AP Government: గురువులకు ఓ‘ఢీ’

ABN , First Publish Date - 2022-12-05T11:58:28+05:30 IST

వైసీపీ ప్రభుత్వం(Ycp Government) తమకు అనుకూలంగా ఉన్న ఉద్యోగ సంఘాలకు ఒక విధంగా, తమను ప్రశ్నిస్తున్న ఉపాధ్యాయ(Teachers) సంఘాలను మరో విధంగా చూస్తోందనే వాదన బలంగా వినిపిస్తోంది. తమ

AP Government: గురువులకు ఓ‘ఢీ’
గురువులకు ఓ‘ఢీ’

అదర్‌ డ్యూటీపై దొంగాట

ఉపాధ్యాయ సంఘాలను తొక్కిపట్టిన వైసీపీ సర్కార్‌

పీఆర్సీ, సీపీఎస్‌పై పోరాడినందుకే ఇలా చేశారంటున్న సంఘాల నేతలు

వైసీపీ ప్రభుత్వం(Ycp Government) తమకు అనుకూలంగా ఉన్న ఉద్యోగ సంఘాలకు ఒక విధంగా, తమను ప్రశ్నిస్తున్న ఉపాధ్యాయ(Teachers) సంఘాలను మరో విధంగా చూస్తోందనే వాదన బలంగా వినిపిస్తోంది. తమ సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్న ఉపాధ్యాయ సంఘాలను కట్టడి చేసేందుకు ఈ సంఘాల నేతలకు ‘ఓడీ’ని తొక్కి పెట్టిందనే విమర్శలు వస్తున్నాయి.

(అమరావతి-ఆంధ్రజ్యోతి): ఓడీ(OD).. అంటే అదర్‌ డ్యూటీ. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలకు నేతృత్వం వహించే అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు అత్యంత కీలకమైన సదుపాయం. ఆయా సంఘాల్లోని లక్షల మంది ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వంతో చర్చించి, పరిష్కారం దిశగా చొరవ చూపేందుకు వారు నిరంతరం ఆయా పనులపైనే ఉంటారు. అందుకే వారిని ఓడీగా పరిగణించి ప్రత్యేకంగా చూస్తారు. తద్వారా వారు రెగ్యులర్‌ విధులకు హాజరు కాకపోయినా, విధుల్లో ఉన్నట్టుగా పరిగణించి వేతనాలు, ఇతర భత్యాలు ఇస్తారు. దీనికి ప్రత్యేకంగా ‘రూసా’ నిబంధనలు కూడా ఉన్నాయి. జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌లో సభ్యత్వమున్న ఉద్యోగ సంఘాలకు గత జనవరిలోనే ఓడీ(అదర్‌ డ్యూటీ) సదుపాయం కల్పించిన ప్రభుత్వం.. ఉపాధ్యాయ సంఘాలకు ఓడీ ఇవ్వకుండా తొక్కిపట్టింది. దీనిపై ఉపాధ్యాయ సంఘాల నేతల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పీఆర్సీ, ఉపాధ్యాయ సమస్యలపై జగన్‌ సర్కార్‌ను గట్టిగా నిలదీసి, హక్కులను ప్రశ్నించినందుకే తమకు ఓడీ సదుపాయం ఇవ్వలేదనే భావన ఉపాధ్యాయ సంఘాల్లో నెలకొంది. ఆయా సందర్భాల్లో గత ముఖ్యమంత్రులు ఉపాధ్యాయ సంఘాలకు ఇచ్చిన ఓడీ సదుపాయాన్ని జగన్‌ సర్కార్‌ కొనసాగించకపోవడం దేనికి సంకేతమనే ప్రశ్నలు వస్తున్నాయి.

ఉపాధ్యాయ సంఘాలకు ఓడీ ఝలక్‌

ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం, వారి సమస్యలను నేరుగా అధికారులు, మంత్రులకు ప్రత్యక్షంగా విన్నవించడం, ఫాలో చేయడం ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాల నేతల విధి. ఉద్యోగుల సర్వీసు అంశాల పీఆర్సీ, ఇన్సూరెన్స్‌, సీపీఎస్‌ రద్దు., రిటైర్‌మెంట్‌ బెనిఫిట్‌ ఇలా... పలు అంశాలను ఉద్యోగ సంఘాల నాయకులు అధికారులు, మంత్రులకు ప్రభుత్వానికి విన్నవించడం సమస్యలు తలెత్తితే వాటిని వివరించి పరిష్కారం అయ్యే దిశగా కృషి చేసి ఉద్యోగులకు మేలు జరిగేలా కృషి చేస్తారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు ఇలా తమ తమ విధులు నిర్వర్తిస్తూ ప్రభుత్వానికి సమస్యలు ప్రత్యక్షంగా వెళ్లి తెలియజేయడం కుదరదు కాబట్టి గత ప్రభుత్వాలు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులకు ఓడీ సౌకర్యాన్ని కల్పించాయి.

1962లోనే ఉమ్మడి ఏపీ జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ ప్రారంభమైంది. ఈ కౌన్సిల్‌లో రూసా నిబంధనలకు అనుగుణంగా ఆయా ప్రభుత్వాలు పలు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలకు శాశ్వత సభ్యతం కల్పిస్తూ వచ్చాయి. కౌన్సిల్‌లోని సంఘాలకు ప్రభుత్వాలు ఓడీ సదుపాయాన్ని కల్పించాయి. వైసీపీ అధికారంలోకి వచ్చేనాటికి జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌లో 10 సంఘాలు ఉన్నాయి. వాటిలో 6 ఉద్యోగ, 4 ఉపాధ్యాయ సంఘాలు. గత ఏడాది డిసెంబరుతో ఆయా సంఘాల ఓడీ సదుపాయం ముగిసింది. ప్రతి ఏటా ఈ సదుపాయాన్ని కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వాలి. అయితే, ఈ ఏడాది జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌లో ఉన్న ఉద్యోగ సంఘాలకు మాత్రమే ఓడీ సదుపాయాన్ని కొనసాగిస్తూ ఉత్తర్వులు ఇచ్చిన ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాలైన.. ఏపీటీఎఫ్‌ ఎన్‌టీయూ, యూటీఎఫ్‌, పీఆర్‌టీయూ సంఘాలను విస్మరించింది. దీంతో ఆయా సంఘాలు ఈ ఏడాది జనవరి నుంచి అధికారులు, మంత్రులను కలిసి ఓడీ సదుపాయాన్ని కల్పించాలని పలుమార్లు విన్నవించారు. అయినా, ఫలితం కనిపించలేదు.

ప్రశ్నించినందుకేనా?

2021 అక్టోబరు నుంచి పీఆర్సీ ఉద్యమం ప్రారంభమైంది. రాష్ట్రంలో ఉన్న 2 జేఏసీలు కలవడంతో పీఆర్సీపై తీవ్రమైన పోరాటాలు జరిగాయి. జనవరిలో పీఆర్సీపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరిపింది. పీఆర్సీలో 23ు ఫిట్‌మెంట్‌ ఇచ్చిం ది. అయితే, పీఆర్సీని ఉపాధ్యాయ సంఘాలు గట్టిగా ప్రశ్నించాయి. దీంతోపాటు విద్యారంగ సమస్యలపైనా గట్టిగానే గళమెత్తాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం తమకు ఓడీ సదుపాయం కూడా కల్పించలేదని పలు ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి.

ప్రశ్నిస్తే ఓడీ ఇవ్వరా: ఏపీటీఎఫ్‌

ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలపై నిక్కచ్చిగా మాట్లాడడం, ప్రాతినిథ్యం చేయడమే 78 సంవత్సరాల చరిత్ర ఉన్న ఏపీటీఎఫ్‌ విధానమని ఏపీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు హృదయరాజు అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఓడీ ఇవ్వరా? అని నిలదీశారు.

ఇబ్బందులు పడుతున్నాం: ఎస్‌టీయూ

ఓడీ సౌకర్యం ఇవ్వని కారణంగా తాము ఇబ్బందులు పడుతున్నామని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం(ఎస్‌టీయూ) అధ్యక్షుడు సాయి శ్రీనివాస్‌ అన్నారు. రెండు లక్షల మంది ఉపాధ్యాయులకు తాము ప్రాతినిథ్యం వహిస్తున్నట్టు ఆయన చెప్పారు. వైసీపీ ప్రభుత్వం తమకు అనుకూలంగా ఉన్న ఉద్యోగ సంఘాలను ఒక విధంగా, తమను ప్రశ్నిస్తున్న ఉపాధ్యాయ సంఘాలను మరో విధంగా చూస్తోందనే వాదన బలంగా వినిపిస్తోంది. తమ సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్న ఉపాధ్యాయ సంఘాలను కట్టడి చేసేందుకు ఈ సంఘాల నేతలకు ‘ఓడీ’ని తొక్కి పెట్టిందనే విమర్శలు వస్తున్నాయి.

Updated Date - 2022-12-05T11:58:29+05:30 IST