గుడ్‌న్యూస్: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌?

ABN , First Publish Date - 2022-09-13T18:08:22+05:30 IST

వైద్య ఆరోగ్యశాఖ(Medical Health Department)లో కొలువుల భర్తీకి త్వరలోనే మరో నోటిఫికేషన్‌ విడుదల కానుంది. వారం పది రోజుల్లో 1183 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల(Assistant Professor Posts) భర్తీకి వైద్య నియామక మండలి నోటిఫికేషన్‌ను జారీ చేయనుంది. వైద్య కళాశాలల్లో ఖాళీ పోస్టుల వివరాలను వైద్యవిద్య

గుడ్‌న్యూస్: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌?

త్వరలోనే జారీ చేయనున్న మెడికల్‌ బోర్డు

ఖాళీల వివరాలను బోర్డుకు పంపిన డీఎంఈ


హైదరాబాద్‌, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): వైద్య ఆరోగ్యశాఖ(Medical Health Department)లో కొలువుల భర్తీకి త్వరలోనే మరో నోటిఫికేషన్‌ విడుదల కానుంది. వారం పది రోజుల్లో 1183 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల(Assistant Professor Posts) భర్తీకి వైద్య నియామక మండలి నోటిఫికేషన్‌ను జారీ చేయనుంది. వైద్య కళాశాలల్లో ఖాళీ పోస్టుల వివరాలను వైద్యవిద్య సంచాలకుడు డాక్టర్‌ రమేశ్‌రెడ్డి ప్రభుత్వానికి పంపారు. ఆ వివరాల ఆధారంగా అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల కానుంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 80039 పోస్టులను భర్తీ చేయనున్నట్లు సీఎం కేసీఆర్‌(Cm Kcr) ఈ ఏడాది మార్చి 9న శాసనసభలో ప్రకటించారు. ఇందులో వైద్య ఆరోగ్యశాఖలో 12735 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఒక్క వైద్య విద్య సంచాలకుల పరిధిలోనే 5363 పోస్టులున్నాయి. 1183 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, 3823 స్టాఫ్‌నర్స్‌, 357 ట్యూటర్‌ పోస్టులు ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. మరోవైపు రాష్ట్రంలో కొత్తగా గత ఏడాది 8, ఈ ఏడాది 9 వైద్య కళాశాలల ఏర్పాటు కోసం ప్రభుత్వం జాతీయ వైద్య కమిషన్‌కు దరఖాస్తు చేసింది. 8 కాలేజీల్లో ఇప్పటికే 7 కళాశాలలకు ఎన్‌ఎంసీ అనుమతి ఇచ్చింది. మంచిర్యాల మెడికల్‌ కాలేజీకి ఇంకా అనుమతి రావాల్సి ఉంది. ఈ నెల 14న లోటుపాట్లపై ఎన్‌ఎంసీ ప్రభుత్వ వాదనలను విననుంది. రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన వివరణ ఇస్తే.. వెంటనే మంచిర్యాల కాలేజీకి కూడా అనుమతి వస్తుంది. ఈ నూతన వైద్య కళాశాలకు తోడు వచ్చే ఏడాది అందుబాటులోకి రానున్న మరో 9 కళాశాలల్లో భారీగా అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు కావాల్సి ఉంటుంది. ఎన్‌ఎంసీ బృందాలు తనిఖీలు చేసే సమయానికి అధ్యాపకుల కొరత ఉండకూడదు. అందుకే అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల భర్తీ ప్రక్రియను వైద్యశాఖ యుద్ధప్రాతిపదికన చేపడుతోంది. 


శరవేగంగా సీఏఎస్‌ల రిక్రూట్‌మెంట్‌

మరోవైపు డీఎంఈ, డీహెచ్‌, టీవీవీపీ ఆస్పత్రుల పరిధిలో సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ (సీఏఎస్‌) పోస్టుల భర్తీ ప్రక్రియను వైద్య నియామక మండలి వేగిరం చేసింది. ఈ మూడు ఆస్పత్రుల పరిధిలో 1326 సీఏఎస్‌ పోస్టుల భర్తీ కోసం గత జూన్‌ 15న బోర్డు నోటిఫికేషన్‌ జారీ చేసింది. అనంతరం అందులోని 357 ట్యూటర్‌ పోస్టుల భర్తీని ఉపసంహరించుకుంది. మిగిలిన 969 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది. మొత్తం 5 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. పరిశీలన ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఇక ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాంట్రాక్‌, అవుట్‌సోర్సింగ్‌ పద్ధతిలో పనిచేసిన వైద్యులకు సర్కారు వెయిటేజీ మార్కులు ఇచ్చింది. వెయిటేజీ అభ్యర్థుల వివరాలను పరిశీలించేందుకు డీఎంహెచ్‌వోలకు లాగిన్‌ ఐడీని కేటాయించింది. డీఎంహెచ్‌వోలంతా తమ జిల్లాల పరిధిలో పనిచేసిన వైద్యులకు తాము ఇచ్చిన వెయిటేజీ మార్కుల సర్టిఫికెట్‌, అభ్యర్థులు అప్‌లోడ్‌ చేసిన ధ్రువపత్రాలను తనిఖీ చేస్తున్నారు. ఈ ప్రక్రియ కూడా దాదాపు ముగిసిందని  వైద్యవర్గాలు తెలిపాయి. అనంతరం ప్రతిభ, రిజర్వేషన్ల ఆధారంగా పోస్టుల భర్తీ ప్రక్రియను చేపట్టనున్నారు. 

Updated Date - 2022-09-13T18:08:22+05:30 IST