టీచర్లకు కొత్త కష్టాలు..! ఇకపై నిమిషం ఆలస్యమైందంటే..!

ABN , First Publish Date - 2022-08-15T16:26:12+05:30 IST

నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదు’ ..నీట్‌, జేఈఈ, ఎంసెట్‌ లాంటి పోటీ పరీక్షల్లో తరచూ వినిపించే మాట ఇది. ఇప్పుడిది ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయులకూ వర్తించనుంది. ఒక్క నిమిషం ఆలస్యమైనా ఆటోమేటిక్‌గా ఆబ్సెంట్‌..

టీచర్లకు కొత్త కష్టాలు..! ఇకపై నిమిషం ఆలస్యమైందంటే..!

నిమిషం ఆలస్యమైనా ఆబ్సెంటే

టీచర్ల హాజరుకు కొత్త విధానం!

రేపటి నుంచే ‘ముఖ హాజరు’

‘సిమ్స్‌-ఏపీ’ యాప్‌ను ఫోన్లలో డౌన్‌లోడ్‌ చేసుకోవాలి

రోజూ స్కూలుకు రాగానే లాగిన్‌ అవ్వాలి

ఉదయం 9లోపు ఫొటో తీసుకోవాలి

ఆ వెంటనే అప్‌లోడ్‌ చేస్తే హాజరు

ఒక్క నిమిషం లేటైనా తీసుకోదు

ఆ రోజుకు సెలవు పెట్టుకోవలసిందే

బోధనేతర సిబ్బందికీ ఇదే అమలు

ట్రాఫిక్‌, బస్సులు ఆలస్యమైతే ఎలా?

ఇంటర్నెట్‌ లేనిచోట్ల పరిస్థితేంటి?

కొత్త పద్ధతిపై టీచర్లలో ఆందోళన

యాప్‌ ఇన్‌స్టాల్‌ చేయొద్దు: ఫ్యాప్టో


అమరావతి, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): ‘నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదు’ ..నీట్‌, జేఈఈ, ఎంసెట్‌ లాంటి పోటీ పరీక్షల్లో తరచూ వినిపించే మాట ఇది. ఇప్పుడిది ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయులకూ వర్తించనుంది. ఒక్క నిమిషం ఆలస్యమైనా ఆటోమేటిక్‌గా ఆబ్సెంట్‌ వేసే కొత్త విధానాన్ని పాఠశాల విద్యాశాఖ తీసుకొచ్చింది. ఈ నూతన విధానం మంగళవారం నుంచే అమల్లోకి వస్తోంది. గతంలో ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందికి బయోమెట్రిక్‌, ఐరిస్‌ హాజరు విధానం ఉండేది. కరోనా నుంచి ఇది ఆగిపోయింది. ఇప్పుడు దాని స్థానంలో పాఠశాల విద్యాశాఖ ఫేషియల్‌ రికగ్నిషన్‌ (ముఖ హాజరు) విధానాన్ని తీసుకొచ్చింది. ఇందుకోసం ‘సిమ్స్‌-ఏపీ’ అనే మొబైల్‌ యాప్‌ను రూపొందించింది. ప్రతి ఉపాధ్యాయుడు, పాఠశాలల్లో పనిచేసే బోధనేతర సిబ్బంది తమ సొంత ఫోన్లలో దీనిని డౌన్‌లోడ్‌ చేసుకుని లాగిన్‌ అవ్వాలి. అంతకంటే ముందు ప్రధానోపాధ్యాయుడు తన లాగిన్‌లో ఆ పాఠశాలలోని బోధన, బోధనేతర సిబ్బంది వివరాలు నమోదు చేయాలి. ప్రతి ఉపాధ్యాయుడు, ఉద్యోగికి ఎన్ని సెలవులు ఉన్నాయో కూడా అందులో పేర్కొనాలి. అనంతరం ఉపాధ్యాయులు, ఉద్యోగులను పాఠశాలలోనే మూడు యాంగిల్స్‌లో ఫొటోలు తీసి, యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి. ఆ తర్వాత వారు ప్రతిరోజూ పాఠశాలకు వచ్చిన వెంటనే యాప్‌లో లాగిన్‌ అయి ఫొటో తీసుకుని అప్‌లోడ్‌ చేస్తే హాజరు పడుతుంది. అయితే ఇది కచ్చితంగా 9 గంటలలోపే చేయాలి. 9 గంటలకు నిమిషం దాటినా హాజరును యాప్‌ అంగీకరించదు. హాజరుకు బదులుగా లీవ్‌ పెట్టుకోవాలని సూచిస్తుంది. వెంటనే హెడ్మాస్టరు లాగిన్‌ నుంచి సెలవు పెట్టుకోవాలి. ఒకవేళ ఎక్కడ ఉన్నా 9 గంటల లోపు ఫొటో తీసుకుందామనుకున్నా కుదరదు. ఎందుకంటే ప్రతి పాఠశాలకు జీపీఎస్‌ ఆఽధారంగా రేడియ్‌సను గుర్తిస్తారు. అందువల్ల కచ్చితంగా ఆ ఆవరణలోకి వస్తేనే హాజరు తీసుకుంటుంది. దీంతో ఇకపై ఉపాధ్యాయులు కచ్చితంగా 9 గంటలలోపు కచ్చితంగా పాఠశాలల్లో ఉండి తీరాలి. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో బయోమెట్రిక్‌, ఐరిస్‌ హాజరు విధానాన్ని తెచ్చినప్పుడు టీచర్లు తీవ్ర నిరసన వ్యక్తంచేశారు. అప్పటి విధానంలో బయోమెట్రిక్‌ తప్పనిసరైనా సమయంపై ప్రత్యేక నిబంధనలు పెట్టలేదు. కొంత అటూ ఇటూ అయినా బయోమెట్రిక్‌ విధానం హాజరును తీసుకునేది. ఇప్పుడు ఒక్క నిమిషం ఆలస్యమైనా లాభం లేదు. ఐదు పది నిమిషాలు ఆలస్యం అయినా పర్లేదని భావించడానికీ వీల్లేదు.


సాంకేతిక సమస్యల మాటేంటి..?

గతంలో ఇచ్చిన బయోమెట్రిక్‌ యంత్రాలు సరిగా పనిచేయనందునే ‘సిమ్స్‌-ఏపీ’ యాప్‌ను రూపొందించినట్లు చెబుతున్నారు. అయితే ఇప్పటికీ స్మార్ట్‌ ఫోన్లు లేని ఉపాధ్యాయులున్నారు. ఒకవేళ ఉన్నా వాటిలో యాప్‌లను ఎలా వినియోగించాలో తెలియనివారు కూడా చాలా మందే ఉన్నారు. అసలు స్మార్ట్‌ఫోనే లేని వారు ఇప్పుడేం చేయాలని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. అన్నిటికీ మించి చాలా ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ సమస్య ఉంది. ముఖ్యంగా ఏజెన్సీ, మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఇది తీవ్రంగా ఉంది. అలాంటప్పుడు నిర్దేశిత సమయంలో కచ్చితంగా హాజరు నమోదుచేయడం ఎలాంటి సాధ్యమవుతుందని ఉపాధ్యాయులు నిలదీస్తున్నారు. అలాగే కనీసం ఐదు పది నిమిషాలైనా గ్రేస్‌ పీరియడ్‌ లేకుండా నిమిషం నిబంధన పెడితే ఎలాగని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్‌ ఇబ్బందులు, బస్సుల ఆలస్యం, ఏదొక సమస్యతో అప్పుడప్పుడూ కొంత జాప్యమవుతూ ఉంటుందని.. అన్నారు.


అందరికీ ఒకే యాప్‌

ఇప్పటివరకూ వేర్వేరు హాజరు విధానాలుండగా పాఠశాల విద్యాశాఖ బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు అందరికీ ఒకే యాప్‌ ‘సిమ్స్‌-ఏపీ’ని తీసుకొచ్చింది. విద్యార్థులకు కూడా అదే యాప్‌ నుంచి హాజరు వేయాలని స్పష్టంచేసింది. ఉపాధ్యాయులు ఇప్పటికే విద్యార్థుల పేర్లను యాప్‌లో నమోదు చేసుకుంటున్నారు. హైస్కూలు టీచర్లకు  హాజరును హెడ్మాస్టరు ధ్రువీకరిస్తే.. ప్రాథమిక పాఠశాలల్లో ఆ బాధ్యతను పెద్ద పాఠశాలలు/స్కూల్‌ కాంప్లెక్సులకు అప్పగించారు. ఎవరి పాఠశాల ఆవరణలో వారికి హాజరును ముందుగా రికార్డు చేయాలి. అయితే ఇటీవల విలీనమైన చోట్ల ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు ఇతర స్కూళ్లకు వెళ్లారు. కానీ రికార్డుల్లో ఇంకా పాత పాఠశాలనే చూపిస్తున్నారు. ఇప్పుడు వారు ఎక్కడ హాజరు నమోదుచేయాలనే దానిపై స్పష్టత లేకుండా పోయింది. మరోవైప.. విద్యార్థుల హాజరుకు ఇప్పటివరకూ 10.30 గంటల వరకు సమయం ఉండగా, ఇప్పుడు దానిని 10 గంటలకే కుదించారు. ప్రస్తుత సమయమే చాలట్లేదని టీచర్లు గగ్గోలు పెడుతుంటే దానిని ఇంకా కుదించడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.


ప్రస్తుతానికి ఇన్‌స్టాల్‌ చేయొద్దు: ఫ్యాప్టో

గందరగోళంగా ఉన్న సిమ్స్‌-ఏపీ హాజరు యాప్‌ను ప్రస్తుతానికి ఇన్‌స్టాల్‌ చేసుకోవద్దని ఉపాధ్యాయులకు ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(ఫ్యాప్టో) సూచించింది. 16 నుంచి కొత్త హాజరు విధానం తెస్తున్న నేపథ్యంలో ఆదివారం సాయంత్రం జూమ్‌లో ఫ్యాప్టో కార్యవర్గ సమావేశం నిర్వహించారు. టీచర్ల సొంత ఫోన్లలో ఈ యాప్‌లు ఇన్‌స్టాల్‌ చేసుకుంటే వ్యక్తిగత డేటాకు భద్రత ఉండదని అభిప్రాయపడ్డారు. నిమిషం ఆలస్యమైనా హాజరు తీసుకోకపోవడం పట్ల అసహనం వ్యక్తంచేశారు. ఇప్పటికీ చాలా మంది ఉపాధ్యాయులకు స్మార్ట్‌ ఫోన్లు లేవని, అందువల్ల ఈ యాప్‌ను వ్యతిరేకించాలని నిర్ణయించారు. ప్రభుత్వమే డివైస్ లు సరఫరా చేసి వాటి ద్వారా నూతన విధానం అమలుచేయాలన్నారు. దీనిపై మంగళవారం కమిషనరేట్‌ అధికారులతో సమావేశం ఉన్నందున అందులో స్పష్టత తీసుకుంటామని, అప్పటివరకూ ఇన్‌స్టాల్‌ చేసుకోవద్దని ఫ్యాప్టో చైర్మన్‌ ఎన్‌.వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్‌ సీహెచ్‌ మంజుల కోరారు.


వ్యక్తిగత డేటాకు ప్రమాదం: ఒంటేరు

టీచర్ల సొంత ఫోన్లలో ఈ యాప్‌లను హాజరు కోసం డౌన్‌లోడ్‌ చేయడం వల్ల వ్యక్తిగత డేటా భద్రతకు ప్రమాదం ఉందని ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక గౌరవాధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులురెడ్డి కూడా ఓ ప్రకటనలో తెలిపారు. చాలా మంది ఉపాధ్యాయులకు స్మార్ట్‌ ఫోన్లు లేవని, నెట్‌వర్క్‌ సమస్యలున్నాయని.. ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టే కొత్త హాజరు విధానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.


విలీన పాఠశాలల టీచర్ల హాజరు ఎలా: టీఎన్‌యూఎస్‌

విలీన పాఠశాలల్లో టీచర్ల హాజరు తీవ్ర గందరగోళంగా మారిందని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు మన్నం శ్రీనివాస్‌ అన్నారు. ప్రాథమిక పాఠశాలల నుంచి హైస్కూళ్లకు వచ్చిన ఉపాధ్యాయుల ఐడీలు ఇంకా ప్రాథమిక పాఠశాలల్లోనే ఉన్నాయని.. రోజూ అక్కడ హాజరు వేసుకుని, బోధనకు ఇక్కడకు రావలసి వస్తుందని, ఇది ప్రతి దినమూ సాధ్యం కాదని తెలిపారు. పాఠశాలలు మారిన టీచర్ల లాగిన్‌లో పాత స్కూళ్ల విద్యార్థుల వివరాలే చూపిస్తున్నాయన్నారు. ఈ లోపాలు సవరించాలని పాఠశాల విద్య కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు.Read more