చేతులు లేకున్నా.. చదువులో మిన్న!
ABN , First Publish Date - 2022-06-23T17:10:25+05:30 IST
ఆ బాలికకు రెండు చేతులు లేవు. విద్యాదాఘాతంతో రెండు చేతులను కోల్పోయింది. అయితేనేం.. పట్టుదలతో జీవితాన్ని గెలవాలని నిశ్చయించుకుని చదువులో..

453 మార్కులతో ఫస్ట్ ఇంటర్లో మండల టాపర్గా సత్తా చాటిన శ్రీచంద్రిక
విద్యుదాఘాతంతో రెండు చేతులు కోల్పోయినా ఆత్మవిశ్వాసంతో చదువుల తల్లిగా రాణింపు
శంఖవరం, జూన్ 22: ఆ బాలికకు రెండు చేతులు లేవు. విద్యాదాఘాతంతో రెండు చేతులను కోల్పోయింది. అయితేనేం.. పట్టుదలతో జీవితాన్ని గెలవాలని నిశ్చయించుకుని చదువులో రాణించింది. తాజాగా విడుదలైన ఇంటర్ ఫలితాల్లో సత్తాచాటి మండల టాపర్గా నిలిచి, ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి నింపుతోంది. కాకినాడ జిల్లా శంఖవరం మండలం కత్తిపూడి సీతారామా కళాశాలలో ఇంటర్ సీఈసీ మొదటి సంవత్సరం విద్యార్థిని మాతా ప్రజ్వల శ్రీచంద్రిక 453 మార్కులు సాధించి మండల టాపర్గా నిలిచింది. అయితే, ఈమె పదోతరగతి వరకు టాపర్గా కొనసాగింది. ఆ తర్వాత అనుకోనివిధంగా విద్యుత్ ప్రమాదంలో రెండు చేతులూ కోల్పోయింది. వైద్య నిమిత్తం ఏడాదిపాటు చదువుకు దూరంగా ఉన్నా.. తనకీ పరిస్థితి వచ్చినందుకు కుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగింది. ఫలితంగా ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో మండల టాపర్గా నిలిచింది.