విద్యామంత్రి ఇలాకాలో ఒక్క లెక్చరరూ లేరు!
ABN , First Publish Date - 2022-08-15T17:02:55+05:30 IST
జూనియర్ కళాశాల కావాలని స్థానికులు గట్టిగా అడిగారు.. మంత్రి కూడా అంతే పట్టుదలతో మంజూరు చేశారు. విద్యార్థుల నుంచి సైతం స్పందన బాగానే వచ్చింది. కానీ, వారికి పాఠాలు చెప్పేవారే లేరు. కనీసం తాత్కాలిక పద్ధతిలో

నెల రోజులుగా నిలిచిపోయిన బోధన
హైదరాబాద్, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): జూనియర్ కళాశాల కావాలని స్థానికులు గట్టిగా అడిగారు.. మంత్రి కూడా అంతే పట్టుదలతో మంజూరు చేశారు. విద్యార్థుల నుంచి సైతం స్పందన బాగానే వచ్చింది. కానీ, వారికి పాఠాలు చెప్పేవారే లేరు. కనీసం తాత్కాలిక పద్ధతిలో అయినా ఒక్కరినీ సర్దుబాటు చేయలేదు. ఒకటి, రెండు రోజులుగా కాదు నెల రోజుల నుంచి ఇదే పరిస్థితి. ఇదెక్కడనో మారుమూల ప్రాంతంలో కాదు.. రాష్ట్ర రాజధాని పరిధిలోనే నెలకొంది. అది కూడా విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సొంత నియోజకవర్గం మహేశ్వరంలో కావడం గమనార్హం.
మీర్‌పేటలో ఈ ఏడాది జూనియర్ కళాశాలను ప్రారంభించారు. 72 మంది విద్యార్థులు అడ్మిషన్ పొందారు. ఈ కాలేజీ కోసం మొత్తం 12 పోస్టులను మంజూరు చేయాలని ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపించారు. ఇన్చార్జి ప్రిన్సిపాల్‌ను నియమించిన అధికారులు మిగిలిన ఏ పోస్టులనూ భర్తీ చేయలేదు. అసలు పోస్టులనే మంజూరు చేయకపోవడంతో కాలేజీలో గెస్ట్ లెక్చరర్లను కూడా నియమించే అవకాశం లేదు. దీంతో కొత్త కాలేజీలో ఇంకా బోధన ప్రారంభం కాలేదు. విద్యార్థులు ఎవరూ చేరని కారణంగా రాష్ట్రంలో పలు ఎయిడెడ్ జూనియర్ కళాశాలలు మూతపడ్డాయి. వీటిలో పనిచేస్తున్న సుమారు 56 మంది అధ్యాపకులకు కొత్తగా పోస్టింగ్‌లు ఇవ్వాలి ఉంది. వీరిని మీర్‌పేట వంటి కళాశాలల్లో సర్దుబాటు చేయొచ్చు. కానీ, నిబంధనల ప్రకారం.. ఎయిడెడ్ కాలేజీల్లో పనిచేస్తున్న లెక్చరర్లకు ఎయిడెడ్ కాలేజీలోనే పోస్టింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పోస్టింగ్ ఇవ్వాలంటే ప్రత్యేకంగా అనుమతి జారీ చేయాలి. ఒకపక్క కొత్త కాలేజీల్లో లెక్చరర్లు లేక విద్యార్థులకు బోధన అందని పరిస్థితి ఉండగా, మరోపక్క పోస్టింగ్ లేక ఎవరికీ బోధించలేని స్థితిలో ఎయిడెడ్ లెక్చరర్లు ఉన్నారు.