గ్రూప్‌-1 మహిళల కోటాలో సమాంతర రిజర్వేషన్లే

ABN , First Publish Date - 2022-09-24T20:52:26+05:30 IST

గ్రూప్‌-1 పోస్టుల(Group 1 posts) భర్తీలో మహిళల కోటాలో సమాంతర (హారిజాంటల్‌) రిజర్వేషన్లను అమలు చేయాలని టీఎస్‌పీఎస్సీ(tspsc)ని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వం ఈ పోస్టుల్లో వర్టికల్‌ పద్ధతిని అమలు

గ్రూప్‌-1 మహిళల కోటాలో సమాంతర రిజర్వేషన్లే

టీఎస్‌పీఎస్సీకి హైకోర్టు ఆదేశం

యథావిధిగా నియామక ప్రక్రియ కొనసాగించవచ్చని స్పష్టీకరణ

మహిళలకు వర్టికల్‌ పద్ధతిలో 

33శాతం రిజర్వేషన్‌ అమలు చేస్తున్న ప్రభుత్వం

మొత్తం 48 శాతానికి కోటా

‘సమాంతర’తో 33 శాతానికి తగ్గనున్న పోస్టులు


హైదరాబాద్‌, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): గ్రూప్‌-1 పోస్టుల(Group 1 posts) భర్తీలో మహిళల కోటాలో సమాంతర (హారిజాంటల్‌) రిజర్వేషన్లను అమలు చేయాలని టీఎస్‌పీఎస్సీ(tspsc)ని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వం ఈ పోస్టుల్లో వర్టికల్‌ పద్ధతిని అమలు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన సందర్భంగా ఈ ఆదేశాలు జారీ చేసింది. అయితే నియామక ప్రక్రియను మాత్రం యథావిధిగా కొనసాగించవచ్చని పేర్కొంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో 503 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ జారీచేసిన విషయం తెలిసిందే. కాగా, ఇందులో మహిళలకు ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు కల్పించాలన్న ఉద్దేశంతో మహిళా కోటా రిజర్వేషన్‌ను వర్టికల్‌ పద్ధతిలో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే మహిళలకు 33 శాతం వర్టికల్‌ రిజర్వేషన్ల అమలుతో రిజర్వేషన్‌, ఓపెన్‌ కేటగిరీ కలిపి 225 ఉద్యోగాలు వారికే రానున్నాయి. మొత్తం పోస్టుల్లో ఇవి 48 శాతం కానున్నాయి. 


దీంతో ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లకు చెందిన దాసి బాలకృష్ణ, కోడెపాక రోహిత్‌ తదితరులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. మహిళలకు 33 శాతం వర్టికల్‌ రిజర్వేషన్లు అమలు చేస్తే.. రిజర్వేషన్‌, ఓపెన్‌ కేటగిరీ కలిపి 33 శాతం కన్నా ఎక్కువ ఉద్యోగాలు వారికే వస్తాయని తెలిపారు. ఇది సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమని పేర్కొనారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ పి.మాధవీదేవి ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది సుంకర చంద్రయ్య వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల అమలుకు సంబంధించి సుప్రీంకోర్టు సుస్పష్టమైన తీర్పులు ఇచ్చిందని పేర్కొన్నారు. రాజేశ్‌కుమార్‌ దనియా వర్సెస్‌ రాజస్థాన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌, ఉత్తరాంచల్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వర్సెస్‌ మమతా బిస్త్‌ కేసుల్లో సమాంతర (హారిజాంటల్‌) రిజర్వేషన్లు అమలు చేయాలని కచ్చితమైన తీర్పులు ఇచ్చిందని గుర్తు చేశారు. వర్టికల్‌ రిజర్వేషన్‌ వల్ల ఇతరులు సమాన హక్కులు కోల్పోతారని పేర్కొన్నారు.


రాష్ట్ర ప్రభుత్వం, టీఎస్‌పీఎస్సీ తరఫున అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ.. ఎక్కువ సంఖ్యలో మహిళలకు ఉద్యోగాల కల్పన, మహిళా సాధికారత లక్ష్యంగా ప్రభుత్వం గతంలో ఎప్పుడూ లేనివిధంగా పెద్ద సంఖ్యలో గ్రూప్‌-1 పోస్టుల భర్తీ చేపట్టిందని తెలిపారు. పోస్టుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున అందరికీ న్యాయం జరుగుతుందన్నారు. ఈ దశలో ఏమైనా ఆదేశాలు ఇస్తే నియామక ప్రక్రియ ఆలస్యమవుతుందని పేర్కొన్నారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. తాము నియామక ప్రక్రియను అడ్డుకునేలా ఎలాంటి ఆదేశాలు ఇవ్వడం లేదని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం మహిళల కోటాలో సమాంతర (హారిజాంటల్‌) రిజర్వేషన్‌ అమలు చేస్తూ నియామక ప్రక్రియను యాథావిధిగా కొనసాగించవచ్చని పేర్కొంది. ఈ మేరకు విచారణను నవంబరు 1కి వాయిదా వేసింది.

Read more