మీ ఇంట్లో ఎందరు బిడ్డలున్నా చదివిస్తా
ABN , First Publish Date - 2022-08-12T16:52:57+05:30 IST
‘మీ కుటుంబంలో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందిని చదివిస్తాను. ఇందులో రేషన్ పెట్టి ఒక్కరికే ఇస్తాను అనే మాటలు నా నోట్లో నుంచి రావడం లేదు’

ఇందులో రేషన్ పెట్టి ఒక్కరికే ఇస్తా అనను: సీఎం జగన్
బటన్ నొక్కి విద్యాదీవెన నిధులు విడుదల
బాపట్ల, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): ‘మీ కుటుంబంలో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందిని చదివిస్తాను. ఇందులో రేషన్ పెట్టి ఒక్కరికే ఇస్తాను అనే మాటలు నా నోట్లో నుంచి రావడం లేదు’ అని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అన్నారు. బాపట్లలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో గురువారం బటన్ నొక్కి తల్లుల ఖాతాల్లో విద్యాదీవెన పథకం నిధులను ఆయన జమచేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వంద శాతం ఫీజు రీయింబర్స్మెంట్ కింద రూ.694 కోట్లను 11.02 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఏప్రిల్, మే, జూన్ కింద జమ చేస్తున్నామన్నారు. రాఖీ పండుగ రోజు అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి విద్యాదీవెన నిధులు జమ చేయడం ఆనందంగా ఉందన్నారు. విద్యాదీవెన, వసతిదీవెన పథకాల కోసమే ఈ మూడేళ్లలో రూ.11,715 కోట్లు వ్యయం చేశామన్నారు. ఏపీలో జీఈఆర్ జాతీయ సగటుకన్నా ఎక్కువగా ఉందన్నారు. గత ప్రభుత్వంలో సీఏజీఆర్ 19శాతంగా ఉంటే, అది ప్రస్తుతం 15శాతమేనని అదే బడ్జెట్, అదే రాష్ట్రం అయినప్పటికీ డీబీటీ(డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్) ద్వారా నేరుగా పథకాల సొమ్మును లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు వివరించారు. రాఖీ పండగ సందర్భంగా వేదికపైనే జగన్కు ఓ విద్యార్థి తల్లి రాఖీ కట్టారు. పలువురు మహిళా నేతలు కూడా జగన్కు రాఖీలు కట్టి ఆశీస్సులు తీసుకున్నారు. కాగా, విద్యాదీవెన బటన్ నొక్కుడు కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి మాట్లాడకుండానే సభ ముగియడం చర్చనీయాంశమైంది. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వేదికపైనే ఉన్నప్పటికీ కనీసం ఆయనను పరిగణనలోకి తీసుకోకుండా గణాంకాలన్నీ జగనే సభ ముందుంచడం చర్చకుదారి తీసింది. కార్యక్రమం ఏర్పాటు చేసిన ప్రాంగణంలో మంచినీటి సదుపాయం లేకపోవడంతో విద్యార్థులు నానా అగచాట్లు పడ్డారు. చేబ్రోలు సెయింట్ మేరీస్ కళాశాలలో ఇంజనీరింగ్ విద్యార్థిని ఫ్లారెన్స్ స్పృహతప్పి పడిపోవడంతో వెంటనే పక్కకు తీసుకెళ్లి సపర్యలు చేయడంతో ఆమె కోలుకున్నారు.