు ఈ సారి జాబితా నుంచి గల్లంతయ్యారు. ఇంటి విద్యుత్‌ మీటర్లు ఆయా ఇంటి ఓనర్ల ఆధార్‌తో లింక్‌ చేయడం ఆనవాయితీ. విచిత్రంగా అమ్మఒడిలో అనర్హుల సంఖ్యను పెంచేందుకు నిబంధనలు మార్చారు. ఆయా ఇళ్లల్లో ఉంటున్న అద్దెదారుడి ఆధార్‌తో మీటర్‌ను లింక్‌ చేశారు. దీంతో ఇల్లు మారినప్పుడల్లా ఆయా అద్దెదారుడి ఆధార్‌తో లింక్‌ అయిన మీటర్ల సంఖ్య పెరిగింది. ఆయా మీటర్ల రీడింగ్‌ ఆధారంగా అమ్మఒడికి వారిని అనర్హులను చేశారు. ఆరంచెల వడపోత విధానంలో ఎవరైనా 300 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్‌ వినియోగించి ఉంటే అలాంటి కుటుంబాలకు నవరత్నాలేవీ దక్కవు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అద్దె ఇళ్లల్లో నివశిస్తున్న పలువురు పట్టణ వాసులు అమ్మఒడిలో అర్హత కోల్పోయారు. ఒకే రేషన్‌ కార్డులో అమ్మ, బిడ్డ లేరంటూ రిమార్క్‌ చూపిస్తూ పలువురిని అనర్హులను చేశారు. వాస్తవానికి ఒకే రేషన్‌కార్డులో తల్లీ, బిడ్డ పేర్లు ఉన్నప్పటికీ రిమార్క్‌ ఆ విధంగా రావడంతో సచివాలయ సిబ్బంది సైతం అవాక్కయ్యారు.


గతంలో అమ్మఒడి లబ్ధిదారులు ఇప్పడు తమ పేరు అనర్హుల జాబితాలో రావడంపై గ్రామ, వార్డ్‌ సచివాలయ సిబ్బందిని నిలదీస్తున్నారు. దీంతో ఏం సమాధానాలు చెప్పాలో?, ఎవరికి చెప్పాలో? అర్థం కాని పరిస్థితిలో సిబ్బంది ఉన్నారు. కొన్ని చోట్ల తల్లీబిడ్డ సచివాలయ వలంటీర్ల యాప్‌లో మ్యాపింగ్‌ కాలేదంటూ కొర్రీ వేసి అనర్హులను చేశారు. తాము మ్యాపింగ్‌ చేశామని సిబ్బంది చెప్తున్నారు. అయినా అనర్హుల జాబితాలో తమ పేరు వచ్చిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2022-06-24T16:31:26+05:30 IST