విదేశీ విద్య అంతా మిథ్య

ABN , First Publish Date - 2022-10-27T10:43:19+05:30 IST

ఆర్భాటంగా సంక్షేమ పథకాలు ప్రారంభించడం. ఆ తర్వాత అర్హుల జాబితాలో కోత పెట్టడం. రకరకాల నిబంధనల పేరిట లబ్ధిదారులను తొలగించడం. ఇన్నాళ్లూ జగన్‌ సర్కారుపై వచ్చిన తీవ్ర విమర్శలివి. ఇప్పుడు ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. పథకం ప్రయోజనాలు

విదేశీ విద్య అంతా మిథ్య
మిథ్య

పేరుకే విదేశీ విద్యాదీవెన పథకం

ని‘బంధనాలతో’ తుస్సుమన్న దీవెన..

500 దాటని దరఖాస్తులు

ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల నుంచి 25 మాత్రమే

ఎస్సీల్లో అర్హత సాధించింది ఒక్కరే

అర్హులు తగ్గడానికి నిబంధనలే కారణం

బడుగు విద్యార్థులతో సర్కారు చెలగాటం

200 క్యూసీ కళాశాలల్లో సీట్లు దక్కితేనే

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అని మెలిక

ఆర్భాటంగా సంక్షేమ పథకాలు ప్రారంభించడం. ఆ తర్వాత అర్హుల జాబితాలో కోత పెట్టడం. రకరకాల నిబంధనల పేరిట లబ్ధిదారులను తొలగించడం. ఇన్నాళ్లూ జగన్‌ సర్కారుపై వచ్చిన తీవ్ర విమర్శలివి. ఇప్పుడు ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. పథకం ప్రయోజనాలు పూర్తిగా అందకుండా నిబంధనల పేరుతో దరఖాస్తుల దశలోనే అడ్డుకుంటోంది. జగనన్న విదేశీ విద్యాదీవెన పథకం అమలు తీరే ఇందుకు నిదర్శనం.

(అమరావతి-ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా మొత్తం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ విద్యార్థుల నుంచి జగనన్న విదేశీ విద్యా దీవెన పథకానికి 500 దరఖాస్తులు కూడా రాలేదు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల నుంచి కేవలం 25 దరఖాస్తులే వచ్చాయి. దరఖాస్తు చేసుకున్న 15 మంది ఎస్సీ విద్యార్థుల్లో ఒక్కరు మాత్రమే ఈ పథకానికి అర్హత సాధించినట్టు సమాచారం. అయితే విదేశీ యూనివర్సిటీ నుంచి పూర్తి స్థాయిలో అనుమతులు రావాల్సి ఉందంటున్నారు. ఇక ఎస్టీలకు సంబంధించి ఇప్పటి వరకు 10 దరఖాస్తులు రాగా... ఎప్పుడు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారో తెలియడం లేదు. టీడీపీ అమలు చేసిన విదేశీ విద్యను రద్దు చేశామన్న విమర్శ రాకుండా ఎట్టకేలకు జగనన్న విదేశీ విద్యాదీవెన పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. గతంలో లేని నిబంధనలు పెట్టడంతో తక్కువ దరఖాస్తులు వచ్చాయి.

దరఖాస్తు చేసుకోవడానికి మొదట రెండు నెలల పాటు అంటే సెప్టెంబరు నెలాఖరు వరకు సమయమిచ్చింది. ఆ తర్వాత అక్టోబరు నెలాఖరు వరకు గడువు పొడిగించింది. ప్రభుత్వం నియమించిన కమిటీ ఇటీవల ఎస్సీ, బీసీలకు ఇంటర్వ్యూలు నిర్వహించింది. బీసీలకు సంబంధించి కేవలం 57 మందికి ఇంటర్వ్యూలు నిర్వహించగా, మరో 74 దరఖాస్తులకు సంబంధించి రెండో విడత నిర్వహించనున్నారు. ఈ నెల 28, 29 తేదీల్లో కాపు, ఈబీసీ విద్యార్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఆన్‌లైన్‌లో కాపు విద్యార్థుల నుంచి సుమారు 150, ఈబీసీల నుంచి సుమారు 150 దాకా దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. ఎస్సీల నుంచి ఒక్కరు మాత్రమే అర్హత సాధించగా, ఎస్టీల ఇంటర్వ్యూల గురించి సమాచారం లేదు.

నిబంధనలతో కత్తెర

చంద్రబాబు హయాంలో పేద విద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకు ప్రభుత్వమే ఫీజు చెల్లించేలా విదేశీ విద్య పథకాన్ని అమలు చేశారు. జగన్‌ సీఎం అయ్యాక ఈ పథకాన్ని తుంగలో తొక్కారు. దీనిపై ఎడాపెడా విమర్శలు రావడంతో ఈ పథకాన్ని పునరుద్ధరిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఆ వెంటనే సమాచార శాఖ ద్వారా ఊదరగొట్టే కార్యక్రమాన్ని చేపట్టారు. కానీ నిబంధనలు పరిశీలిస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఈ పథకం ఫలాలు లభించకూడదన్న ఉద్దేశం ప్రభుత్వానికి ఉన్నట్లుంది. 200 క్యూసీ మెరిట్‌ కలిగిన కళాశాలల్లో సీట్లు పొందిన వారికే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తామని ఉత్తర్వుల్లో మెలికపెట్టారు.

విదేశీ విద్య పథకాన్ని అమలు చేస్తున్నామంటూ గొప్పలు చెబుతూ... ఈ పథకంలో చాలామందికి ప్రయోజనాలు అందకుండా నిబంధనలు కఠినతరం చేశారు. విద్యుత్‌ వినియోగం నెలకు 300 యూనిట్లు దాటరాదని, పట్టణాల్లో 750 చదరపు అడుగులకు మించి నివాస స్థలం ఉండరాదని, ఆదాయ పన్ను చెల్లించనివారై ఉండాలని... తదితర ఆరంచెల వడపోత విధానాన్ని అమలు చేశారు. దీంతో ప్రభుత్వ వ్యూహం ఫలించింది. లబ్ధిదారుల సంఖ్య తగ్గిపోయింది.

కేంద్రం వెసులుబాటు...

కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల విదేశీ విద్యకు ఇచ్చే స్కాలర్‌షిప్పుల కోసం 500 క్యూసీ ర్యాంకింగ్‌ లోపు కళాశాలల్లో సీట్లు పొందినవారిని అర్హులుగా నిర్ణయించింది. అయితే జగన్‌ సర్కార్‌ ఇచ్చిన ఉత్తర్వుల్లో 200 క్యూసీ ర్యాంకింగ్‌ కళాశాలల్లో సీట్లు పొందిన విద్యార్థులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని మెలిక పెట్టింది. దీంతో రాష్ట్రంలో ఈ పథకానికి అర్హత సాధించే బడుగులను వేళ్లమీద లెక్క పెట్టవచ్చని చెబుతున్నారు. ఆ స్థాయి ర్యాంకింగ్‌ గల యూనివర్సిటీల్లో సీట్లు సాధించినవారికి పలు కార్పొరేట్‌ సంస్థలు, యూనివర్సిటీలే స్కాలర్‌షిప్పును అందిస్తాయి. ప్రభుత్వం స్కాలర్‌షిప్పులు అందించాల్సిన అవసరమే లేదు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు విదేశాల్లో సీట్లు సంపాదించే కళాశాలలేవీ జగనన్న విద్యాదీవెన పథకం కిందకు వచ్చే పరిస్థితి లేదని చెబుతున్నారు. ప్రభుత్వ ప్రచారార్భటం కోసం తప్ప ఈ పథకం వల్ల చాలామంది విద్యార్థులకు ఒనగూడేదేమీలేదని విమర్శిస్తున్నారు.

గతంలో 4923 మందికి లబ్ధి

ఒకప్పుడు పేద, బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కలగా ఉన్న విదేశీ విద్యను చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో సాకారం చేశారు. అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్‌, జర్మనీ, న్యూజిలాండ్‌, స్వీడన్‌, నెదర్లాండ్స్‌, ఫ్రాన్స్‌, డెన్మార్క్‌, రష్యా, ఫిలిప్పీన్స్‌, కజకిస్థాన్‌, చైనా దేశాల్లో చదువుకునేందుకు అవకాశం కల్పించారు. ఎంఎస్‌, ఎంబీబీఎస్‌, ఇతర పీజీ కోర్సులతో పాటు కొన్ని పీజీ డిప్లొమో కోర్సులు, అన్ని వృత్తివిద్యా కోర్సులు చదువుకునేలా సాయం చేశారు. గత ప్రభుత్వ హయాంలో 4923 మందికి విదేశీ విద్య ప్రయోజనం కల్పించారు.

ఏడాదిలో రెండుసార్లు విదేశీ విద్యకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. 2016-17 విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు స్కాలర్‌షిప్పులు అందించారు. బీసీలకు విదేశీ విద్యాదరణ పేరుతో 2016-17 నుంచి మూడేళ్ల పాటు ఒక్కో విద్యార్థికి రూ.10 లక్షలు అందించారు. ఆ మూడేళ్లలో 1926 మంది బీసీ విద్యార్థులకు, 527 మంది మైనారిటీ విద్యార్థులకు, 783 మంది ఈబీసీ విద్యార్థులకు, 1196 మంది కాపు విద్యార్థులకు, 491 మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు విదేశీ విద్య ప్రయోజనం కల్పించారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ప్రారంభంలో రూ.10 లక్షలు ఆ తర్వాత సాయాన్ని రూ.15 లక్షలకు పెంచారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు శాచురేషన్‌ విధానంలో అమలు చేశారు. మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా క్రిస్టియన్‌, ముస్లిం మైనారిటీలకు, కాపు కార్పొరేషన్‌ ద్వారా కాపు విద్యార్థులకు, బ్రాహ్మణ కార్పొరేషన్‌ ద్వారా బ్రాహ్మణ విద్యార్థులకు విదేశీ విద్య కోసం రూ.10 లక్షలు అందించారు.

Updated Date - 2022-10-27T10:43:20+05:30 IST